సాక్షి, అనంతపురం: ఈ దీపావళికి నగరంలో టపాకాయలు పేలడం సంగతి ఎలాగున్నా... ఓ కాంగ్రెస్ నాయకుడి దెబ్బకు మాత్రం టపాసుల వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. నగరంలో టపాసులు విక్రయించాలంటే ఒక్కొక్కరు రూ.50 వేలు ఇవ్వాల్సిందేనంటూ ఆ నాయకుడు హుకుం జారీ చేయడంపై మండిపడుతున్నారు. పైగా ఆ సొమ్ము తనకు కాదని, వివిధ శాఖల అధికారులను ‘మేనేజ్’ చేయడానికేనంటూ ఆ నాయకుడు సాకులు చెబుతున్నాడు. నగరంలో టపాసులు విక్రయించడానికి 47 మంది లెసైన్స్ కలిగి ఉన్నారు. దీపావళి సందర్భంగా కొన్ని రూ.కోట్ల విలువైన టపాసులు విక్రయిస్తుంటారు. గతంలో ఎవరి దుకాణాల్లో వారు అమ్మేవారు.
దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో ఐదేళ్ల నుంచి టపాసుల విక్రయాలను న్యూటౌన్ జూనియర్ కళాశాల మైదానానికి మార్చారు. రెవెన్యూ అధికారులే స్టాళ్లు ఏర్పాటు చేసి సీనియారిటీ ప్రకారం వ్యాపారులకు కేటాయిస్తుంటారు. ఇందుకు కొంత రుసుం వసూలు చేస్తారు. ఇక టపాసుల వ్యాపారులు పోలీసు, రెవెన్యూ, మునిసిపల్, అగ్నిమాపక, వాణిజ్య పన్నులు తదితర శాఖల అధికారులకు ముడుపులు ఇచ్చుకోవాల్సి వస్తోందన్న విమర్శలున్నాయి. గత ఏడాది ప్రతి వ్యాపారి ముడుపుల రూపంలో రూ.14 వేల దాకా ముట్టజెప్పినట్లు తెలిసింది.
ఆయా శాఖల సిబ్బందికి టపాసులు కూడా ఉచితంగా ఇవ్వడం ఆనవాయితీ. ఇలా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. వ్యాపారులు మాత్రం ప్రతి యేటా వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అయితే... ఈసారి వ్యాపారుల్లోనే ఒకరైన కాంగ్రెస్ నాయకుడి దెబ్బకు మిగతా వారు హడలెత్తుతున్నారు. వ్యాపారులు ఒక్కొక్కరు రూ.50 వేలు ఇవ్వకపోతే వ్యాపారం చేయడానికి వీలు లేదని ఆ నాయకుడు తెగేసి చెప్పడంతో వారు ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది మామూళ్లు అన్ని శాఖలకు కలుపుకుని ఒక్కో షాపునకు రూ.14 వేలకు మించలేదని, ఇప్పుడు అంత మొత్తం ఎందుకని వారు సదరు నాయకుడిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంత మొత్తం ఇచ్చుకోలేమని చెబుతున్న వ్యావారులకు సదరు వ్యాపారి.. ధరలు పెంచుదామంటూ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారట.
‘అవినీతి టపాకాయ్’
Published Wed, Oct 30 2013 3:02 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement