సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో ఇప్పటికే ఆదాయాన్ని కోల్పోతున్న సర్కారుకు చాలా మంది వ్యాపారులు మరింత నష్టాన్ని కలగజేస్తున్నారు. పండుగల సీజన్ లావాదేవీల్లో మాయాజాలం ప్రదర్శిస్తూ యథే చ్ఛగా పన్ను ఎగ్గొడుతున్నారు. ఇంత జరుగు తున్నా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారు లు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీస పర్యవేక్షణ కూడా లేకుండా చోద్యం చూస్తున్నారు. ఇందుకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా జరుగుతున్న వ్యాపార కార్యకలాపాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలంగాణలో ఈ పండుగల సీజన్‌లో బట్టల వ్యాపారం కనీసం రూ. 1,200 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. ఈ లెక్కన కనీసం రూ. 100 కోట్లకుపైగానే జీఎస్టీ సర్కారు ఖజానాకు చేరాల్సి ఉన్నా ఆ మేరకు వ్యాపారులు ఎగవేసినట్లు తెలుస్తోంది.
కేంద్రం భయం.. రాష్ట్రాలకు అశనిపాతం
వాస్తవానికి జీఎస్టీ అమల్లోకి వచ్చాక కనీసం 3 నెలలపాటు వ్యాపారుల జోలికి వెళ్లవద్దని.. తనిఖీలు, పన్ను వసూళ్ల పేరుతో వేధించొద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే రాష్ట్రాలు వ్యాపారులను ఇబ్బంది పెడితే వారు ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచేస్తారని, దాని వల్ల ప్రజలపై భారం పడుతుందని పేర్కొంది. అయితే వ్యాపారుల నుంచి జీఎస్టీని ముక్కు పిండి వసూలు చేస్తే వ్యాపార వర్గాల్లో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనే భయం తోనే మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని మండిప డుతున్నాయి. ఇప్పుడు ఇదే నిర్ణయం తమకు అశనిపాతంగా మారిపోతోందని వాపో తున్నాయి. కనీసం చెక్‌పోస్టులు లేకపోవడంతో ఏ సరుకులు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నాయి.. ఏ గోదాముల్లో పెడుతున్నారు.. సరుకులు వస్తున్నాయా లేదా అనే విషయాలు కూడా రాష్ట్ర పన్నులశాఖతోపాటు సెంట్రల్ ఎక్సైజ్‌కు తెలియడం లేదు. దీంతోపాటు వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి ఏం జరుగుతుందని పరిశీలించే అవకాశం కూడా పన్నులశాఖ అధికారులకు లేకుండా పోయింది.
బిల్లుల్లో పన్నుల ప్రస్తావన మాయం...
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో రాష్ట్రంలో ఏటా పెద్ద ఎత్తున బట్టల కొనుగోళ్లు జరుగుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోని బడా బట్టల దుకాణాలు, షాపింగ్ మాల్స్ గత వారం రోజులుగా కిటకిటలాడుతూనే ఉన్నాయి. జీఎస్టీ ప్రకారం ప్రతి రూ. 1,000లోపు కొనుగోళ్లపై 5 శాతం, ఆపైన జరిపే కొనుగోళ్లపై వినియోగదారులు 12 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వ్యాపారులు ప్రతి లావాదేవీకీ బిల్లు ఇచ్చి అందులోనే పన్నులను కూడా ప్రస్తావించాలి. కానీ చాలా మంది వ్యాపారులు ‘తెలివి’గా వ్యవహరిస్తూ కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో జరిగే వ్యాపార లావాదేవీలకు బిల్లులిచ్చినా చాలా చోట్ల పన్ను అంశాన్నే ప్రస్తావించడం లేదు. కొన్ని షాపింగ్ మాల్స్ మాత్రం బిల్లు కింది భాగంలో ‘దిసీజ్ ఎస్టిమేషన్.. ప్యాకింగ్ స్లిప్.. నాట్ ఫైనల్ ఇన్వాయిస్’ అని రాయడం ద్వారా బిల్లుపై జీఎస్టీ ఎందుకు ప్రస్తావించలేదనే ప్రశ్న కూడా తలెత్తకుండా జాగ్రత్తపడుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనైతే బిల్లుల్లేవు, జీఎస్టీ లేదన్న రీతిలోనే వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యమే. ఇలా వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ అందులో పదో, పరకో ప్రభుత్వానికి పన్ను చెల్లిద్దామనే కోణంలో వ్యాపారులు వ్యవహరిస్తున్నా కనీసం పట్టించుకునే నాథుడు కూడా లేకపోవడం గమనార్హం.
ఇంకా వ్యాట్ పనుల్లోనే సిబ్బంది...
జీఎస్టీ వ్యవహారాలకన్నా అంతకుముందు వరకు అమల్లో ఉన్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్)లో మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో పన్నులశాఖలోని కిందిస్థాయి సిబ్బంది వ్యాట్ డీలర్ల ఆడిటింగ్, స్క్రూటినీ లాంటి పనులకే పరిమితమయ్యారు. దీంతో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న వ్యాపారులు జీరో దందాకు తెరలేపుతున్నారని పన్నులశాఖ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఏ దశలోనూ వ్యాపారులను అడిగే అవకాశం కాదు కదా... కనీసం సమన్వయం చేసే పరిస్థితి కూడా లేకపోవడం దారుణమని, గతంలో ఎప్పుడూ ఇంత విచ్చలవిడి వ్యాపార లావాదేవీలు జరగలేదని వాణిజ్య పన్నులశాఖలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. సరైన పరిస్థితులుంటే దసరా, దీపావళి పండుగల సీజన్‌లో కనీసం రూ. 200 కోట్ల పన్నులు జమ అయ్యేవని వ్యాఖ్యానించారు.