Rajiv Nagar Colony
-
కాకులకు ఏమైందో?
వికారాబాద్ అర్బన్: పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఆదివారం సుమారు 20 కాకులు మృత్యువాతపడ్డాయి. వికారాబాద్ నుంచి అనంతగిరి వెళ్లే ప్రధాన రోడ్డు పక్కనే రాజీవ్‌నగర్ ఉంది. కాలనీకి ఆనుకుని రోడ్డుకు ఇరువైపులా పెద్దపెద్ద మర్రి, మామిడి చెట్లు ఉన్నాయి. ఆదివారం ఉదయం ఉన్నట్టుండి చెట్ల పైనుంచి కాకులు కిందపడటం, కొద్దిసేపు గిలగిలా కొట్టుకొని చనిపోవడాన్ని స్థానికులు గమనించారు. ఒకటి తర్వాత ఒకటి సుమారు 20 కాకులు మృత్యువాత పడ్డాయి. అదేవిధంగా కాలనీలోని పలువురి ఇళ్ల ఎదుట ఉన్న చెట్ల మీది నుంచి కూడా కాకులు పడిపోగా కొందరు మంచినీరు తాగించి బతికించే ప్రయత్నం చేశారు. ఏమైనా విషాహారం తిని ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. కరోనా ప్రారంభంలోనూ వికారాబాద్ పట్టణంలో తొలిసారిగా రాజీవ్‌నగర్ కాలనీలోనే రెడ్‌జోన్ ఏర్పాటు చేయడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కాకుల మృతితో భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే కారణాలు తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పోస్టుమార్టం చేస్తాం పాయిజన్ కలిసిన నీళ్లు తాగడంతో కాకులు మృతిచెంది ఉండొచ్చు. ఆదివారం వాటి కళేబరాలను సేకరించాం. పోస్టుమార్టం నిర్వహించి కారణాలు తెలుసుకుంటాం. – సదానందం, జిల్లా పశువైద్యాధికారి -
పట్టణ నడిబోడ్డున యువతి దారుణ హత్య
రాత్రి 7.30 గంటలు.... అందరూ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఎవరి పనుల్లో వారు తలమునకలై ఉన్నారు.... అంతవరకూ ప్రశాంతంగా ఉన్న ఆ వీధిలో ఒక్కసారిగా ఏడుపులు, కేకలు మిన్నంటాయి. ఉలిక్కి పడిన ఆ వీధివాసులు పరుగుపరుగున బయటకు వచ్చి చూసేసరికి...రక్తపు మడుగులో ఓ యువతి పడి ఉంది. తమ ఇళ్లమధ్యే హత్య జరగడంతో అందరూ నిర్ఘాంతపోయారు. సమాచారం దావానలంలా వ్యాపించడంతో అక్కడికి పెద్ద ఎత్తునజనం చేరుకున్నారు. ఇంట్లో ఉంచుకుంటే అల్లుడే ఇంత పనిచేస్తాడని ఊహించలేకపోయామని మృతురాలి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. విజయనగరం క్రైం: విజయనగరం పట్టణ నడిబోడ్డున యువతి దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. ఇందుకు సంబంధించి యువతి తల్లిదండ్రులు, స్థానికులు, పోలీసులు అందించి న వివరాల ప్రకారం.. పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో కూర్మదాసు సూర్యనారాయణ, లక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. కూర్మదాసు రోడ్డు పై పుస్తకాలు విక్రయిస్తూ, ఆయన భార్య లక్ష్మి వంటలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరి కుమారుడు ఏడాది క్రితం మృతి చెందాడు. ఇద్దరు కుమార్తెలలో పెద్దకుమార్తె దుర్గాదేవిని నాలుగేళ్ల క్రితం ఎస్.కోటకు చెందిన ఎ.నానాజీ కి ఇచ్చి వివాహం చేశారు. చిన్న కుమార్తె లలితాదేవి తల్లిదండ్రులతో కలిసి ఉంటూ ఇంటివద్దే టైలరింగ్ చేస్తోంది. నెల క్రితం నానాజీ కుటుంబ సభ్యులతోపాటు అత్తమామలు తిరుపతి యాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకుని వచ్చిన తర్వాత నానాజీ ఎస్.కోటకు వెళ్లకుండా రాజీవ్‌నగర్ కాలనీలోనే మామగారి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. నానాజీ భార్య దుర్గాదేవి ప్రస్తుతం గర్భిణి. నానాజీ తన మామ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించాడు. సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నానాజీని పట్టుకుని, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. బుధవారం ఉదయం సూర్యనారాయణ పుస్తకాలు అమ్ముకునేందుకు వెళ్లగా, భార్య లక్ష్మి వంటలు చేసేందుకు వెళ్లింది. రెండో కుమార్తె లలితాదేవి ఇంటివద్దే ఉంది. లక్ష్మి వంటపని ముగించుకొని రాత్రి ఏడున్నరగంటల ప్రాంతంలో ఇంటికి చేరేసరికి, ఇంట్లో ఉన్న మంచం మీద లలితాదేవి అర్ధనగ్నంగా పడి ఉంది. ఆమెకు నైటీ వేసి, కేకలు వేయడంతో స్థానికులు వచ్చి, పోలీసులకు సమాచారం అందించారు. లలితాదేవి నోట్లో, మెడ, ముఖంపై రాడ్డుతో పొడిచినట్లుగా గాయాలున్నాయి. గోడపై రక్తం మరకలు చిందాయి. ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరిచి ఉన్నాయి. వాటిలో ఉండవలసిన సుమారు మూడు తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.5 వేల నగదు కనిపించలేదు. ఇంట్లో ఉండవలసిన పెద్ద కుమార్తె, అల్లుడు 6.30 గంటల సమయంలో బయటకు వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, సీఐ కె.రామారావు, ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్ చేరుకున్నారు. డీఎస్పీ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను వివరాలు అడిగితెలుసుకున్నారు. లలితాదేవిని హత్యకు వినియోగించిన రాడ్లను, మంచం కింద ఉన్నవాటిని పరిశీలించారు. అక్కాబావలపై అనుమానం.. ఇంట్లో లలితాదేవితోపాటు నానాజీ, అక్క దుర్గాదేవి ఉన్నారు. దుర్గాదేవి, నానాజీలు లలితాదేవిని రాడ్డుతో పొడిచి చంపినట్లుగా తండ్రి సూర్యనారాయణ ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ అల్లుడు తాగి వచ్చి గొడవపడుతుండేవాడని వాపోయాడు. లలితాదేవి అర్ధనగ్నంగా మంచంపై పడి ఉండడాన్ని బట్టి నానాజీ లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో నానాజీ, దుర్గాదేవి ఇంటినుంచి పరారవడాన్ని బట్టివారే హత్యచేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నానాజీ, దుర్గాదేవిలను పట్టుకోవడానికి రెండు టీంలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. లైంగిక దాడి జరిగిందా లేదా అనేది వైద్యులు ఇచ్చే నివేదికను బట్టి తెలుస్తుందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్టు తెలిపారు. సంఘటన స్థలానికి క్లూస్ టీం సంఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకుని ఆనవాళ్లను పరిశీలించారు. క్లూస్ ఏఎస్ఐ టి. విజయ, సభ్యులు సత్యనారాయణ, రాజు, శ్రీను వేలిముద్రలను సేకరించారు. రోదిస్తున్న తల్లిదండ్రులు.. లలితాదేవి హత్యకు గురవడంతో తల్లిదండ్రులు లక్ష్మి, సూర్యనారాయణ భోరున విలపిస్తున్నారు. ఇంట్లో ఉంచుకుంటే ఇంతపని చేస్తాడని ఉహించలేకపోయామని, కుమార్తెను హత్యచేసి, పెళ్లికోసం ఉంచిన బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడని ఆరోపించారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
గుల్బర్గా జిల్లా సేడెం సమీపంలో రెండు కార్లు ఢీ రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన ఐదుగురి దుర్మరణం కర్ణాటకకు చెందిన మరో వ్యక్తి కూడా... పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘటన వికారాబాద్, న్యూస్‌లైన్: రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణవాసులు ఐదుగురు దుర్మరణం చెందారు. కర్ణాటకలోని సేడెంలో ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన మహ్మద్‌ఖాన్(62) టీబీ ఆస్పత్రి రిటైర్డ్ ఉద్యోగి. ఆయన ఆదివారం తతన భార్య ఆశాబేగం(52), కుమారుడు ఫజల్‌ఖాన్(24), మనవడు రేహాన్(5), సమీప బంధువు(50)తో కలిసి ఇండికా కారులో కర్ణాటక గుల్బర్గా జిల్లా కర్తాల్‌లో బంధువుల వివాహానికి వెళ్లాడు. రాత్రి తిరుగు ప్రయాణంలో సేడెం సమీపంలోని కండ్రపల్లి సమీపంలో వీరి కారును ఎదురుగా వస్తున్న స్కార్పియో ఢీకొంది. ప్రమాదంలో వీరంతా తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే దుర్మరణం చెందారు. కాగా ఈ ప్రమాదంలో కర్నాటకలోని చిత్తాపూర్‌కు చెందిన ఇన్నోవా కారు డ్రైవర్ అయ్యన్న పూజారి(25)కూడా మృతిచెందారు. -
పేదల బియ్యం.. పెద్దల పరం
=శ్రీకాళహస్తి కేంద్రంగా చౌకబియ్యం అక్రమ వాప్యారం =గిడ్డంగి నుంచే నేరుగా కర్ణాటకకు తరలిస్తున్న వైనం =కమీషన్ల కక్కుర్తిలో రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: మూడు పూటలా పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చౌకబియ్యాన్ని కొందరు పెద్దలు గద్దల్లా తన్నుకు పోతున్నారు. చాలా సంవత్సరాలుగా శ్రీకాళహస్తి కేంద్రంగా బడాబాబులు చౌకబియ్యాన్ని అక్రమంగా బొక్కేస్తూ లక్షలు గడిస్తున్నారు. దీనిపై గతంలో అనేక అక్రమాలు వెలుగుచూడడంతో 10 మందికి పైగా గిడ్డంగి అధికారులు సస్పెండ్‌కు గురయ్యారు. రెండేళ్లలో ఆరుగురు గిడ్డంగి డీటీలను మార్పు చేశారు. ఆరు నెలల క్రితం శ్రీకాళహస్తి ప్రాంతంలో వెయ్యి బస్తాలకు పైగా చౌకబియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు బడా వ్యాపారులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం ఆగినట్టు కనిపించినా తిరిగి 40 రోజులుగా చౌకబియ్యాన్ని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి బియ్యం తరలిపోతున్నా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కర్ణాటకకు తరలుతున్న చౌకబియ్యం శ్రీకాళహస్తి పట్టణ శివారు ప్రాంతమైన రాజీవ్‌నగర్ కాలనీ కేంద్రంగా చౌకబియ్యం అక్రమ వ్యాపారం సాగుతోంది. చౌకదుకాణం డీలర్లు, గిడ్డంగి నుంచి కిలో బియ్యం రూ.13కు కొనుగోలు చేస్తున్నారు. రవాణా చార్జీలకు రూ.2 చెల్లిస్తున్నారు. కర్ణాటకలో కిలో రూ.25కు విక్రయిస్తున్నారు. దీంతో వ్యాపారులు కిలో బియ్యంపై రూ.10 ఆదాయం పొందుతున్నారు. ఒక్కసారి ఓ లారీలో 15 టన్నుల బియ్యాన్ని తరలిస్తున్నారు. ఒక లోడును గమ్యానికి చేరిస్తే ఖర్చులు పోగా రూ.1.5లక్షలు మిగులుతుంది. ఈ ప్రాంతం నుంచి నెలకు 40నుంచి 50 లోడ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు అదేస్థాయిలో కమీషన్లు అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏరియా ఆస్పత్రి వద్ద 300 బస్తాలతో వెళుతున్న ఓ బియ్యంలారీని పోలీసులు పట్టుకుని రెవెన్యూ శాఖాధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరేలోపే కమీషన్లు తీసుకుని లారీని వదిలిపెట్టేశారు. గిడ్డంగి నుంచే నేరుగా.. కేవీబీపురం మండలంలోని పెరిందేశం సమీపంలో మరో స్టాక్‌పాయింట్‌ను ఏర్పాటు చేసుకుని నకిలీ ఆర్వోలతో శ్రీకాళహస్తిలోని గిడ్డంగి నుంచే నేరుగా చౌకబియ్యాన్ని అక్కడకు తరలిస్తున్నారని సమాచారం. అక్కడి నుంచి పిచ్చాటూరు, నగరి మీదుగా కర్ణాటకకు బియ్యాన్ని తరలిస్తున్నారని తెలిసింది. ఇప్పటికైనా నిరుపేదల కడుపులు నింపే చౌకబియ్యం అక్రమార్కుల పరం కాకుండా జిల్లా అధికారులు కాపాడాల్సి ఉంది. వ్యాపారులతో సంబంధంలేదు చౌకబియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులతో మాకు ఎలాంటి సంబంధం లేదు. నకిలీ ఆర్వోలతో బియ్యాన్ని తరలించడం వాస్తవం కాదు. పట్టణంతోపాటు మా పరిధిలోని ఐదు మండలాల డీలర్లకు అందాల్సిన మొత్తం బియ్యాన్ని ఆర్వోల ద్వారానే పంపుతున్నాం. - రమేష్‌బాబు, గిడ్డంగి డీటీ, శ్రీకాళహస్తి చౌకబియ్యం తరలిస్తే ఊరుకోం పేదలకు అందాల్సిన చౌకబియ్యాన్ని అక్రమంగా తరలిస్తే ఊరుకోం. రెవెన్యూ అధికారులు వ్యాపారుల నుంచి కమీషన్లు తీసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. బియ్యాన్ని కార్డుదారులకు ఇవ్వకుండా డీలర్లు వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. -వీరాస్వామి, తహశీల్దార్ సమాచారం అందితే చర్యలు చౌకబియాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. చిన్నచిన్న పొరబాట్లు ఉంటే సరిచేస్తాం. అక్రమ రవాణాపై ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం. అక్రమ రవాణాను అడ్డుకుంటాం. -సంజీవ్‌కుమార్, రూరల్ ఎస్ఐ