దండుకునేందుకే..దందా
- టీడీపీ నేతల గుప్పిట్లో క్రాకర్స్ అసోసియేషన్
- టపాసుల వ్యాపారులతో సమావేశం నిర్వహించిన ఆ పార్టీ నేతలు
- ఒక్కో దుకాణం నుంచి రూ.50 వేలు డిమాండ్
- అధికారులదీ అదే బాట
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 380 దుకాణాల్లో బాణాసంచా విక్రయాలు సాగనున్నాయి. ఇందులో అనంతపురం నగర ‡పరిధిలో 150 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం దుకాణాల్లో వ్యాట్ రిజిస్ట్రేషన్ కల్గినవి 15లోపే. తక్కిన వాటికి దీపావళి నేపథ్యంలో తాత్కాలిక లైసెన్స్ జారీ చేస్తారు.
దీపావళి బాణాసంచాలో 145 రకాలు ఉంటాయి. తక్కువ అంటే కనీసం వంద రకాలు విక్రయిస్తారు. సరుకు కొనుగోలుకు కనీసం రూ.5 లక్షలు వ్యాపారులు ఖర్చు చేయాలి. 380 మంది వ్యాపారులు కనీస ధరకు బాణాసంచా కొనుగోలు చేసినా రూ.19 కోట్లు అవుతుంది. అయితే.. కొన్ని దుకాణాలు భారీగానే కొనుగోలు చేస్తాయి. మొత్తమ్మీద జిల్లాకు రూ.19–25 కోట్ల విలువైన సరుకు చేరుతుంది. ఒక్క ‘అనంత’లోనే రూ. 8–10 కోట్ల సరుకు కొనుగోలు చేస్తారు. కొనుగోలు ధర కంటే 60–70 శాతం లాభానికి విక్రయిస్తున్నారు. ఈ లెక్కన వీటి విక్రయాల ద్వారా కనీసం రూ.50 కోట్లు వ్యాపారులకు లాభం చేకూరుతుంది.
రంగంలోకి టీడీపీ నేతలు
నగర పరిధిలోని దుకాణాల నిర్వహణను గతంలో బీజేపీ నేత సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టేవారు. గత ఏడాది టీడీపీ నేత రాయల్ మురళీ అధ్యక్షునిగా, కార్పొరేటర్ రాజారాంతో కలిసి దుకాణాలు నిర్వహించారు. నిర్వహణ పేరిట గత ఏడాది ఒక్కో వ్యాపారి నుంచి రూ.50 వేలు వసూలు చేశారు. అధికారులకు భారీగా మామూళ్లు ఇవ్వాలని చెప్పి వసూళ్లు చేసినా..వారికి ఇవ్వకపోవడంతో పండుగ రోజు, ఆ ముందురోజు తనిఖీల పేరుతో వ్యాపారులను వేధించి జరిమానాలు వసూలు చేశారు. దీంతో మురళీ, రాజారాం తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది కూడా వీరే వ్యాపారాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. స్థానిక 36వ డివిజన్‌లోని పార్కులో ఆదివారం వ్యాపారులతో సమావేశమయ్యారు. ‘చంద్రదండు’ నేత ప్రకాశ్ నాయుడుæ, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్‌మురళీ, రాజారాం సమావేశానికి హాజరయ్యారు. గత ఏడాది పరిణామాలను వివరిస్తూ వ్యాపారులు వీరిపై తీవ్రస్థాయిలో మాటల దాడికి దిగినట్లు తెలుస్తోంది. అయితే.. అధికారులకు డబ్బు ఇచ్చామని, వారు తీసుకుని కూడా తీసుకోనట్లు మాట్లాడుతున్నారని సర్దిచెప్పారు. ఈ ఏడాది అలాంటిదేమీ జరగదని హామీ ఇస్తూ.. ఒక్కొక్కరు రూ.50 వేలు చెల్లించాలని సూచించారు. వ్యాపారుల్లో అధికశాతం ఆర్యవైశ్యులు ఉన్నారు. వీరు దీన్ని వ్యతిరేకించారు. కొన్నేళ్లుగా వ్యాపారాలు చేస్తున్నామని, రూ.10వేల ఖర్చుతో అంతా జరిగేదని గుర్తు చేశారు. ఇప్పుడు మీకు రూ.50వేలు, బాణాసంచా విక్రయాలు జరిపే కూలీలు, కరపత్రాలు, ఇతర ఖర్చులు కలిపి మరో రూ.50 వేలు కలిపి మొత్తం రూ.లక్ష ఖర్చొస్తుందని, చేసే వ్యాపారం ఖర్చులకే సరిపోతుందని వాదించినట్లు సమాచారం. కానీ కచ్చితంగా రూ.50 వేలు ఇవ్వాల్సిందేనంటూ ఓ ప్రజాప్రతినిధి మాటగా చెబుతున్నామని వారు హుకుం జారీ చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఖర్చు మూరెడు...లాభం బారెడు
36 డివిజన్ పార్కు సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. గ్రౌండ్ ఉచితం. మూడురోజులకు ఒక్కో దుకాణానికి రోజుకు రూ.2వేల అద్దె చొప్పున రూ. 9లక్షలు, లైటింగ్ కోసం మరో రూ.లక్ష, ఇతర ఖర్చులు ఇంకో రూ.లక్ష కలిపినా మొత్తం రూ.11 లక్షల ఖర్చవుతుంది. ఇది కాకుండా రెవెన్యూ, పోలీసుశాఖకు రూ.5లక్షలు, విజిలెన్స్, కమర్షియల్ ట్యాక్స్, ఫైర్‌కు రూ.4 లక్షలు, తూనికలు, కొలతల శాఖకు, ట్రాన్స్‌కోకు రూ.లక్ష ఇవ్వాలని చెప్పినట్లు తెలిసింది. అంతా కలిపినా రూ.23 లక్షలకు మించి ఖర్చు రాదు. అయితే.. దుకాణానికి రూ.50వేల చొప్పున 150 దుకాణాలకు రూ.75 లక్షలు వసూలవుతుంది. అంటే రూ.52 లక్షలు నిర్వాహకులకు మిగులుతుందన్నమాట!
అంతా ‘కమర్షియల్’
బాణాసంచా విక్రయాలపై 14.5 శాతం పన్ను వసూలు చేయాలి. నిబంధనల ప్రకారం రూ.7.5 లక్షల సరుకు ఉంటేనే లైసెన్స్‌డ్ డీలర్‌గా గుర్తించి చలానాలు ఇస్తారు. చాలామంది సరుకును రూ.5లక్షలలోపు అధికారులకు చూపిస్తారు. దీంతో తాత్కాలిక రిజిస్ట్రేషన్ కింద ఒక్కో స్టాల్ నుంచి రూ.15–20 వేలు వసూలు చేస్తారు. 2013లో ఇలానే వసూలు చేశారు. కానీ జిల్లాలోని దుకాణాలన్నింటికీ కలిపి కేవలం రూ.1.62లక్షలు ట్రెజరీకి జమ చేశారు. 2014లో నగరంలోనే 90 దుకాణాలకు లైసెన్స్‌లు ఇచ్చారు. ఒక్కో దుకాణం నుంచి రూ.15వేలు వసూలు చేసి, ఇందులో ట్రెజరీకి ఒక్కరూపాయి కూడా జమ చేయకుండా మొత్తం స్వాహా చేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. గతేడాది కూడా కాస్త ట్రెజరీలో చెల్లించి, స్వాహా చేశారని తెలుస్తోంది. ఈ ఏడాది దాదాపు రూ.50కోట్ల వ్యాపారాలు జరగనున్న నేపథ్యంలో కమర్షియల్ అధికారులు జేబులు నింపుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి.