అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: టపాకాయల దుకాణాల ఏర్పాటులో తప్పనిసరిగా నిబంధనలు పాటించకపోతే అనుమతించేది లేదని త్రీటౌన్ సీఐ దేవానంద్ హెచ్చరించడంతో వ్యాపారులు ఆందోళనలో పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. దీపావళి పండుగకు రెండు రోజులు మాత్రమే ఉండడంతో నగరంలోని వ్యాపారులు 40 దుకాణాల ఏర్పాటు రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులతో అనుమతులు పొంది స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, ఆ ప్రాంగణంలో 48 స్టాళ్లు ఏర్పాటు చేయడంతోపాటు, పోలీసులు సూచించిన మేరకు దుకాణాల ఏర్పాటు లేకపోవడంతో త్రీటౌన్ సీఐ వారిని హెచ్చరించారు.
నిబంధనలు అనుసరించకపోతే, స్టాళ్లన్నింటినీ తొలగిస్తామని చెప్పారు. దీంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. వారం రోజులుగా పోలీసులు, విజిలెన్స్ అధికారులు, వాణిజ్యపన్నులు, అగ్నిమాపక శాఖ అధికారుల దాడులతో విసిగి వేసారిపోయామని, ప్రస్తుతం దుకాణాల ఏర్పాటులో సైతం నిబంధనలు అడ్డుగా నిలుస్తుండడంతో, ఈ ఏడాది టపాకాయల విక్రయాలు ఎలా సాగించాలని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని లెసైన్సుదారుల్లో 38 మందిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు బనాయించి రూ. కోటి పైగా విలువైన సరుకును సీజ్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు ముట్టజెబుతామని రూ.25లక్షలు వసూలు
నిబంధనల పేరుతో ఎలాంటి ఒత్తిళ్లు రాకుండా చేస్తానంటూ ఓ వ్యక్తి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు వారు ఆరోపించారు. ఇప్పటికే ఓ ఉన్నతాధికారికి రూ.2 లక్షలు ఇచ్చినట్లు ఆయన చెప్పాడని అంటున్నారు. మిగిలిన మొత్తాన్ని ఆయన వద్దే ఉంచుకోవడం వల్లే అందరూ తమపై ఆంక్షలు విధిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి స్టాళ్ల ఏర్పాటుకు సహకరించాలని వారు కోరుతున్నారు.
టపాసుల పంచాయితీ
Published Fri, Nov 1 2013 3:53 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement