తయారీకి బూస్ట్..!
మందగమనంతో అల్లాడుతున్న దేశ ఆర్థిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టడమే లక్ష్యమని ఘంటాపథంగా చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ.. దీనికి సత్వర చికిత్సగా తయారీ రంగంపైనే ప్రధానంగ దృష్టిసారించనున్నారు. వృద్ధి రేటుకు ఊతమిస్తూ... దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారీగా కొత్త కొలువులు వచ్చేలా చేయాలంటే తయారీ రంగమే చాలా కీలకం. దీంతో ఈ రంగానికి సంబంధించిన భారీ ప్రోత్సాహకర చర్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి బడ్జెట్‌లో ప్రకటించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా బడ్జెట్‌కు ముందే ఆటోమొబైల్, వినియోగ వస్తువుల(కన్సూమర్ గూడ్స్) రంగాలకు అత్యంత ఊరటనిచ్చే చర్యలు వెలువడటం విశేషం.
ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన ఎక్సైజ్ సుంకాల తగ్గింపును డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా తయారీ రంగంపై మోడీ సర్కారు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్లు స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితి ఇదీ...: మొత్తం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 15.2% వాటా కలిగిన తయారీ రంగం గత రెండుమూడేళ్లుగా తీవ్ర ఒడిదుడుకుల్లో పయనిస్తోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1% వృద్ధిరేటును మాత్రమే నమోదు చేసిన ఈ రంగం... గతేడాది (2013-14)లో తిరోగమనంలోకి జారిపోయిం ది. మైనస్ 0.7% క్షీణించింది. మొత్తం పారిశ్రామికోత్పత్తిలో 70% వాటా తయారీ రంగానిదే.
విజ్ఞప్తులు.. అంచనాలు ఇవీ...
కార్మిక చట్టాల్లో మరింత స్పష్టత, పన్నుల హేతుబద్ధీకరణపై ఆర్థిక శాఖ దృష్టిసారిస్తోంది. కొన్ని కీలకమైన తయారీ పరిశ్రమల్లో పూర్తిగా తయారైన ఉత్పత్తిపై తక్కువ పన్నులు, సుంకాలు అమలవుతుండగా... వినియోగిస్తున్న ముడివస్తువుల(రసాయనాలు ఇతరత్రా)పై అధికం సుంకాలు ఉన్నాయి. వీటి మధ్య అసమానతల తొలగింపు ప్రధానాంశం.
ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం పడకుండా ఈ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు కొన్ని పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి.
పెట్టుబడుల జోరును పెంచి... భారీగా కొలువులను కల్పించే దిశగా ప్రత్యేక ప్రాం తీయ తయారీ కేంద్రాల(హబ్)ను ఏర్పాటు చేయాలనేది మోడీ సర్కారు యోచన. ఈ దిశగా బడ్జెట్‌లో ప్రకటనలు, చర్యలు ఉండొచ్చని భావిస్తున్నారు.
ప్రత్యేక ఆర్థిక మండళ్ల(ఎస్ ఈ జెడ్)ను కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) నుంచి మినహాయించాలనేది ఎగుమతిదారుల ప్రధాన డిమాండ్. దీనివల్ల తయారీ రంగానికి ఉత్తేజం కల్పించినట్లవుతుందని ప్రీ-బడ్జెట్ విజ్ఞప్తుల్లో పేర్కొంది. ఎస్‌ఈజెడ్‌లను సేవల పన్ను నుంచి మినహాయించాలనీ కోరింది.
ప్రస్తుతం ఎస్‌ఈజడ్ డెవలపర్లు, సంస్థల బుక్ ఫ్రాఫిట్‌పై 18.5 శాతం మ్యాట్ అమలవుతోంది. ఒకవేళ మినహాయించడం సాధ్యపడకపోతే కనీసం 7.5 శాతానికి తగ్గించాలనేది ఎగుమతి సంస్థల విజ్ఞప్తి.