కార్ల కంపెనీలకు పండుగే | Jaitley extends excise duty concessions by 6 months | Sakshi
Sakshi News home page

కార్ల కంపెనీలకు పండుగే

Published Thu, Jun 26 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

కార్ల కంపెనీలకు పండుగే

కార్ల కంపెనీలకు పండుగే

వాహనాలు, వినియోగ వస్తువులపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు కొనసాగింపు
- ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ అమలు    
- ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన

న్యూఢిల్లీ: గత ప్రభుత్వం తీసుకున్న ఎక్సైజ్ సుంకం(డ్యూటీ) తగ్గింపు నిర్ణయాన్ని మరో ఆరు నెలలపాటు కొనసాగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం పేర్కొన్నారు. ఫిబ్రవరిలో వెలువరించిన మధ్యంతర బడ్జెట్‌లో ఆటో, క్యాపిటల్ గూడ్స్, వినియోగ వస్తు రంగాలకు వర్తించేలా అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ఎక్సైజ్ డ్యూటీలో కోత విధించారు. ఈ గడువు జూన్ 30తో ముగియనుంది. ఫలితంగా కొత్త ప్రభుత్వం డ్యూటీ తగ్గింపును ఈ ఏడాది డిసెంబర్ 31వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఆర్థిక వ్యసవ్థకు జవసత్వాలను చేకూర్చేందుకు వీలుగా డ్యూటీ తగ్గింపును కొనసాగించేందుకు జైట్లీ నిర్ణయించారు.

దీంతో కార్లు, ఎస్‌యూవీలు, ద్విచక్ర వాహనాలతోపాటు, ఏసీలు, ఫ్రిడ్జ్‌ల వంటి వినియోగ వస్తువులు, తయారీ రంగానికి సంబంధించిన పరికరాలపై ఇప్పటికే వర్తిస్తున్న 6-2% మధ్య డ్యూటీ కోత ఈ ఏడాది చివరి వరకూ అమలుకానుంది. ఎక్సైజ్ తగ్గింపు పొడిగింపు వల్ల ఆదాయంలో కోత పడినప్పటికీ, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుందని జైట్లీ పేర్కొన్నారు. జూలై 10న బడ్జెట్‌ను ప్రకటించనున్నప్పటికీ, డ్యూటీలో కోత గడువు జూన్ 30తో ముగియనుండటంతో ప్రస్తుతం పొడిగింపు నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చిందని వివరించారు.  

పరిశ్రమలను ఆదుకునే బాటలో
డిమాండ్ తగ్గి అమ్మకాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఆటో, క్యాపిటల్ గూడ్స్, వినియోగ వస్తు రంగ పరిశ్రమలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం వివిధ విభాగాలకు సంబంధించి 6-2% మధ్య ఎక్సైజ్ డ్యూటీలో కోత విధించింది. దీంతో ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, వాణిజ్య వాహనాలపై 12% నుంచి 8%కు దిగివచ్చిన డ్యూటీ డిసెంబర్ చివరి వరకూ అదే స్థాయిలో అమలుకానుంది.

ఈ బాటలో ఎస్‌యూవీలపై 24%(అంతక్రితం 30%), పెద్ద కార్లపై 24%(గతంలో 27%), మధ్యతరహా కార్లపై 20%(గతంలో 24%) చొప్పున వర్తింపు కొనసాగనుంది. ఇక క్యాపిటల్ గూడ్స్‌కు సంబంధించి 12% నుంచి 10%కు దిగివచ్చిన డ్యూ టీలు యథాతథంగా అమలుకానున్నాయి. వినియోగ వస్తువులపై కూడా 12% నుంచి 10%కు దిగివచ్చిన డ్యూటీలు మరో 6 నెలలపాటు కొనసాగనున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14)లో తయారీ రంగం 0.7% క్షీణత(ప్రతికూల వృద్ధి)ను చవిచూసిన నేపథ్యంలో తాజా నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.

మే నెలలో కార్లు రయ్...
ఎక్సైజ్ డ్యూటీ కోత నేపథ్యంలో ఆటో కంపెనీలు కార్ల ధరలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు ప్రోత్సాహాన్నందించాయి. దీంతో వరుసగా రెండు నెలలపాటు క్షీణించిన ఆటో అమ్మకాలు మే నెలలో 3%పైగా పురోగమించాయి. ఇక దశాబ్ద కాలంలో తొలిసారిగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు 6.7% క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో 2013-14లోనూ 4.65% చొప్పున నీరసించడం గమనార్హం.
 
ప్రస్తుత ఎక్సైజ్ డ్యూటీ తీరిదీ..
 ద్విచక్ర వాహనాలు            8%
 చిన్న కార్లు                      8%
 వాణిజ్య వాహనాలు            8%
 ఎస్‌యూవీలపై                 24%
 పెద్ద కార్లపై                      24%
 మధ్యతరహా కార్లపై             20%
 క్యాపిటల్ గూడ్స్               10%
 వినియోగ వస్తువులపై        10%

 
తయారీ వ్యయాల ఒత్తిడికి చెక్
ఎక్సైజ్ డ్యూటీల కోత పొడిగింపు నిర్ణయం వినియోగ వస్తు రంగానికి ప్రోత్సాహాన్నిస్తుందని హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా పేర్కొన్నారు. రెండేళ్లుగా మందగించిన వినియోగ వస్తు పరిశ్రమకు డ్యూటీ తగ్గింపు పొడిగింపు నిర్ణయం ఉపశమనాన్ని కలిగిస్తుందని గోద్రెజ్ అప్లయన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ కమల్ నంది వ్యాఖ్యానించారు. ఇక ఇదే విధమైన అభిప్రాయాలను సీఈఏఎంఏ సెక్రటరీ జనరల్ సురేష్ ఖన్నా, వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శతంను దాస్ గుప్తా సైతం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పరిశ్రమ ఎదుర్కొంటున్న తయారీ వ్యయాల ఒత్తిడి కొంతమేర తగ్గుతుందని గుప్తా అభిప్రాయపడ్డారు. డ్యూటీ తగ్గింపు నిర్ణయంతో దేశీయంగా తయారీ రంగం ఊపందుకుంటుందని దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు శామ్‌సంగ్, ఎల్‌జీ వ్యాఖ్యానించాయి.
 
ఆటో పరిశ్రమకు మేలు...
ఎక్సైజ్ కోత కొనసాగింపు ఆటో పరిశ్రమకు మేలు చేస్తుందని మారుతీ సుజుకీ సీవోవో మయాంక్ పరీక్ పేర్కొన్నారు. ఇటీవల కొన్ని వారాలుగా పుంజుకున్న డిమాండ్ పరిస్థితులు కొనసాగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. గత రెండేళ్లలో ఆటో పరిశ్రమ కష్టాలలో చిక్కుకున్నదని, గత నెలలోనే కొంతమేర ఆశావహ పరిస్థితులు నెలకొన్నాయని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ వివరించారు. తాజాగా డ్యూటీ కోతను పొడిగించడం వల్ల డి మాండ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

డ్యూటీ కోత పొడిగింపు సంతోషించదగ్గ పరిణామమని జనరల్ మోటార్స్ ఇండియా  వైస్‌ప్రెసిడెంట్ పి.బాలేంద్రన్ వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో కోతను మార్చి వరకూ పొడిగించడంతోపాటు, మరిన్ని ప్రోత్సాహకర చర్యలను ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం కార్లకు డిమాండ్‌ను పెంచుతుందని హ్యుందా య్‌ఇండియా సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాస్తవ చెప్పారు. తాజా నిర్ణయం ఆటో పరిశ్రమకు పెద్ద ఉపశమనమని సియామ్ ఈడీ విష్ణు మాథుర్ పేర్కొన్నారు.

సాహసోపేత నిర్ణయం
ద్రవ్యలోటు సమస్యలున్నా.. డ్యూటీ తగ్గింపు పొడిగింపు ద్వారా ఆర్థిక మంత్రి జైట్లీ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. ఇది పారిశ్రామికోత్పత్తి వృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. తాజా నిర్ణయం తయారీ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నదని ఫిక్కీ మాన్యుఫాక్చరింగ్ కమిటీ చైర్మన్ ఎంఎం సింగ్ చెప్పారు. ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నదని అన్నారు. ఈ నిర్ణయం  వృద్ధికి ఊత మివ్వడంతోపాటు, ఉద్యోగ అవకాశాలకు తెరలేపుతుందని పీహెచ్‌డీ చాంబర్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement