భీమ్ క్యాష్‌బ్యాక్ స్కీమ్ గడువు పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: భీమ్ క్యాష్ బ్యాక్ స్కీమ్ కింద వర్తకులకు అందించే ఆఫర్ల గడువును కేంద్రప్రభుత్వం పొడిగించింది. భీమ్ అప్లికేషన్ ద్వారా పేమెంట్లను అంగీకరించే వర్తకులకు ఈ స్కీమ్ కింద 1000 రూపాయల వరకు ప్రోత్సహకాలను కేంద్రం అందిస్తోంది. ప్రస్తుతం 2018 మార్చి 31 వరకు భీమ్ క్యాష్ బ్యాక్ స్కీమ్ కింద వర్తకులు తమ కార్యకలాపాలు సాగించవచ్చని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. భీమ్ యాప్ ద్వారా నగదు రహిత పేమెంట్లను ప్రోత్సహించడానికి ఆరు నెలల గడువుతో ఈ స్కీమ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ 14న లాంచ్‌చేశారు.
ఈ స్కీమ్ కింద 20-50 లావాదేవీలకు రూ.50 క్యాష్‌బ్యాక్‌ను వర్తకులకు అందిస్తారు. అంటే ప్రతి లావాదేవీ రెండు రూపాయలన్నమాట. భీమ్ క్యాష్ బ్యాక్ స్కీమ్ నెలవారీ పరిమితి వెయ్యి రూపాయలు. ఈ క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను వర్తకులు పొందడానికి, భీమ్ యూనిక్ యూజర్ల నుంచి వర్తకులు ప్రతి నెలా కనీసం 20 లావాదేవీలు జరుపాల్సి ఉంటుంది. ప్రతిదీ కనీసం 25 రూపాయలు అయి ఉండాలి. కాగ, భీమ్ యాప్, ఇతర మొబైల్ వాలెట్ల లాగా నగదును నిల్వ ఉంచదు.