వస్త్రాలపై జీఎస్‌టీని అనుమతించబోం
27 నుంచి 30 వరకూ వస్త్రవాపార సంస్ధలు నిరవధిక బంద్
ఏపీ టెక్స్‌టైల్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బొమ్మనరాజ్‌కుమార్
జీఎస్‌టీ రద్దు చేసే వరకూ పోరాటం– వ్యాపారులు
రాజమహేంద్రవరం సిటీ : వస్త్ర వ్యాపారంలో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని, జీఎస్టీని నిరశిస్తూ మంగళవారం నుంచి శుక్రవారం (27 నుంచి 30) వరకూ వస్త్ర వ్యాపారాలను నిరవధిక బంద్ చేస్తున్నట్టు ఏపీ టెక్స్‌టైల్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్ ప్రకటించారు. ఆదివారం తాడితోట మహాత్మాగాంధీ హోల్‌సేల్ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉభయ జిల్లాలకు చెందిన వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు. బొమ్మన రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 18న ఢిల్లీలో జాతీయ వస్త్ర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో సమావేశమై 24 లోపు జీఎస్టీ అమలు విషయంపై ప్రభుత్వానికి గడువు ఇచ్చారని, సమయం దాటినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదన్నారు. జీఎస్టీతో వస్త్ర వ్యాపారులు ఎదుర్కొనే విపత్తును దృష్టిలో ఉంచుకుని మంగళవారం నుంచి 30 వరకూ వస్త్ర వ్యాపారాలను నిరవధిక బంద్ పాటిస్తున్నట్టు ప్రకటించారు. జీఎస్‌టీతో అధికారుల వేధింపులు ఎక్కువై పోతాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులపై అధికారులు పెత్తనం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వాటిని ఎదుర్కొనేందుకు వ్యాపారులు సమష్టిగా ముందుకు రావాలన్నారు. పోకల సీతయ్య, బిళ్లారాజు, కాలేపు రామచంద్రరావు, తుమ్మిడి విజయకుమార్ ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులు పాల్గొన్నారు.