పేదల బియ్యం.. పెద్దల పరం | Poor rice .. Adult industries | Sakshi
Sakshi News home page

పేదల బియ్యం.. పెద్దల పరం

Published Sat, Nov 9 2013 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM

Poor rice .. Adult industries

 

=శ్రీకాళహస్తి కేంద్రంగా చౌకబియ్యం అక్రమ వాప్యారం
 =గిడ్డంగి నుంచే నేరుగా కర్ణాటకకు తరలిస్తున్న వైనం
 =కమీషన్ల కక్కుర్తిలో రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు

 
 శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: మూడు పూటలా పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చౌకబియ్యాన్ని కొందరు పెద్దలు గద్దల్లా తన్నుకు పోతున్నారు. చాలా సంవత్సరాలుగా శ్రీకాళహస్తి కేంద్రంగా బడాబాబులు చౌకబియ్యాన్ని అక్రమంగా బొక్కేస్తూ లక్షలు గడిస్తున్నారు.  దీనిపై గతంలో అనేక అక్రమాలు వెలుగుచూడడంతో 10 మందికి పైగా గిడ్డంగి అధికారులు సస్పెండ్‌కు గురయ్యారు.

రెండేళ్లలో ఆరుగురు గిడ్డంగి డీటీలను మార్పు చేశారు. ఆరు నెలల క్రితం శ్రీకాళహస్తి ప్రాంతంలో వెయ్యి బస్తాలకు పైగా చౌకబియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు బడా వ్యాపారులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం ఆగినట్టు కనిపించినా తిరిగి 40 రోజులుగా చౌకబియ్యాన్ని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి బియ్యం తరలిపోతున్నా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
 
 కర్ణాటకకు తరలుతున్న చౌకబియ్యం


 శ్రీకాళహస్తి పట్టణ శివారు ప్రాంతమైన రాజీవ్‌నగర్ కాలనీ కేంద్రంగా చౌకబియ్యం అక్రమ వ్యాపారం సాగుతోంది. చౌకదుకాణం డీలర్లు, గిడ్డంగి నుంచి కిలో బియ్యం రూ.13కు కొనుగోలు చేస్తున్నారు. రవాణా చార్జీలకు రూ.2 చెల్లిస్తున్నారు. కర్ణాటకలో కిలో రూ.25కు విక్రయిస్తున్నారు. దీంతో వ్యాపారులు కిలో బియ్యంపై  రూ.10 ఆదాయం పొందుతున్నారు.

ఒక్కసారి ఓ లారీలో 15 టన్నుల బియ్యాన్ని తరలిస్తున్నారు. ఒక లోడును గమ్యానికి చేరిస్తే ఖర్చులు పోగా రూ.1.5లక్షలు మిగులుతుంది. ఈ ప్రాంతం నుంచి నెలకు 40నుంచి 50 లోడ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు అదేస్థాయిలో కమీషన్లు అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏరియా ఆస్పత్రి వద్ద 300 బస్తాలతో వెళుతున్న ఓ బియ్యంలారీని పోలీసులు పట్టుకుని రెవెన్యూ శాఖాధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరేలోపే కమీషన్లు తీసుకుని లారీని వదిలిపెట్టేశారు.
 
 గిడ్డంగి నుంచే నేరుగా..
 కేవీబీపురం మండలంలోని పెరిందేశం సమీపంలో మరో స్టాక్‌పాయింట్‌ను ఏర్పాటు చేసుకుని నకిలీ ఆర్వోలతో శ్రీకాళహస్తిలోని గిడ్డంగి నుంచే నేరుగా చౌకబియ్యాన్ని అక్కడకు తరలిస్తున్నారని సమాచారం. అక్కడి నుంచి పిచ్చాటూరు, నగరి మీదుగా కర్ణాటకకు బియ్యాన్ని తరలిస్తున్నారని తెలిసింది. ఇప్పటికైనా నిరుపేదల కడుపులు నింపే చౌకబియ్యం అక్రమార్కుల పరం కాకుండా జిల్లా అధికారులు కాపాడాల్సి ఉంది.
 
 వ్యాపారులతో సంబంధంలేదు
 చౌకబియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులతో మాకు ఎలాంటి సంబంధం లేదు. నకిలీ ఆర్వోలతో బియ్యాన్ని తరలించడం వాస్తవం కాదు. పట్టణంతోపాటు మా పరిధిలోని ఐదు మండలాల డీలర్లకు అందాల్సిన మొత్తం బియ్యాన్ని ఆర్వోల ద్వారానే పంపుతున్నాం.
 - రమేష్‌బాబు, గిడ్డంగి డీటీ, శ్రీకాళహస్తి
 
 చౌకబియ్యం తరలిస్తే ఊరుకోం
 పేదలకు అందాల్సిన చౌకబియ్యాన్ని అక్రమంగా తరలిస్తే ఊరుకోం. రెవెన్యూ అధికారులు వ్యాపారుల నుంచి కమీషన్లు తీసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. బియ్యాన్ని కార్డుదారులకు ఇవ్వకుండా డీలర్లు వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
 -వీరాస్వామి, తహశీల్దార్
 
 సమాచారం అందితే చర్యలు

 చౌకబియాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. చిన్నచిన్న పొరబాట్లు ఉంటే సరిచేస్తాం. అక్రమ రవాణాపై ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం. అక్రమ రవాణాను అడ్డుకుంటాం.
 -సంజీవ్‌కుమార్, రూరల్ ఎస్‌ఐ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement