ముగిసిన ధాన్యం కొనుగోళ్లు
- లక్ష్యానికి 3 లక్షల టన్నులు తక్కువ
- గతేడాది కంటే అధిక సేకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టవ్యాప్తంగా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. పౌరసరఫరాల శాఖ మొత్తం 11.03 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈ ఏడాది నిర్దేశించుకున్న 14 లక్షల టన్నుల లక్ష్యం చేరుకోకపోయినప్పటికీ గతేడాదితో పోలిస్తే 3.14 లక్షల టన్నుల ధాన్యం అధికంగా సేకరించింది.
బియ్యం లెవీని 75 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తూ గతేడాది జూన్‌లో తీసుకున్న కేంద్ర నిర్ణయాన్ని చిన్న, సన్నకారు రైతులకు గిట్టుబాటు ధర రాదనే ఉద్దేశంతో రాష్ర్ట ప్రభుత్వం వ్యతిరేకించింది. లెవీ తగ్గింపు నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అయినా కేంద్రం వెనక్కు తగ్గకపోవడంతో ఆగస్టు నుంచే కొనుగోలుకు అవసరమైన చర్యలు చేపట్టి, ఎలాంటి అడ్డంకులు లేకుండా ముగించింది.
విజయవంతంగా పూర్తి: పార్థసారథి,
పౌరసరఫరాల శాఖ కమిషనర్ తెలంగాణలో తొలి ఖరీఫ్‌ను విజయవంతంగా ముగించినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. ఎక్కడా రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేయకుండా ధాన్య సేకరణ పూర్తి చేశామని ఆయన చెప్పారు. ఇందుకోసం కృషి చేసిన అన్ని జిల్లాల అధికారులను ఆయన అభినందించారు. నల్లగొండ, వరంగల్ మినహా అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేసినట్లు తెలిపారు.