gajwel market
-
రికార్డు ధర: గజ్వేల్‌లో రూ.8,261 జమ్మికుంటలో రూ.8,150
జమ్మికుంట/ఆదిలాబాద్ టౌన్/ ఖమ్మం వ్యవసాయం/సిద్దిపేట: తెల్ల బంగారం ధరలో రికార్డులు సృష్టిస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.6,025 ఉండగా, బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.2 వేలకుపైబడి ధర పలుకుతోంది. మంగళవారం గజ్వేల్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.8,261 ధర లభించింది. ఇంకా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రూ.8,150, ఆదిలాబాద్ మార్కెట్లో రూ.8,020, వరంగల్ ఏనుమాముల మార్కెట్లో రూ.7,960, జనగామ మార్కెట్లో రూ.7,900, ఖమ్మంలో రూ.7,800 ధరకు వ్యాపారులు కొను గోలుచేశారు. దేశవ్యాప్తంగా పత్తి దిగుబడి తగ్గినందుకే ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. విదేశాల్లో పత్తి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని, రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. కాగా, మంగళవారం పై ప్రధాన మార్కెట్లకు పెద్దసంఖ్యలో వాహనాల్లో పత్తి వచ్చింది. అన్నిచోట్లా మోడల్ ధర క్వింటాకు రూ.8 వేలకుపైగా, కనిష్టంగా రూ.7,900 చొప్పున వ్యాపారులు రైతులకు చెల్లించారు. (చదవండి: Anthrax At Warangal: ఆంత్రాక్స్ వ్యాధి కలకలం: మటన్ కొంటున్నారా..? జర జాగ్రత్త!) -
పత్తి రైతు..చిత్తు
గజ్వేల్, న్యూస్‌లైన్: అతివృష్టితో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులను వ్యాపారులు నిండా ముంచేస్తున్నారు. కాస్తోకూస్తో మిగిలిన పంటను మార్కెట్ యార్డుకు తీసుకువెళ్తున్న కర్షకులపై కనీస కనికరం లేకుండా ‘బీట్’ విధానం పేరిట దోచుకుంటున్నారు. అంతా సిండికేట్‌గా మారి గంటల్లోనే ధరను తగ్గించేస్తున్నారు. గజ్వేల్ మార్కెట్లో సోమవారం ఉదయం ధరను కొద్ది గంటల వ్యవధిలోనే వ్యాపారులంతా ఏకమై రూ.400 తగ్గించారు. ఇదేమిటని అడిగిన రైతులకు ‘ఇష్టముంటే అమ్మండి లేకుంటే వదు’ అని దబాయించారు. దీంతో ఆగ్రహించిన రైతన్నలు వారితో వాగ్వాదానికి దిగడంతో పాటు మార్కెట్ కమిటీ అధికారులను ఘెరావ్ చేశారు. చివరకు వ్యాపారులు దిగిరావడంతో ఆందోళన సద్దుమణిగింది. భారీగా తరలివస్తోన్న రైతులు ఇటీవల పత్తి ధర పెరిగింది. గజ్వేల్ యార్డులో క్వింటాలుకు రూ.4,300కుపైగా పలకడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులు ఇక్కడికి భారీగా తరలివస్తున్నారు. యార్డులో సోమవారం పత్తి కొనుగోలు చేయడానికి ‘బీట్’ నిర్వహించారు. ఉదయం 10గంటల ప్రాంతంలో క్వింటాలు పత్తికి రూ.4,000 నుంచి రూ.4,300 వరకు ధర చెల్లించిన వ్యాపారులు, కొద్దిసేపటికే ధరను తగ్గించేశారు. వ్యాపారులంతా ఏకమై క్వింటా పత్తికి రూ.3,900 మాత్రమే చెల్లిస్తామని తెగేసి చెప్పడంతో ఆగ్రహించిన రైతులు వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా గంటకుపైగా యార్డులో లావాదేవీలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న మార్కెట్ కమిటీ సూపర్వైజర్ వీర్శెట్టి తదితరులను ఘెరావ్ చేశారు. ఈ సంఘటనతో యార్డులో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు జోక్యం చేసుకుని వ్యాపారులతో మాట్లాడి క్వింటాలు పత్తికి రూ.4,000నుంచి రూ.4,300 వరకు ధర చెల్లించాలని సూచించడంతో రైతులు తమ ఆందోలన విరమించారు. -
తెల్ల‘బంగారమే’
గజ్వేల్, న్యూస్‌లైన్: కొన్నిరోజులుగా వెలవెలబోయిన తెల్లబంగారం శనివారం మెరిసిపోయింది. గజ్వేల్ మార్కెట్ యార్డులో శనివారం క్వింటాలు పత్తికి రికార్డు స్థాయిలో రూ.4,320 ధర పలికింది. ఈ సీజన్లో క్వింటాలు పత్తికి ఇంత ధర రావడం ఇదే తొలిసారి. నెలరోజుల నుంచి మార్కెట్లోకి ఉత్పత్తులు రావడం ఊపందుకున్నా, సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు. దీంతో దళారులు క్వింటాలు పత్తికి రూ.3 వేల నుంచి రూ.3,500 వరకే ధర చెల్లించారు. ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి కాస్త నల్లబారడంతో ధరను మరింత తగ్గించేశారు. అయితే శనివారం క్వింటాలు పత్తికి మద్దతు ధర రూ.4 వేలు దాటి ధర పలకడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యార్డులో శనివారం 728 కింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా గరిష్టంగా రూ.4,320 ధరను చెల్లించినట్లు మార్కెట్ కమిటీ సూపర్వైజర్ వీర్శెట్టి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.