కదిరి : తనపైనే వార్తలు రాస్తావా అంటూ కదిరి సాక్షి విలేకరి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం చేసిన టీడీపీ నేత, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గుడిసె దేవానంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి మంగళవారం ప్రకటించారు. విలేకరిపై హత్యాయత్నాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులపాటు జర్నలిస్టులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, పాత్రికేయునిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ.. పోలీసు అధికారులతో సమగ్ర విచారణ చేయించిన అనంతరం నిందితుడు దేవానంద్‌ను అరెస్ట్ చేశారు. తర్వాత ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. జర్నలిస్టులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఎస్పీతో పాటు కదిరి డీఎస్పీ జర్నలిస్టులకు హామీ ఇచ్చారు.
దేవానంద్ బాధితులు నేరుగా ఫిర్యాదు చేయండి : ఎస్పీ
రైల్వేశాఖలో ఉద్యోగాలిప్పిస్తామని, ఇంటి పట్టాలిస్తామని ఇలా పలు రకాలుగా మోసాలు చేసినట్లు దేవానంద్‌పై వస్తున్న ఆరోపణలపై బాధితులు నేరుగా తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ సూచించారు. సాక్షి విలేకరి శ్రీనివాసరెడ్డిపై దేవానంద్ పెట్టిన కేసును పరిగణనలోకి తీసుకోనవసరం లేదని, కేవలం కౌంటర్ కేసుగానే ఇచ్చినట్లు భావిస్తున్నామని చెప్పారు. కులం పేరుతో దూషించాడన్నది కూడా పూర్తిగా వాస్తవం కాదని నమ్ముతున్నామన్నారు. ఇదే విషయాన్ని ఆయన సదరు విలేకరితో పాటు జర్నలిస్టు సంఘాల జిల్లా, రాష్ట్ర నాయకులకు తెలియజేశారు.
జర్నలిస్టుల సమష్టి విజయం
కదిరి సాక్షి విలేకరిపై టీడీపీ నేత హత్యాయత్నానికి పాల్పడితే జిల్లాలోని జర్నలిస్టులందరూ ఏకమై తమ నిరసన గళం విన్పించారు. దేవానంద్ అరెస్ట్ కూడా సమష్టి విజయంగా భావిస్తున్నాం. దేవానంద్‌పై ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయి. ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్‌లో విలేకరులపై దేవానంద్ దాడులకు పాల్పడితే అతనిపై రౌడీషీట్ నమోదు చేయడంతో పాటు జిల్లా నుంచి బహిష్కరించే వరకు వదిలిపెట్టబోం. – మచ్చా రామలింగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీయూడబ్ల్యూజే
Comments
Please login to add a commentAdd a comment