గిట్టుబాటు ధరల కోసం ఆందోళన
నాయకులు, వ్యాపారుల కుమ్మక్కుపై విమర్శలు
కొండపి : గిట్టుబాటు ధర లేదని పొగాకు రైతులు శనివారం రాస్తారోకో చేశారు. వ్యాపారులు ధరలు దిగకోసి పొగాకు కొంటున్నా రైతు నాయకులు వ్యాపారులకు వంత పలకడంపై ఆగ్రహం చెందారు. వేలం కేంద్రం అధికారి సైతం చోద్యం చూడటం తప్ప వ్యాపారులపై ఒత్తిడి తెచ్చి రైతుల పక్షం వహించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ పొగాకు రైతులు కొండపి పొగాకు వేలంకేంద్రంలో వేలాన్ని అడ్డుకున్నారు. గిట్టుబాటు ధరల కోసం రెండు గంటలకు పైగా శనివారం రాస్తారోకో నిర్వహించారు.
వివరాలు ..
వేలంకేంద్రం పరిధిలోని నరసరాజుపాలెం, పీరాపురం గ్రామానికి చెందిన రైతులు 336 బేళ్లను వేలం కేంద్రానికి తీసుకొచ్చారు. కేంద్రం అధికారి మురళీధర్ వేలాన్ని ప్రారంభించారు. రెండు లైన్‌లు కొనుగోలు చేసిన తరువాత మూడవ లైన్‌లోకి పాట రాగా పొగాకుకు గిట్టుబాటు ధరలు రావడం లేదని రైతులు గ్రహించారు. వెంటనే రైతులు వేలాన్ని అడ్డుకుని వేలం కేంద్రం ముందు రోడ్డు మీద రాస్తారోకోకు దిగారు. రోడ్డుకు అటుఇటు ముళ్ల కంచెలు, విద్యుత్ స్తంభాలు వేసి రాస్తారోకో నిర్వహించారు. భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గత ఏడాది మేలిమి పొగాకు క్వింటా 12 వేల రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయగా ఇప్పుడు అదే పొగాకు 9 వేల రూపాయల నుంచి 8 వేలకు దిగకోశారని ఆవేదన చెందారు. ధరల గురించి బోర్డు చైర్మన్ పట్టించుకుని రైతులకు న్యాయం చేయాలన్నారు. ఎస్‌ఐ ఆంజనేయులు రైతులకు సర్ది చెప్పడంతో ఇంత తక్కువగా ధరలు మరొకసారి రాకూడదని చెబుతూ రాస్తారోకో విరమించారు.
ధరల్లేవు
మాది ఐటిసి ఎన్‌పిఏ గ్రామం. అయినా ధరలకు దిక్కులేదు. ట్రేలలో మెక్కలు పెంచమన్నారు. పట్టలు వేసి మరీ గ్రేడ్ చేసి చెక్కులు వేయమన్నారు. ధరలు మాత్రం పెంచకుండా దిగ కోస్తున్నారు. దీంతో మాకు దిక్కుతోచడం లేదు.
కె.బ్రహ్మయ్య, నరసరాజుపాలెం
మేలిమి పొగాకుకు తక్కువ ధరలా !
రూ. 12 వేలకు కొనుగోలు చేయాల్సిన మేలిమి పొగాకు రూ.9 వేల లేపే కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా అయితే పొగాకు రైతు బతికి బట్ట కట్టేది ఎట్టా. పొటాష్ వేస్తే మంచిదని అధికారులు సలహా ఇస్తే మూట 28 వందలు పెట్టి ఎకరాకు బస్తా వేశాం. ఖర్చు తడిసి మోపెడు అయింది.
బండి భాస్కర్‌రెడ్డి , పీరాపురం
వ్యాపారులకే నాయకుల వంత
వ్యాపారులకే అధికారులు , కొంతమంది రైతు నాయకులు వంత పలుకుతున్నారు. రైతును పట్టించుకునేవారు ఏరి. ఇంత దారుణమైన ధరల పతనం ఆగకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోక గత్యంతరం లేదు.
జి సుబ్బరాయుడు
పొగాకు రైతుల రాస్తారోకో
Published Sun, May 24 2015 5:33 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM
Advertisement