consumer goods
-
మార్జిన్లు పెరగకపోవచ్చు.. కారణాలు..
పెరుగుతున్న పామాయిల్, ముడిసరుకు ధరల వల్ల ఎఫ్ఎంసీజీ సంస్థల మార్జిన్లు, లాభాలపై సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభావం పడనుంది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థలు గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (జీసీపీఎల్), డాబర్, మారికో ఇప్పటికే ఇందుకు సంబంధించి సంకేతాలు ఇచ్చాయి.సెప్టెంబర్ త్రైమాసికంలో మార్జిన్లలో వృద్ధి గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఫ్లాట్‌గా ఉండొచ్చని పేర్కొన్నాయి. కోప్రా, వెజిటబుల్ ఆయిల్ ధరలు పెరిగినట్టు చెప్పాయి. ‘పామాయిల్ ధరలు, తయారీ వ్యయాలు మార్చి నుంచి పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రెండంకెల స్థాయిలో వీటి పెరుగుదల నమోదైంది. పెరిగిన వ్యయ భారం మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేయకూడదని యాజమాన్యం నిర్ణయించింది. కొత్త ఉత్పత్తులు సహా దీర్ఘకాల వృద్ధికి పెట్టుబడులు కొనసాగించాలని తెలిపింది’ అని జీసీపీఎల్ పేర్కొంది. పామాయిల్, ముడి సరుకుల ధరల కారణంగా సెప్టెంబర్ క్వార్టర్ స్టాండలోన్ ఎబిటా వృద్ధి ఫ్లాట్‌గా ఉండొచ్చని తెలిపింది. ఆదాయం మాత్రం సింగిల్ డిజిట్ స్థాయిలో వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది.ఇదీ చదవండి: ఒకే ఆర్డర్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతంముడి సరుకుల ధరల పెరుగుదల..ఇటీవలే ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచిన ఫలితంగా వెజిటబుల్ నూనెల ధరలు, కోప్రా ధరలు పెరిగాయని మారికో తెలిపింది. స్థూల మార్జిన్లు మోస్తరుగానే ఉండొచ్చని పేర్కొంది. ఆదాయ వృద్ధితో పోలిస్తే.. నిర్వహణ లాభం వృద్ధి మోస్తరుగానే ఉండొచ్చని అంచనా వేసింది. మరో ఎఫ్ఎంసీజీ సంస్థ డాబర్ పంపిణీదారుల స్థాయిలో నిల్వలను సరిదిద్దే పనిలో ఉన్నట్టు తెలిపింది. ‘తక్కువ అమ్మకాలతో లాభాలపై ప్రభావం పడింది. ఆపరేటింగ్ మార్జిన్ రెండంకెల స్థాయిలో క్షీణించొచ్చు’అని పేర్కొంది. మరోవైపు ప్రకటనలపై డాబర్ తన వ్యయాలను పెంచింది. పంపిణీ ఛానల్ బలోపేతానికి వీలుగా ఈ తాత్కాలిక దిద్దుబాట్లు అవసరమని, రానున్న రోజుల్లో మెరుగైన నిర్వహణ, వృద్ధికి ఈ చర్యలు వీలు కల్పిస్తాయని చెప్పింది. మరోవైపు ప్రత్యామ్నాయ ఛానళ్ల ద్వారా ఎఫ్ఎంసీజీ అమ్మకాలు మెరుగుపడినట్టు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ ఛానళ్ల ద్వారా ఆదాయం రెండంకెల స్థాయిలో పెరిగినట్టు అదానీ విల్మార్ ప్రకటించింది. ముఖ్యంగా ఈ–కామర్స్ ఛానళ్ల ద్వారా గడిచిన ఏడాది కాలంలో ఆదాయం నాలుగు రెట్లు వృద్ధి చెందినట్టు తెలిపింది. -
దక్షిణాదిలో మొదటి తయారీ యూనిట్
ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) ఉత్పత్తులను తయారు చేస్తున్న ప్రముఖ కంపెనీ డాబర్ తమిళనాడులోని ‘సిప్కాట్ ఫుడ్ పార్క్’లో తయారీ యూనిట్ ప్రారంభించనుంది. ఈ యూనిట్ నిర్మాణానికిగాను డాబర్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ భారతదేశంలో కంపెనీకి ఈ ప్లాంట్ మొదటిది కావడం విశేషం.కన్జూమర్ గూడ్స్ కంపెనీ డాబర్ తయారీ యూనిట్ కోసం రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. మొదటిదశ పనుల కోసం రూ.135 కోట్లు వెచ్చించనుంది. విల్లుపురం జిల్లా తిండివనంలోని సిప్కాట్ ఫుడ్ పార్క్‌లో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా వివరాల వెల్లడించారు. Welcome to Tamil Nadu, @DaburIndia! In fact, welcome to South India! In the presence of Honourable @CMOTamilNadu Thiru. @MKStalin avargal, @Guidance_TN today signed an MoU with Dabur for the establishment of a world-class manufacturing plant, their FIRST EVER in South India,… pic.twitter.com/1rAazmCVOH— Dr. T R B Rajaa (@TRBRajaa) August 22, 2024‘కన్జూమర్ గూడ్స్ కంపెనీ డాబర్ తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్లాంట్ కంపెనీకి దక్షిణాదిలో మొదటిది కావడం విశేషం. దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా కంపెనీ రానున్న ఐదేళ్లలో రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. మొదటిదశలో రూ.135 కోట్లు పెట్టుబడి పెడుతుంది. దీనివల్ల సుమారు 250 మందికి ఉపాధి లభిస్తుంది. ఆ ప్లాంట్‌లో హోమ్‌కేర్, పర్సనల్ కేర్, జ్యూస్ ఉత్పత్తులను తయారు చేస్తారు. దీంతో స్థానిక రైతులకు మేలు జరుగుతుంది’ అని మంత్రి అన్నారు. -
వినియోగ ఉత్పత్తులకు మంచి డిమాండ్
హైదరాబాద్: సాంకేతిక వినియోగ వస్తువుల రంగం ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల్లో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతం వృద్ధి నమోదు చేసినట్టు జీఎఫ్కే మార్కెట్ ఇంటెలిజెన్స్ తెలిపింది. స్మార్ట్ఫోన్లు, మొబైల్ ఫోన్లతో కూడిన టెలికం ఉత్పత్తుల విభాగంలో అమ్మకాల పరిమాణం 4 శాతం తగ్గింది. విలువ పరంగా 12 శాతం పెరిగింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో, 2022లోని ఇదే కాలంతో పోలిస్తే కొన్ని రంగాలు గణనీయమైన వృద్ధిని చూశాయి. ‘‘భారత కన్జ్యూమర్ మార్కెట్ మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా పరిణామ క్రమంలో ఉంది. మార్కెట్లో వినూత్నమైన ఉత్పత్తులకు మంచి డిమాండ్ నెలకొంది. టెక్నికల్ కన్జ్యూమర్ గూడ్స్ మార్కెట్ విలువ పరంగా 8 శాతం చక్కని వృద్ధిని ప్రదర్శించింది. కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ రంగం (ఆడియో, వీడియో) 13 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది’’అని జీఎఫ్కే మార్కెట్ నిపుణురాలు సౌమ్య ఛటర్జీ తెలిపారు. జీఎఫ్కే మార్కెట్ ఇంటెలిజెన్స్ ఆఫ్‌లైన్ రిటైల్ ట్రాకింగ్ నివేదిక ప్రకారం.. ► స్మార్ట్ఫోన్లు, మొబైల్ ఫోన్లు మంచి పనితీరు చూపించాయి. విలువ పరంగా 12 శాతం అధికంగా అమ్మకాలు జరిగాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్ విభాగం విలువ పరంగా 14 శాతం, పరిణామం పరంగా 3 శాతం వృద్దిని నమోదు చేసింది. ముఖ్యంగా రూ.30,000కు పైన ఉన్న స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 50 వృద్ధి కనిపించింది. ► ప్రధాన గృహోపకరణాల విభాగం ఆశాజనకమైన పనితీరు చూపించింది. ఎయిర్ కండీషనర్లలో 7 శాతం వృద్ధి కనిపించింది. వాషింగ్ మెషిన్ల అమ్మకాలు 6 శాతం పెరిగాయి. మైక్రోవేవ్ ఓవెన్లు 4 శాతం అమ్మకాల వృద్ధిని చూశాయి. ► మంచి వినోద అనుభవాన్ని భారత వినియోగదారులు కోరుకుంటున్నారు. దీంతో ఆడియో హోమ్ సిస్టమ్‌ల అమ్మకాలు 21 శాతం పెరిగాయి. పీటీవీ/ఫ్లాట్ టెలివిజన్ల అమ్మకాలు 13 శాతం అధికంగా నమోదయ్యాయి. ► ఐటీ రంగంలో డెస్‌్కటాప్ కంప్యూటర్ల అమ్మకాలు 7 శాతం పెరిగాయి. మొబైల్ పీసీ విక్రయాలు 14 శాతం తగ్గాయి. ► రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 29 శాతం పెరిగాయి. -
పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ!
ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్న పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న దాయాది దేశానికి జల రవాణా స్తంభించినట్లు తెలుస్తోంది. పాక్ దిగుమతి చేసుకోవాలనుకున్న 2వేల లగ్జరీ కార్లతో పాటు నిత్యవసర వస్తువులు సైతం సముద్రమార్గాన నిలిచిపోయినట్లు పాక్ మీడియా సంస్థ డాన్ తెలిపింది. పాకిస్తాన్లో ఆర్ధిక సంక్షోభం మరింత ముదురుతోంది. ఇప్పటికే అప్పులిచ్చేందుకు ఆర్ధిక సంస్థలు వెనకాడుతుండగాగా..విదేశీ మారక నిల్వలు అడుగంటిపోతున్నాయి. గతేడాది డిసెంబర్ 30తో గడిచిన వారానికి పాకిస్తాన్ కేంద్ర బ్యాంక్ వద్ద విదేశీ మారక నిల్వలు 5.5 డాలర్లకు పడిపోయాయి.ఇది ఎనిమిదేళ్ల కనిష్టస్థాయి అని డాన్ ప్రచురించింది. ఖజనా ఖాళీ తాజాగా పాక్ ఖజనాలో విదేశీ మారక ద్రవ్యం లోటుతో అప్పులు, అవసరాల్ని తీర్చుకోలేక ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల్ని నిలిపివేసింది. ఆ దిగుమతుల్లో గతేడాది జులై నుంచి డిసెంబర్ మధ్య కాలానికి చెందిన 164 లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. వినియోగించిన లగ్జరీ వాహనాల దిగుమతులు కూడా పెరిగాయని డాన్ వార్తాపత్రిక నివేదిక పేర్కొంది. తగ్గిన కొనుగోలు శక్తి నివేదిక ప్రకారం, గత ఆరు నెలల్లో పాకిస్థాన్ దాదాపు 1,990 వాహనాలను దిగుమతి చేసుకుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు చాలా వరకు దిగుమతులు జరిగాయని, అక్టోబరు నుండి డిసెంబరు వరకు చాలా తక్కువ సంఖ్యలో కార్ల దిగుమతి అవుతున్నాయని సీనియర్ కస్టమ్స్ అధికారులు చెప్పినట్లు డాన్ పత్రిక నివేదించింది. కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల వాహనాల దిగుమతులు తగ్గినట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 5వేల కంటైనర్ల నిండా మరోవైపు, ఓడరేవుల వద్ద ఫుడ్,బేవరేజెస్,క్లోతింగ్,షూస్,గ్యాస్ ఆయిల్‌తో పాటు ఇండస్ట్రియల్ గూడ్స్ ప్రొడక్ట్‌లైన ఎలక్ట్రిక్ వస్తువులతో ఉన్న 5 వేల కంటే ఎక్కువ కంటైనర్లను ఉంచినట్లు హైలెట్ చేసింది. పాక్ పర్యటనలో ఐఎంఎఫ్ బృందం ఇక డిసెంబర్ నెల నాటికి పాకిస్తాన్ వద్ద విదేశీ మారక నిల్వలు 5.5 బిలియన్లు ఉండగా ప్రస్తుతం అవికాస్త కనిష్ట స్థాయిలో 3.7 బిలియన్లకు పడిపోయాయి. అయితే ఈ అప్పుల నుంచి బయట పడేసేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రతినిధుల బృందం ఈ వారం పాక్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో అక్కడి పరిస్థితుల్ని అంచనా వేసి రుణాల్ని అందించనుంది. -
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు!
ముంబై: దేశంలోని అతి పెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యుఎల్) మరోసారి సామాన్యులకు షాక్ ఇచ్చింది. ఈ నెలలో తన సబ్బులు & డిటర్జెంట్ల(వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్ బోయ్) ధరలను 3 నుంచి 20 శాతం వరకు పెంచింది. ముడి పదార్థాల ధరలు పెరగడంతోనే సరుకుల ధరలను పెంచినట్లు సంస్థ తెలిపింది. గత సంవత్సరం నవంబర్ నెలలో కూడా సబ్బులు, డిటర్జెంట్లతో సహా ఎంపిక చేసిన వస్తువుల ధరలను పెంచింది. ఈసారి అత్యధికంగా సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర పెరిగింది. దీని ధరను 20 శాతం పెంచడంతో సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర రూ.10 నుంచి రూ.12కు పెరిగింది. పెరిగిన సరుకుల ధరలు: లైఫ్ బోయ్ 125 గ్రాముల ప్యాక్ ధర రూ.29 నుంచి రూ.31కు పెరిగింది. పియర్స్ 125 గ్రాముల సబ్బు ధర రూ.76 నుంచి రూ.83కు పెరిగింది. రిన్ బండిల్ ప్యాక్(నాలుగు 250 గ్రాముల బార్ల) ధరను రూ.72 నుంచి రూ.76కు పెంచింది. అలాగే, సింగిల్ రిన్ 250 గ్రాముల బార్ ను రూ.18 నుంచి రూ.19కు పెంచింది. వీల్ డిటర్జెంట్ పౌడర్ అర కిలో ప్యాక్ ధరను రూ.30 నుంచి రూ.31కి, 1 కిలో ప్యాక్ ధరలను రూ.60 నుంచి రూ.62కు పెంచింది. హెచ్‌యుఎల్ భాటలో ఇతర కంపెనీలు.. లక్స్ సబ్బుల ధరలను కంపెనీ పెంచ లేదు. ఇన్ పుట్ ఖర్చుల ధరలు పెరగడంతో జనవరిలో తన ప్యాకేజ్డ్ గోధుమ పిండి ధరలను 5-8 శాతం, బాస్మతి బియ్యం ధరలను 8-10 శాతం పెంచనున్నట్లు అదానీ విల్మార్ గత నెలలో పేర్కొంది. పార్లే ప్రొడక్ట్స్ మార్చి నెలలో 4-5 శాతం ధరలను పెంచాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ధరలను పెంచింది. ఈ ఏడాది క్యూ4లో ధరలను పెంచవచ్చని డాబర్ ఇండియా డిసెంబర్ నెలలో తెలిపింది. కావింకేర్ తన షాంపూలు, చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలను కూడా ఈ నెలలో 2-3 శాతం వరకు పెంచనుంది. ఇన్ పుట్ ఖర్చుల ధరలు పెరగడంతోనే ధరలను పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు పేర్కొంటున్నాయి. (చదవండి: నాలుగు రోజుల్లో రూ.6.08 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..!) -
పరిశ్రమలు రయ్రయ్..!
న్యూఢిల్లీ: తయారీ, కన్జూమర్ గూడ్స్, విద్యుదుత్పత్తి రంగాల ఊతంతో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వరుసగా రెండో నెలా పెరిగింది. అక్టోబర్‌లో 3.6 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. 2019 అక్టోబర్‌లో ఐఐపీ 6.6 శాతం క్షీణించింది. చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5.2 శాతంగా నమోదు కాగా.. కరోనా వైరస్‌పరమైన పరిణామాల కారణంగా మార్చి నుంచి ఆగస్టు దాకా ప్రతికూల స్థాయిలోనే కొనసాగింది. సెప్టెంబర్‌లో స్వల్పంగా 0.5 శాతం పెరిగింది. కరోనా వైరస్ కట్టడి కోసం మార్చి 25న కేంద్రం లాక్డౌన్ విధించడంతో అన్ని రకాల కార్యకలాపాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే, ఆంక్షలను క్రమంగా ఎత్తివేసే కొద్దీ ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో ఐఐపీ 17.5 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో పారిశ్రామికోత్పత్తి సూచీ 0.1 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక విభాగాలవారీగా చూస్తే అక్టోబర్‌లో.. ► తయారీ రంగం 3.5 శాతం వృద్ధి నమోదు చేసింది. గత అక్టోబర్‌లో ఇది 5.7 శాతం క్షీణించింది. ఐఐపీలో తయారీ రంగానికి 77.6 శాతం వాటా ఉంటుంది. ► కన్జూమర్ గూడ్స్ విభాగం 17.6 శాతం పెరిగింది. గతేడాది ఇదే వ్యవధిలో ఇది 18.9 శాతం క్షీణించింది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి 7.5 శాతం వృద్ధి చెందింది. గత అక్టోబర్‌లో ఇది 3.3 శాతం క్షీణించింది. ► విద్యుదుత్పత్తి మెరుగ్గా 11.2% వృద్ధి చెందింది. మైనింగ్ రంగం 1.5% క్షీణించింది. ► పెట్టుబడులకు కొలమానంగా నిల్చే భారీ యంత్రపరికరాల ఉత్పత్తి 3.3 శాతం పెరిగింది. గతేడాది ఇదే వ్యవధిలో క్షీణత 22.4 శాతం. ► ఇన్ఫ్రా/నిర్మాణ రంగ ఉత్పత్తుల విభాగం 7.8% వృద్ధి చెందింది. అయితే, ప్రైమరీ గూడ్స్ విభాగంలో 3.3% క్షీణత నమోదైంది. ఇంకా బలహీనంగానే.. ఐఐపీ ఎనిమిది నెలల గరిష్టానికి ఎగిసినప్పటికీ.. అక్టోబర్ డేటా ఊహించిన దానికన్నా బలహీనంగానే కనిపిస్తోందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ అదితి నాయర్ పేర్కొన్నారు. ఇది 5.5 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. ‘ఆశాభావంతోనే ఉన్నప్పటికీ ఎకానమీ పటిష్టంగా రికవరీ బాటలో ఉందని విశ్వసించడానికి మరి కొన్ని నెలలు వేచి చూడాల్సి రావచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే కొద్ది నెలలు వృద్ధి బాటలో ఉండి తర్వాత కుప్పకూలిన ఉదంతాలు ఉన్నాయి‘ అని నాయర్ పేర్కొన్నారు. మరోవైపు, ఐఐపీ గణాంకాలు సానుకూలంగా ఆశ్చర్యపర్చినప్పటికీ.. ఇదే ధోరణి కొనసాగకపోవచ్చని ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సంస్థ ఈడీ సుజన్ హజ్రా అభిప్రాయపడ్డారు. భారీ ఉద్దీపన, ప్రభుత్వ వ్యయాలు, తక్కువ స్థాయిలో వడ్డీ రేట్లు, నిధుల లభ్యత మెరుగుపడటం, సానుకూల ఐఐపీ.. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి గణాంకాలు.. ఎకానమీ సత్వరం కోలుకోవడానికి తోడ్పడ్డాయని మిల్‌వుడ్ కేన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు నిష్ భట్ పేర్కొన్నారు. పటిష్టమైన రికవరీ సుదీర్ఘకాలం కొనసాగగలదని అంచనా వేశారు. -
గల్లీ కొట్టు.. సూపర్ హిట్టు!
సాక్షి, హైదరాబాద్: ఇళ్ల దగ్గరి కిరాణా షాపులు, గల్లీ చివరి దుకాణాల్లో సరుకుల కొనుగోళ్లు పెరిగాయి. ప్రతీ ముగ్గు రు వినియోగదారుల్లో ఇద్దరు ఎక్కువగా లోకల్ బ్రాండ్స్ సరుకులు, వస్తువులనే కొంటామంటున్నారు. ప్రస్తుతం భారత్‌లోని ‘ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) మార్కెట్’కు డిమాండ్ పెరిగి దాదాపుగా కరోనాకు ముందు నాటి స్థాయికి చేరుకుంటోంది. గతంలో మాదిరే మళ్లీ డియోడరెంట్స్, హెయిర్ కలర్స్, స్కిన్‌కేర్ వంటి ప ర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కొనుగోళ్లకు కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి తినడం, బయటి ఫుడ్ ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోవడంతో ఇళ్లలోనే వండుకునే వారి శాతం పెరిగి ప్యాకేజ్డ్ ఆటా, రిఫైన్డ్ ఆయిల్ వంటి వాటికి జూన్‌లో భారీగా డిమాండ్ పెరిగింది. వీటితో పాటు లిక్విడ్ సోప్స్, చ్యవన్‌ప్రాశ్, బ్రాండెడ్ తేనె వంటి వాటి కొనుగోళ్లు పెరిగాయని గ్లోబల్ డేటా అనలిటిక్స్ కంపెనీ నీల్సన్ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. పుంజుకుంటున్న కొనుగోళ్లు: పట్టణాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లోనూ నిత్యావసరా లు, ఇతర సంప్రదాయక కొనుగోళ్లతో పాటు ఆహారేతర కేటగిరీల్లోనూ కొనుగోళ్లు పెరిగాయి. ఎఫ్ఎంసీజీ మార్కెట్లో గతేడాది జనవరి–మే మధ్యకాలంతో ఈ ఏడాది అదే కాలాన్ని పోలిస్తే వినియోగదారుల మార్కెట్ తక్కువగా నమోదు కాగా, ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నట్టు తేలింది. పెరిగిన బ్యూటీకేర్ అమ్మకాలు: లాక్డౌన్ సమయం లో కాస్మటిక్స్, సౌందర్య సాధనాలు, సంబంధిత వస్తువులపై పెట్టే ఖర్చును కస్టమర్లు బాగా తగ్గించుకున్నారు. అలాగే, రోజువారీ వస్తువుల కేటగిరీలోని టూత్పేస్ట్లు, షాంపూలు, హెయి ర్ ఆయిల్, వాషింగ్ పౌడర్, సబ్బులు వంటివి గతంతో పోలిస్తే మితంగా కొనుగోలు చేసి ఉపయోగించారు. ఇప్పుడు మళ్లీ జూన్‌లో వీటి కొనుగోళ్లు పెరగడంతో పా టు సౌందర్య సాధనాలు, ఇతర బ్యూటీకేర్ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగినట్టు సర్వేలో తేలింది. ఇంటికే సరుకులు.. నీల్సన్ సంస్థ ఆన్లైన్ ద్వారా దేశంలోని 22 నగరాల్లోని వినియోగదారుల ను వివిధ అంశాలపై ప్రశ్నించిం ది. పట్టణ ప్రాంతాల్లోని పలువురు కస్టమర్లు వస్తువుల్ని డోర్ డెలి వరీ చేయాలని కో రుకుంటున్నట్టు వెల్లడైంది. దీంతో కిరాణా షాపులు మొదలు డిపార్ట్మెంటల్ స్టోర్స్ వరకు ఫోన్ లేదా వాట్సాప్ ఆధారిత వ్యవస్థల ద్వారా వినియోగదారుల ఇళ్లకే సరుకులు çపంపే ఏర్పాట్లు చేస్తున్నాయి. మున్ముందు తమ ఆన్లైన్ షాపింగ్‌ను 20 శాతానికిపైగా పెంచబోతున్నట్టు 62 శాతం మంది చెప్పినట్టు ఈ అధ్యయన సంస్థ తెలిపింది. లోకల్ బ్రాండ్ అంటే.. లాక్డౌన్, చైనాతో కయ్యం.. ఈ పరిణామాల నేపథ్యంలో లోకల్ ప్రొడక్ట్స్, బ్రాండ్స్‌కు డిమాండ్ పె రుగుతోంది. తాము కొనే వస్తువు ల్లో స్థానిక బ్రాండ్స్‌కే మొగ్గుచూపుతామని ప్రతీ ముగ్గురు వినియోగదారుల్లో ఇద్దరు చెప్పినట్టు నీల్సన్ సర్వే తెలిపింది. సర్వేలో ‘లోకల్ బ్రాండ్’ అంశంపై ఎవరెలా స్పందించారంటే.. ♦ 78% దేశంలో తయారైనదే స్థానిక బ్రాండ్ ♦ 50% లోకల్ బ్రాండ్లే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని పెంచుతాయి ♦ 49% దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండే బ్రాండే స్థానిక బ్రాండ్ ♦ 48% బ్రాండ్ హెడ్‌క్వార్టర్ భారత్‌లో ఉంటే అదే లోకల్ బ్రాండ్ ♦ 43% ఆయుర్వేద ఔషధాలు, సహజ మూలకాలు వంటి వస్తువుల తయారీ సంస్థలే లోకల్ బ్రాండ్ -
కార్ల కంపెనీలకు పండుగే
వాహనాలు, వినియోగ వస్తువులపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు కొనసాగింపు - ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ అమలు - ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన న్యూఢిల్లీ: గత ప్రభుత్వం తీసుకున్న ఎక్సైజ్ సుంకం(డ్యూటీ) తగ్గింపు నిర్ణయాన్ని మరో ఆరు నెలలపాటు కొనసాగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం పేర్కొన్నారు. ఫిబ్రవరిలో వెలువరించిన మధ్యంతర బడ్జెట్లో ఆటో, క్యాపిటల్ గూడ్స్, వినియోగ వస్తు రంగాలకు వర్తించేలా అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ఎక్సైజ్ డ్యూటీలో కోత విధించారు. ఈ గడువు జూన్ 30తో ముగియనుంది. ఫలితంగా కొత్త ప్రభుత్వం డ్యూటీ తగ్గింపును ఈ ఏడాది డిసెంబర్ 31వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఆర్థిక వ్యసవ్థకు జవసత్వాలను చేకూర్చేందుకు వీలుగా డ్యూటీ తగ్గింపును కొనసాగించేందుకు జైట్లీ నిర్ణయించారు. దీంతో కార్లు, ఎస్‌యూవీలు, ద్విచక్ర వాహనాలతోపాటు, ఏసీలు, ఫ్రిడ్జ్‌ల వంటి వినియోగ వస్తువులు, తయారీ రంగానికి సంబంధించిన పరికరాలపై ఇప్పటికే వర్తిస్తున్న 6-2% మధ్య డ్యూటీ కోత ఈ ఏడాది చివరి వరకూ అమలుకానుంది. ఎక్సైజ్ తగ్గింపు పొడిగింపు వల్ల ఆదాయంలో కోత పడినప్పటికీ, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుందని జైట్లీ పేర్కొన్నారు. జూలై 10న బడ్జెట్‌ను ప్రకటించనున్నప్పటికీ, డ్యూటీలో కోత గడువు జూన్ 30తో ముగియనుండటంతో ప్రస్తుతం పొడిగింపు నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చిందని వివరించారు. పరిశ్రమలను ఆదుకునే బాటలో డిమాండ్ తగ్గి అమ్మకాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఆటో, క్యాపిటల్ గూడ్స్, వినియోగ వస్తు రంగ పరిశ్రమలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం వివిధ విభాగాలకు సంబంధించి 6-2% మధ్య ఎక్సైజ్ డ్యూటీలో కోత విధించింది. దీంతో ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, వాణిజ్య వాహనాలపై 12% నుంచి 8%కు దిగివచ్చిన డ్యూటీ డిసెంబర్ చివరి వరకూ అదే స్థాయిలో అమలుకానుంది. ఈ బాటలో ఎస్‌యూవీలపై 24%(అంతక్రితం 30%), పెద్ద కార్లపై 24%(గతంలో 27%), మధ్యతరహా కార్లపై 20%(గతంలో 24%) చొప్పున వర్తింపు కొనసాగనుంది. ఇక క్యాపిటల్ గూడ్స్‌కు సంబంధించి 12% నుంచి 10%కు దిగివచ్చిన డ్యూ టీలు యథాతథంగా అమలుకానున్నాయి. వినియోగ వస్తువులపై కూడా 12% నుంచి 10%కు దిగివచ్చిన డ్యూటీలు మరో 6 నెలలపాటు కొనసాగనున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14)లో తయారీ రంగం 0.7% క్షీణత(ప్రతికూల వృద్ధి)ను చవిచూసిన నేపథ్యంలో తాజా నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. మే నెలలో కార్లు రయ్... ఎక్సైజ్ డ్యూటీ కోత నేపథ్యంలో ఆటో కంపెనీలు కార్ల ధరలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు ప్రోత్సాహాన్నందించాయి. దీంతో వరుసగా రెండు నెలలపాటు క్షీణించిన ఆటో అమ్మకాలు మే నెలలో 3%పైగా పురోగమించాయి. ఇక దశాబ్ద కాలంలో తొలిసారిగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు 6.7% క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో 2013-14లోనూ 4.65% చొప్పున నీరసించడం గమనార్హం. ప్రస్తుత ఎక్సైజ్ డ్యూటీ తీరిదీ.. ద్విచక్ర వాహనాలు 8% చిన్న కార్లు 8% వాణిజ్య వాహనాలు 8% ఎస్‌యూవీలపై 24% పెద్ద కార్లపై 24% మధ్యతరహా కార్లపై 20% క్యాపిటల్ గూడ్స్ 10% వినియోగ వస్తువులపై 10% తయారీ వ్యయాల ఒత్తిడికి చెక్ ఎక్సైజ్ డ్యూటీల కోత పొడిగింపు నిర్ణయం వినియోగ వస్తు రంగానికి ప్రోత్సాహాన్నిస్తుందని హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా పేర్కొన్నారు. రెండేళ్లుగా మందగించిన వినియోగ వస్తు పరిశ్రమకు డ్యూటీ తగ్గింపు పొడిగింపు నిర్ణయం ఉపశమనాన్ని కలిగిస్తుందని గోద్రెజ్ అప్లయన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ కమల్ నంది వ్యాఖ్యానించారు. ఇక ఇదే విధమైన అభిప్రాయాలను సీఈఏఎంఏ సెక్రటరీ జనరల్ సురేష్ ఖన్నా, వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శతంను దాస్ గుప్తా సైతం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పరిశ్రమ ఎదుర్కొంటున్న తయారీ వ్యయాల ఒత్తిడి కొంతమేర తగ్గుతుందని గుప్తా అభిప్రాయపడ్డారు. డ్యూటీ తగ్గింపు నిర్ణయంతో దేశీయంగా తయారీ రంగం ఊపందుకుంటుందని దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు శామ్సంగ్, ఎల్జీ వ్యాఖ్యానించాయి. ఆటో పరిశ్రమకు మేలు... ఎక్సైజ్ కోత కొనసాగింపు ఆటో పరిశ్రమకు మేలు చేస్తుందని మారుతీ సుజుకీ సీవోవో మయాంక్ పరీక్ పేర్కొన్నారు. ఇటీవల కొన్ని వారాలుగా పుంజుకున్న డిమాండ్ పరిస్థితులు కొనసాగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. గత రెండేళ్లలో ఆటో పరిశ్రమ కష్టాలలో చిక్కుకున్నదని, గత నెలలోనే కొంతమేర ఆశావహ పరిస్థితులు నెలకొన్నాయని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ వివరించారు. తాజాగా డ్యూటీ కోతను పొడిగించడం వల్ల డి మాండ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. డ్యూటీ కోత పొడిగింపు సంతోషించదగ్గ పరిణామమని జనరల్ మోటార్స్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్ పి.బాలేంద్రన్ వ్యాఖ్యానించారు. బడ్జెట్లో కోతను మార్చి వరకూ పొడిగించడంతోపాటు, మరిన్ని ప్రోత్సాహకర చర్యలను ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం కార్లకు డిమాండ్‌ను పెంచుతుందని హ్యుందా య్ఇండియా సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాస్తవ చెప్పారు. తాజా నిర్ణయం ఆటో పరిశ్రమకు పెద్ద ఉపశమనమని సియామ్ ఈడీ విష్ణు మాథుర్ పేర్కొన్నారు. సాహసోపేత నిర్ణయం ద్రవ్యలోటు సమస్యలున్నా.. డ్యూటీ తగ్గింపు పొడిగింపు ద్వారా ఆర్థిక మంత్రి జైట్లీ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. ఇది పారిశ్రామికోత్పత్తి వృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. తాజా నిర్ణయం తయారీ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నదని ఫిక్కీ మాన్యుఫాక్చరింగ్ కమిటీ చైర్మన్ ఎంఎం సింగ్ చెప్పారు. ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నదని అన్నారు. ఈ నిర్ణయం వృద్ధికి ఊత మివ్వడంతోపాటు, ఉద్యోగ అవకాశాలకు తెరలేపుతుందని పీహెచ్డీ చాంబర్ పేర్కొంది. -
తయారీకి బూస్ట్..!
మందగమనంతో అల్లాడుతున్న దేశ ఆర్థిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టడమే లక్ష్యమని ఘంటాపథంగా చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ.. దీనికి సత్వర చికిత్సగా తయారీ రంగంపైనే ప్రధానంగ దృష్టిసారించనున్నారు. వృద్ధి రేటుకు ఊతమిస్తూ... దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారీగా కొత్త కొలువులు వచ్చేలా చేయాలంటే తయారీ రంగమే చాలా కీలకం. దీంతో ఈ రంగానికి సంబంధించిన భారీ ప్రోత్సాహకర చర్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి బడ్జెట్లో ప్రకటించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా బడ్జెట్‌కు ముందే ఆటోమొబైల్, వినియోగ వస్తువుల(కన్సూమర్ గూడ్స్) రంగాలకు అత్యంత ఊరటనిచ్చే చర్యలు వెలువడటం విశేషం. ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన ఎక్సైజ్ సుంకాల తగ్గింపును డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా తయారీ రంగంపై మోడీ సర్కారు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్లు స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇదీ...: మొత్తం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 15.2% వాటా కలిగిన తయారీ రంగం గత రెండుమూడేళ్లుగా తీవ్ర ఒడిదుడుకుల్లో పయనిస్తోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1% వృద్ధిరేటును మాత్రమే నమోదు చేసిన ఈ రంగం... గతేడాది (2013-14)లో తిరోగమనంలోకి జారిపోయిం ది. మైనస్ 0.7% క్షీణించింది. మొత్తం పారిశ్రామికోత్పత్తిలో 70% వాటా తయారీ రంగానిదే. విజ్ఞప్తులు.. అంచనాలు ఇవీ... కార్మిక చట్టాల్లో మరింత స్పష్టత, పన్నుల హేతుబద్ధీకరణపై ఆర్థిక శాఖ దృష్టిసారిస్తోంది. కొన్ని కీలకమైన తయారీ పరిశ్రమల్లో పూర్తిగా తయారైన ఉత్పత్తిపై తక్కువ పన్నులు, సుంకాలు అమలవుతుండగా... వినియోగిస్తున్న ముడివస్తువుల(రసాయనాలు ఇతరత్రా)పై అధికం సుంకాలు ఉన్నాయి. వీటి మధ్య అసమానతల తొలగింపు ప్రధానాంశం. ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం పడకుండా ఈ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు కొన్ని పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడుల జోరును పెంచి... భారీగా కొలువులను కల్పించే దిశగా ప్రత్యేక ప్రాం తీయ తయారీ కేంద్రాల(హబ్)ను ఏర్పాటు చేయాలనేది మోడీ సర్కారు యోచన. ఈ దిశగా బడ్జెట్లో ప్రకటనలు, చర్యలు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల(ఎస్ ఈ జెడ్)ను కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) నుంచి మినహాయించాలనేది ఎగుమతిదారుల ప్రధాన డిమాండ్. దీనివల్ల తయారీ రంగానికి ఉత్తేజం కల్పించినట్లవుతుందని ప్రీ-బడ్జెట్ విజ్ఞప్తుల్లో పేర్కొంది. ఎస్ఈజెడ్లను సేవల పన్ను నుంచి మినహాయించాలనీ కోరింది. ప్రస్తుతం ఎస్ఈజడ్ డెవలపర్లు, సంస్థల బుక్ ఫ్రాఫిట్పై 18.5 శాతం మ్యాట్ అమలవుతోంది. ఒకవేళ మినహాయించడం సాధ్యపడకపోతే కనీసం 7.5 శాతానికి తగ్గించాలనేది ఎగుమతి సంస్థల విజ్ఞప్తి. -
టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు దిగొస్తాయ్!
రేట్ల తగ్గింపు పరిశీలిస్తున్నాం: ఎల్జీ, ప్యానాసోనిక్ న్యూఢిల్లీ: ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు ఇతరత్రా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలుదిగొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కన్జూమర్ గూడ్స్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తామని ఆర్థిక మంత్రి పి. చిదంబరం మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించడంతో ఈ రంగంలోని కంపెనీలు స్పందించాయి. ధరలు తగ్గించే విషయమై ప్యానాసానిక్ ఇండియా, ఎల్జీ ఇండియా కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ తగ్గింపు ప్రభావాన్ని మదింపు చేస్తున్నామని వెల్లడించాయి. మార్కెట్ పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరలపై నిర్ణయం తీసుకుంటామని ఎల్జీ ఇండియా ఎండీ సూన్ క్వాన్ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ సానుకూలంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మార్కెట్ పరిస్థితులను ఈ బడ్జెట్ మెరుగుపరుస్తుందని, తయారీ రంగానికి ఊపునిస్తుందని ఆయన చెప్పారు. వినియోగదారుల సెంటిమెంట్ సానుకూలంగా మారుస్తుందని, కొత్త వస్తువుల కొనుగోళ్లకు ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. 2 శాతం ఎక్సైజ్ సుంకం తగ్గింపు అనేది ధరలపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, ఇది ఆహ్వానించదగ్గ చర్య అని ప్యానాసానిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ చెప్పారు. -
సెకండ్ హ్యాండ్ అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: భారత్‌లో సెకండ్ హ్యాండ్ మార్కెట్ జోరు పెరుగుతోందని ఆసోచామ్ తాజా అధ్యయనం తెలిపింది. ఆసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్. రావత్ పేర్కొన్న వివరాల ప్రకారం.., రూ.80 వేల కోట్లుగా ఉన్న సెకండ్ హ్యాండ్ మార్కెట్ విలువ 2015 కల్లా రూ.1,15,000 కోట్లకు పెరుగుతుంది. వడ్డీరేట్లు అధికంగా ఉండడం, నష్టభయం వంటి కారణాల వల్ల సెకండ్ హ్యాండ్ వస్తువులు వినియోగించే సంస్కృతి పెరుగుతోంది. వినియోగదారుల ఆశలు పెరిగినంతగా ఆదాయాలు పెరగకపోవడంతో సెకండ్ హ్యాండ్ వస్తువులకు డిమాండ్ జోరుగా ఉంది. ఇది వేగంగా విస్తరించే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, పారిశ్రామిక యంత్రాలు, పుస్తకాలు తదితర వస్తువులు ప్రస్తుతం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్ల అమ్మకాలు మాత్రం తగ్గుతున్నాయి.