
ఐసీఐసీఐ బ్యాంకు ఏం చేసిందంటే...
ముంబై : ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు ఒక కొత్త మొబైల్ యాప్ ను మంగళవారం లాంచ్ చేసింది. డిజిటల్ చెల్లింపులకు మద్దతునిస్తూ వ్యాపారుల కోసం 'ఈజీ పే' పేరుతో మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారుల నుంచి వ్యాపారులు ఎంత మొత్తమైనా డిజిటల్ పద్ధతిలో స్వీకరించవచ్చు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ కు చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారంగా పనిచేసే ఈ యాప్ ద్వారా క్రెడిట్, డెబిట్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఐసీసీఐ డిజిటల్ వాలెట్ 'పాకెట్' నుంచి చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కరెంట్ అకౌంట్ ఖాతాదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈ సేవలను పొందవచ్చు. ఇతర బ్యాంకుల వినియోగదారులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం స్మార్ట్ ఫోన్లపై ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాగా, త్వరలో ఐఓఎస్ ఫోన్లకు ప్రవేశపెట్టనున్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటి సర్వీస్ అని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా విజన్ విజయవంతంలో తమ బ్యాంకు తీసుకున్న మరో ప్రోత్సాహకర అడుగు అని బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్ వ్యాఖ్యానించారు. ఒక వ్యాపారికి సంబంధించి 30 మంది ఉద్యోగులు ఒకేసారి ఈ యాప్ ద్వారా తమ మొబైల్ ఫోన్లలో చెల్లింపులను స్వీకరించవచ్చని చెప్పారు.