టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు దిగొస్తాయ్!
రేట్ల తగ్గింపు పరిశీలిస్తున్నాం: ఎల్‌జీ, ప్యానాసోనిక్
న్యూఢిల్లీ: ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు ఇతరత్రా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలుదిగొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కన్జూమర్ గూడ్స్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తామని ఆర్థిక మంత్రి పి. చిదంబరం మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించడంతో ఈ రంగంలోని కంపెనీలు స్పందించాయి. ధరలు తగ్గించే విషయమై ప్యానాసానిక్ ఇండియా, ఎల్‌జీ ఇండియా కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ తగ్గింపు ప్రభావాన్ని మదింపు చేస్తున్నామని వెల్లడించాయి. మార్కెట్ పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరలపై నిర్ణయం తీసుకుంటామని ఎల్‌జీ ఇండియా ఎండీ సూన్ క్వాన్ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ సానుకూలంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
మార్కెట్ పరిస్థితులను ఈ బడ్జెట్ మెరుగుపరుస్తుందని, తయారీ రంగానికి ఊపునిస్తుందని ఆయన చెప్పారు. వినియోగదారుల సెంటిమెంట్ సానుకూలంగా మారుస్తుందని, కొత్త వస్తువుల కొనుగోళ్లకు ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. 2 శాతం ఎక్సైజ్ సుంకం తగ్గింపు అనేది ధరలపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, ఇది ఆహ్వానించదగ్గ చర్య అని ప్యానాసానిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ చెప్పారు.