
పాక్ నుంచి ఉల్లి దిగుమతులు కోరుతున్నాం: వ్యాపారులు
చండీగఢ్: దేశంలో ఉల్లిపాయల కొరత తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునే దిశగా చర్యలు చేపట్టినట్టు అమృత్‌సర్‌కు చెందిన వ్యాపారులు తెలిపారు. దీనిలో భాగంగా పాకిస్థాన్ వ్యాపారులు భారత్‌కు ఉల్లిపాయలను ఎగుమతి చేసుకునేందుకు గాను అక్కడి ప్రభుత్వాన్ని అనుమతి కోరాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. అట్టారీ-వాఘా రహదారి మార్గం ద్వారా భారత్‌కు ఉల్లిపాయలను ఎగుమతి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పాక్ వ్యాపారులను కోరినట్టు రాజ్‌దీప్ ఉప్పల్ అనే వ్యాపారి తెలిపారు.
సాధారణంగా ఈ మార్గంలో ఉల్లిపాయల ఎగుమతికి పాక్ అనుమతించదని, అయితే, ఈ దారిగుండా ఉల్లిపాయలు భారత్‌కు చేరుకునేందుకు తక్కువ ఖర్చవుతుందని, ఈ విషయాన్ని త్వరగా పరిశీలించి అమల్లోకి వచ్చేలా చూడాలని లాహోర్ ఉల్లి వ్యాపారులను అడిగామని రాజ్‌దీప్ వివరించారు. ప్రస్తుతం భారత్‌లో కిలో ఉల్లి రూ. 70 నుంచి 80 మధ్య పలుకుతోందని పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటే దీని ధర రూ.40కి పడిపోతుందని ఆయన చెప్పారు.