గజ్వేల్, న్యూస్‌లైన్: అతివృష్టితో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులను వ్యాపారులు నిండా ముంచేస్తున్నారు. కాస్తోకూస్తో మిగిలిన పంటను మార్కెట్ యార్డుకు తీసుకువెళ్తున్న కర్షకులపై కనీస కనికరం లేకుండా ‘బీట్’ విధానం పేరిట దోచుకుంటున్నారు. అంతా సిండికేట్‌గా మారి గంటల్లోనే ధరను తగ్గించేస్తున్నారు. గజ్వేల్ మార్కెట్‌లో సోమవారం ఉదయం ధరను కొద్ది గంటల వ్యవధిలోనే వ్యాపారులంతా ఏకమై రూ.400 తగ్గించారు. ఇదేమిటని అడిగిన రైతులకు ‘ఇష్టముంటే అమ్మండి లేకుంటే వదు’ అని దబాయించారు. దీంతో ఆగ్రహించిన రైతన్నలు వారితో వాగ్వాదానికి దిగడంతో పాటు మార్కెట్ కమిటీ అధికారులను ఘెరావ్ చేశారు. చివరకు వ్యాపారులు దిగిరావడంతో ఆందోళన సద్దుమణిగింది.
భారీగా తరలివస్తోన్న రైతులు
ఇటీవల పత్తి ధర పెరిగింది. గజ్వేల్ యార్డులో క్వింటాలుకు రూ.4,300కుపైగా పలకడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులు ఇక్కడికి భారీగా తరలివస్తున్నారు. యార్డులో సోమవారం పత్తి కొనుగోలు చేయడానికి ‘బీట్’ నిర్వహించారు. ఉదయం 10గంటల ప్రాంతంలో క్వింటాలు పత్తికి రూ.4,000 నుంచి రూ.4,300 వరకు ధర చెల్లించిన వ్యాపారులు, కొద్దిసేపటికే ధరను తగ్గించేశారు. వ్యాపారులంతా ఏకమై క్వింటా పత్తికి రూ.3,900 మాత్రమే చెల్లిస్తామని తెగేసి చెప్పడంతో ఆగ్రహించిన రైతులు వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా గంటకుపైగా యార్డులో లావాదేవీలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న మార్కెట్ కమిటీ సూపర్‌వైజర్ వీర్‌శెట్టి తదితరులను ఘెరావ్ చేశారు. ఈ సంఘటనతో యార్డులో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు జోక్యం చేసుకుని వ్యాపారులతో మాట్లాడి క్వింటాలు పత్తికి రూ.4,000నుంచి రూ.4,300 వరకు ధర చెల్లించాలని సూచించడంతో రైతులు తమ ఆందోలన విరమించారు.
పత్తి రైతు..చిత్తు
Published Tue, Nov 19 2013 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement