ఏళ్లు గడుస్తున్నా.. పాలకులు మారుతున్నా.. కొత్త ప్రభుత్వాలు కొలువుదీరుతున్నా.. కర్షకుల కష్టాలు మాత్రం తీరడం లేదు. నిత్యం వ్యయప్రయాసాల కోర్చి.. దిగుబడి వస్తున్నా.. రాకున్నా.. సాగు పోరాటంలో దిగుతున్న అన్నదాతలకు ఇబ్బందులు తప్పడంలేదు. సాగు సమయంలో ప్రకృతి పగబడితే.. ధాన్యం చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఆసరానివ్వలేకపోతున్నాయి.
కొద్దోగొప్పో వచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు లేకపాయె. అరకొరగా ప్రారంభిస్తుండడంతో చివరికి ధాన్యం దళారులకే అమ్ముకోవాల్సి వస్తోం ది. దళారులేమో మద్దతు ధర చెల్లించక పోగా.. కాంటాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. క్వింటాల్‌కు 10 నుంచి 20 కిలోల వరకు చిలక్కొట్టుడు కొడుతున్నారు. ఫలితంగా రైతన్న నిలువునా దగాకు గురవుతున్నాడు.
- ఆదిలాబాద్ అగ్రికల్చర్
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో ఆశించిన మేర వర్షాలు కురియకపోవడంతో వరి సాగు తగ్గింది. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం 60 హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉంది. కానీ.. అది 27 హెక్టార్లకే పరిమితమైంది. ఆలస్యంగానైనా కురిసిన కొద్దిపాటి వర్షాలతో ఈ కొద్ది మేర వరినాట్లు వేశారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 92,500 మెట్రిక్ టన్నుల ధాన్య దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వం కూడా గ్రేడ్ ఏ ధాన్యానికి రూ.1,400, మధ్యరకం ధాన్యానికి రూ.1,360 ధర నిర్ణయించింది. ప్రస్తుత దిగుబడి ధాన్యం చేతికి వస్తోంది. ప్రభుత్వం ఏటా మాదిరిగానే ఈసారీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు.
దీంతో దిగుబడి వస్తున్నా.. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవాల్సి వస్తోంది. అధికారులు జిల్లా వ్యాప్తంగా 194 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించి.. చివరికి 71 కేంద్రాలకే పరిమితమయ్యారు. ఐకేపీ 50, పీఏసీఎస్ 18, డీసీఎమ్మెస్ కొన్ని మండలాల్లో మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించాయి. ఇప్పటివరకు వీటన్నింటి పరిధిలో 13,304 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ఏడాది సుమారుగా ఇంకా 34 వేలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గతేడాది 52 వేల క్వింటాళ్ల వరిధాన్యాన్ని ప్రభుత్వం తరఫున కొనుగోలు చేశారు.
తూకాల్లో మోసాలు..
జిల్లాలో కొనుగోలు కేంద్రాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో.. కొనుగోలు కేంద్రాలు లేని ఏరియాలను దళారులు ఎంచుకున్నారు. దీంతో వ్యాపారులు రైతుల పంట పొలాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని జైపూర్, నెన్నెల, వేమనపల్లి, లక్ష్మణచాంద, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం, బెల్లంపల్లి, కౌటాల తదితర మండలాల్లో రైతులు దళారులకే విక్రయిస్తున్నారు. కాగా.. దళారులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వరకు చెల్లిస్తున్నా తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు.
వ్యాపారులు మధ్య రకం ధాన్యానికి రూ. 1,300, సన్నరకం ధాన్యానికి రూ.1,700 వరకు చెల్లిస్తున్నారు. తూకాల్లో మాత్రం క్వింటాల్‌కు 10 నుంచి 20 కిలోల వరకు మోసం చేస్తున్నారు. దీన్ని కనిపెట్టిన వారు నిలదీస్తే తేమ శాతం చూడకుండానే కొనుగోలు చేస్తున్నందునా బరువు ఎక్కువగా వ స్తుందని, అందుకే ధర ఎక్కువగా చెల్లించి కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. అసలే కరువు నేపథ్యంలో జిల్లాలో అంతంత మాత్రంగానే వరిధాన్యం సాగైంది. దీంతో రానున్న రోజుల్లో బియ్యం ధరలకు రెక్కలొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో దళారులు జోరుగా తమ దందాను కొనసాగిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం..
- చరణ్‌దాస్, డీఆర్‌డీఏ ఏపీడీ
జిల్లాలో 71 కేంద్రాలు ఏర్పాటు చేసి 13,304 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. కొన్ని మండలాల్లో ఆలస్యంగా వరినాట్లు వేయడంతో దిగుబడి రాక కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. వారం రోజుల్లో కడెం, ఖానాపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, మామడ, జన్నారం, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి తదితర మండలాల్లో ఏర్పాటు చేస్తాం. మరో 35 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేస్తున్నాం.
దళారులదే హవా
Published Fri, Dec 5 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM
Advertisement