పెరుగుతున్న పామాయిల్, ముడిసరుకు ధరల వల్ల ఎఫ్‌ఎంసీజీ సంస్థల మార్జిన్లు, లాభాలపై సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభావం పడనుంది. ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థలు గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (జీసీపీఎల్), డాబర్, మారికో ఇప్పటికే ఇందుకు సంబంధించి సంకేతాలు ఇచ్చాయి.
సెప్టెంబర్ త్రైమాసికంలో మార్జిన్లలో వృద్ధి గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఫ్లాట్‌గా ఉండొచ్చని పేర్కొన్నాయి. కోప్రా, వెజిటబుల్ ఆయిల్ ధరలు పెరిగినట్టు చెప్పాయి. ‘పామాయిల్ ధరలు, తయారీ వ్యయాలు మార్చి నుంచి పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రెండంకెల స్థాయిలో వీటి పెరుగుదల నమోదైంది. పెరిగిన వ్యయ భారం మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేయకూడదని యాజమాన్యం నిర్ణయించింది. కొత్త ఉత్పత్తులు సహా దీర్ఘకాల వృద్ధికి పెట్టుబడులు కొనసాగించాలని తెలిపింది’ అని జీసీపీఎల్ పేర్కొంది. పామాయిల్, ముడి సరుకుల ధరల కారణంగా సెప్టెంబర్ క్వార్టర్ స్టాండలోన్ ఎబిటా వృద్ధి ఫ్లాట్‌గా ఉండొచ్చని తెలిపింది. ఆదాయం మాత్రం సింగిల్ డిజిట్ స్థాయిలో వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది.
ఇదీ చదవండి: ఒకే ఆర్డర్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం
ముడి సరుకుల ధరల పెరుగుదల..
ఇటీవలే ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచిన ఫలితంగా వెజిటబుల్ నూనెల ధరలు, కోప్రా ధరలు పెరిగాయని మారికో తెలిపింది. స్థూల మార్జిన్లు మోస్తరుగానే ఉండొచ్చని పేర్కొంది. ఆదాయ వృద్ధితో పోలిస్తే.. నిర్వహణ లాభం వృద్ధి మోస్తరుగానే ఉండొచ్చని అంచనా వేసింది. మరో ఎఫ్‌ఎంసీజీ సంస్థ డాబర్ పంపిణీదారుల స్థాయిలో నిల్వలను సరిదిద్దే పనిలో ఉన్నట్టు తెలిపింది. ‘తక్కువ అమ్మకాలతో లాభాలపై ప్రభావం పడింది. ఆపరేటింగ్ మార్జిన్ రెండంకెల స్థాయిలో క్షీణించొచ్చు’అని పేర్కొంది. మరోవైపు ప్రకటనలపై డాబర్ తన వ్యయాలను పెంచింది. పంపిణీ ఛానల్ బలోపేతానికి వీలుగా ఈ తాత్కాలిక దిద్దుబాట్లు అవసరమని, రానున్న రోజుల్లో మెరుగైన నిర్వహణ, వృద్ధికి ఈ చర్యలు వీలు కల్పిస్తాయని చెప్పింది. మరోవైపు ప్రత్యామ్నాయ ఛానళ్ల ద్వారా ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు మెరుగుపడినట్టు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ ఛానళ్ల ద్వారా ఆదాయం రెండంకెల స్థాయిలో పెరిగినట్టు అదానీ విల్‌మార్ ప్రకటించింది. ముఖ్యంగా ఈ–కామర్స్ ఛానళ్ల ద్వారా గడిచిన ఏడాది కాలంలో ఆదాయం నాలుగు రెట్లు వృద్ధి చెందినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment