సంతలకు రావొద్దని వ్యాపారులకు హెచ్చరిక
దుమ్ముగూడెం: తెలంగాణ సరిహద్దు అటవీప్రాంతంలో నిర్వహిస్తున్న వార సంతలను ఆపివేయాలని మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోని అటవీ ప్రాంతంలోగల గొల్లపల్లి, కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధి దండకారణ్యంలో నిర్వహిస్తున్న ఈ సంతల్లోకి వ్యాపారులు అడుగుపెట్టొద్దంటూ హెచ్చరించారు.
దీంతోపాటు అటవీ ప్రాంతంలోని రహదారులను దిగ్బంధించడానికి వెయ్యి మంది మిలీషియా సభ్యులను రంగంలోకి దింపి కందకాలు తవ్వడానికి ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు సమాచారం. దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా పోలీసు బలగాలను దింపడంతోపాటు బేస్ క్యాంపుల ఏర్పాటు చేస్తోంది.
జనవరిలో సరిహ ద్దులో ఉన్న ధర్మపేటలో బేస్‌క్యాంపు ఏర్పాటు చేసిన పోలీసులు తర్వాత గొల్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎలకనగూడ వద్ద మరో బేస్ క్యాంపు ఏర్పాటుచేసి ముందడుగు వేశారు. మావోలకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందిస్తున్నారనే నెపంతో వారిని సంతలకు రావద్దని బుధవారం సాయంత్రం హెచ్చరించినట్లు తెలిసింది. ధర్మపేట, గొల్లపల్లి, కిష్టారం, ఎలకనగూడ, బూరుగులంక సంతలను పూర్తిగా నిలిపివేయాలని హెచ్చరిస్తూ కొందరు వ్యాపారుల వద్ద ఉన్న సరుకులను మావోలు గ్రామాల్లో దింపినట్లు తెలిసింది.
దండకారణ్యంలోని ఖనిజ సంపదను, వన సంపదను లూటీ చేయడానికే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం బేస్‌క్యాంపులు ఏర్పాటుచేసి దమనకాండ సృష్టించడానికి ప్రయత్నిస్తోందని సీపీఐ(మావోయిస్టు) కిష్టారం ఏరియా పేరుతో లేఖ విడుదల చేశారు.
వార సంతలకు ‘మావోల’ బ్రేక్!
Published Fri, Jul 17 2015 1:11 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement