జుత్తాడలో ఇసుక లారీలను అడ్డుకున్న డ్వాక్రా మహిళలు
మూడు ట్రాక్టర్లు..ఆరు లారీలుగా వెలిగిపోతున్న వ్యాపారులు
చోడవరం: ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం గ్రామాల్లో చిచ్చురేపుతోం ది. జిల్లాలో ప్రధాన నదులు, పెద్ద ఎత్తున తవ్వకాలతో చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలు ఇప్పుడు ఇసుక యుద్ధాలతో అట్టుడుకుతున్నాయి. పెట్టుబడి లేకుండా కొందరికి రూ.లక్షలు ఆదా యం సమకూర్చిన ఈ వ్యాపారం జనాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రభుత్వం రోజుకో పాలసీతో వర్గ విబేధాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వరీచ్‌లు, ఆలైన్ అమ్మకాలన్నారు. ఇప్పుడేమో ఉచిత ఇసుక పాలసీ అధికారులను సైతం కలవరపెడుతోంది. పెద్దేరు, శారదా నదులను అనుసంధానం చేస్తూ చోడవ రం మండలం గౌరీపట్నం, జత్తా డ, లక్కవరంల్లో ఉచిత ఇసుక తవ్వకాలకు ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకాలప్పుడే జుత్తాడ, గౌరీపట్నంలలో అనేక గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు గ్రామాల్లో సర్పం చ్‌లు, గ్రామస్తులు వేర్వేరుగా మామూళ్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఉచిత ఇసుక పాలసీతో ఈ గొడవలు మరింత ముదిరాయి.
ఇదీ పరిస్థితి
ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకంతో తమకు రావలసిన కమీషన్ ఇప్పటికీ రాలేదంటూ జుత్తాడ డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పొలిమేర వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ర్యాంప్ నుంచి ఇసుక లోడుతో వస్తున్న లారీలను అడ్డుకుని ధర్నా చేశారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పినా వినలేదు. తమకు రావలసిన పావలా వాటా కమీషన్ మొత్తం తమ సంఘాల ఖాతాల్లో జమచేసే వరకు ఇసుక తవ్వకాలు చేపట్టనీయమంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ వివాదం తారాస్థాయి చేరడంతో స్థానిక అధికార పార్టీ నాయకులను సైతం నిలదీశారు. మహిళా పోలీసులను రంగంలోకి దింపినప్పటికీ సాయంత్రానికి కూడా ఇక్కడ పరిస్థితి సద్దుమణగలేదు.
గౌరీపట్నంలో లారీలు నేరుగా నదిలోకి వచ్చి ఇసుకను తవ్వేస్తుండడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే లోతుగా తవ్వకాలతో భూగర్భ లాలు ఇంకిపోయి గ్రామంలో బోర్లు నుంచి నీరు రావడం లేదని, నదిలో ఇసుక కూడా లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ యజమానులు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటచేసుకుంది.
లక్కవరం రీచ్‌కు కె.కోటపాడు మండలం మల్లంపేట నుంచి నేరుగా దారి ఉండటంతో అటుగా ఇసుక తవ్వకాలు జోరందుకున్నాయి. గ్రోయిన్‌కు సమీపంలోతవ్వకాలను రైతులు అడ్డుకోవడంతో ఇక్కడ వివాదం చోటుచేసుకుంది. ఇలా గ్రామాలన్నీ ఇసుక కుమ్ములాటలతో రచ్చరచ్చగా ఉన్నాయి.
అధికారులకూ తలనొప్పి...
అధికారులకూ ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. కొత్త పాలసీలో కేటాయించిన రీచ్‌ల్లో ఇళ్లకు, ప్రజల అవసరాలకు ఉచితంగా ఇసుక తవ్వుకోవచ్చని, ప్రభుత్వ నిర్మాణాలకు అధికారుల అనుమతి పత్రం ఉండాలనే నిబంధన ఉంది. గుర్తింపు రీచ్‌ల పర్యవేక్షణకు ఒక్కో అధికారిక బృందాన్ని నియమించారు. సాయంత్రం 5 గంటల వరకే తవ్వకాలు చేపట్టాలని, సెలువు దినాల్లో చేయకూడదని కొత్త జీవోలో పేర్కొన్నారు. కానీ ఆదివారం కూడా ఈ రీచ్‌లలో యథేచ్ఛగా తవ్వకాలు సాగుతున్నాయి. ఇసుక తీసుకెళ్లే ప్రతి లారీ ఇళ్లనిర్మాణానికే అని చెబుతుండటంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇలా ఇసుక వ్యాపారులు మూడుట్రాక్టర్లు, ఆరు లారీలుగా వెలిగిపోతున్నారు.
కమీషన్ పైసా ఇవ్వలేదు
మా జుత్తాడ ఇసుక ర్యాంప్ నుంచి అధికారికంగా 20వేల క్యుబిక్‌మీటర్లకు పైగా ఇసుక తవ్వారు. వెలుగు అధికారుల పర్యవేక్షణలో రసీదులు ఇచ్చాం. ఇందుకు పావలా వాటా డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమచేస్తామని ప్రభుత్వం చెప్పింది. పైసా కూడా జమకాలేదు. ఇప్పుడు ఉచిత ఇసుక అంటూ ఇష్టమొచ్చినట్టు తవ్వేసి పట్టుకుపోతున్నారు. అందుకే అడ్డుకున్నాం.అధికారులు,ఎమ్మెల్యేను నిలదీస్తాం.
-బుద్ద తులసి, దుర్గాభవానీ డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు,జుత్తాడ.
రూ. 25 లక్షలు ఇవ్వాలి
డ్వాక్రా సంఘాలకు సుమారు రూ.25లక్షలు వరకు జమ కావాల్సి ఉంది. అధికారికంగా ఇసుక రీచ్‌లు నిర్వహించినప్పుడు 33 సంఘాల్లోని 450 మంది ఎంతో కష్టపడ్డాం. మాకు ఆ డబ్బులు జమచేయకుండానే ఇప్పుడు ఉచిత ఇసుక అంటూ ఇష్టమొచ్చినట్టు తవ్వేసి పట్టుకుపోతున్నారు. మాకు రావలసిన డబ్బులు జమచేసేవరకు ఇక్కడ నుంచి ఒక్క లారీ ఇసుక కూడా తీసుకెళ్లనీయం.
-రమాదేవి, డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు, జుత్తాడ.