గజ్వేల్, న్యూస్‌లైన్: కొన్నిరోజులుగా వెలవెలబోయిన తెల్లబంగారం శనివారం మెరిసిపోయింది. గజ్వేల్ మార్కెట్ యార్డులో శనివారం క్వింటాలు పత్తికి రికార్డు స్థాయిలో రూ.4,320 ధర పలికింది. ఈ సీజన్‌లో క్వింటాలు పత్తికి ఇంత ధర రావడం ఇదే తొలిసారి. నెలరోజుల నుంచి మార్కెట్‌లోకి ఉత్పత్తులు రావడం ఊపందుకున్నా, సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు. దీంతో దళారులు క్వింటాలు పత్తికి రూ.3 వేల నుంచి రూ.3,500 వరకే ధర చెల్లించారు. ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి కాస్త నల్లబారడంతో ధరను మరింత తగ్గించేశారు. అయితే శనివారం క్వింటాలు పత్తికి మద్దతు ధర రూ.4 వేలు దాటి ధర పలకడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యార్డులో శనివారం 728 కింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా గరిష్టంగా రూ.4,320 ధరను చెల్లించినట్లు మార్కెట్ కమిటీ సూపర్‌వైజర్ వీర్‌శెట్టి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.