సాక్షి, సిటీబ్యూరో : ఉల్లి కొరత సాకుతో నగర మార్కెట్లో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. వ్యాపారులు ఎవరికి తోచిన రీతిలో వారు అక్రమాలకు పాల్పడుతూ వినియోగదారులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.60-65లకు విక్రయించే ఉల్లిలో వ్యాపారులకు మహా అయితే కేజీకి రూ.5-6ల లాభం ఉంటుందనుకొంటాం. అయితే... కేజీకి రూ.18-23ల వరకు అదనంగా పిండుకొంటున్న విషయం వినియోగదారులకు తెలియదు. నిజానికి హోల్‌సేల్ మార్కెట్లో గ్రేడ్-1 రకం ఉల్లి ధర కేజీ రూ.42, గ్రేడ్-2 రకం రూ.32లకే లభిస్తోంది. కానీ రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి వ్యాపారులు ధర భారీగా పెంచేస్తున్నారు.
ఆ లాభం సరిపోదన్నట్లు గ్రేడ్-1 రకం ఉల్లిలో గ్రేడ్-2 ఉల్లిని కూడా కలిపేసి నాణ్యమైన సరుకు పేరుతో వినియోగదారుడికి అంటగడుతున్నారు. వీటిని ఇంటికి తీసుకె ళ్లిన రెండోరోజే అందులో సగం సరుకు డ్యామేజ్ అవుతోంది. ఇక తోపుడు బండ్ల వ్యాపారులు మరో అడుగు ముందుకేసి ఇళ్ల వద్దకే సరుకు తీసుకెళ్లి సామన్య మధ్యతరగతి వర్గాల జేబుకు పెద్ద కన్నమే వేస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్లో గ్రేడ్-2 ఉల్లిని క్వింటాల్ రూ.32వేల ప్రకారం కొనుగోలు చేసి ఇంటికి తెచ్చాక వాటిని గ్రేడింగ్ చేసి రెండు రకాల ధరల్లో విక్రయిస్తున్నారు.
కాస్త పెద్దసైజ్‌లో ఉన్న ఉల్లిని కేజీ రూ.50-55లకు, చిన్నసైజ్ ఉల్లిని కేజీ రూ.40-45ల ప్రకారం అమ్ముతున్నారు. నిజానికి హోల్‌సేల్ మార్కెట్లో వారికిపడ్డ ధర కేజీ రూ.32లు మాత్రమే. ఇతర రవాణా, హమాలీ ఖర్చులన్నీ వేసుకున్నా కేజీ రూ.35-36ల చొప్పున అమ్మాలి. అయితే... ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి కొరతను సొమ్ము చేసుకునేందుకు ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల నగరానికి సరుకు రావ ట్లేదన్న సాకుతో వ్యాపారులు ధరలు పెంచి దగా చేస్తున్నారు.
సరఫరా అరకొరే...
నగర అవసరాలకు తగినంత సరుకు దిగుమతి చేసుకునే విషయంలో మార్కెటింగ్ శాఖ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. నగర రోజూవారీ అవసరాల్లో నాలుగో వంతు మాత్రమే సరుకు దిగుమతి అవుతోంది. శనివారం హోల్‌సేల్ మార్కెట్‌కు మొత్తం 7వేల క్వింటాళ్ల ఉల్లి మాత్రమే దిగుమతైంది. ఇందులో గ్రేడ్-1 రకం 3వేల క్వింటాళ్లు, గ్రేడ్-2 రకం 4వేల క్వింటాళ్లు సరుకు వచ్చింది. గ్రేడ్-1 రకం ఉల్లి క్వింటాల్ రూ.42వేలు, గ్రేడ్-2 రకానికి రూ.32వేలు కనీస మద్దతు ధర పలికింది.
ఈ ప్రకారం చూస్తే హోల్‌సేల్‌గా మొదటి రకం ఉల్లి కేజీ రూ.42, రెండో రకం రూ.32లు మాత్రమే. అయితే... రవాణా, హమాలీ, డ్యామేజ్, లాభం వంటివి కలుపుకొని హోల్‌సేల్ ధరకంటే మరో రూ.4-5లు అదనంగా వేసుకొని అమ్మాలి. కానీ వ్యాపారులు మాత్రం గ్రేడ్-1 ఉల్లిని కేజీ రూ.60-65, గ్రేడ్-2 రకాన్ని రూ.50-55ల ప్రకారం అమ్ముతుండటం గమనార్హం. రైతుబజార్లలోని సబ్సిడీ కౌంటర్లలో ఉల్లి కేజీ రూ.32లకు విక్రయిస్తున్నా... అవి అందరికీ అందని పరిస్థితి. ఏదో నామ మాత్రంగా ఒక్కో రైతుబజార్‌కు 8-10 క్వింటాళ్ల ఉల్లిని అధికారులు సరఫరా చేస్తుండటంతో అవి ఏ మూలకూ సరిపోవట్లేదు.
నిల్వలపై నిర్లక్ష్యం
మార్కెట్లో మరింత కొరతను సృష్టించి... ధరలను పెంచి సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు ఎత్తుగడ వే సి పెద్దమొత్తంలో ఉల్లిని నిల్వ చేసినట్లు సమాచారం. ఈ విషయం మార్కెటింగ్ శాఖ అధికారులకు తెలిసినా దాడులు నిర్వహించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. హోల్‌సేల్ మార్కెట్ వరకు తాము పర్యవేక్షిస్తామే తప్ప, బహిరంగ మార్కెట్లో ధరలను నియంత్రించడం తమ చేతుల్లో లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. పలు గోదాముల్లో దాచేసిన ఉల్లి నిల్వలను వెలికితీస్తే ధరలు వాటంతట అవే దిగివస్తాయని మార్కెటింగ్ విశ్లేషకులు సూచిస్తున్నారు.