ఒంగోలు, న్యూస్‌లైన్ : బడా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని వారిని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాలనుకున్న మోసగాడి వ్యూహం ఫలించలేదు. పోలీసులకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు అతడిని అదుపులోకి తీసుకోవడంతో బాధితులు ఆర్థికంగా నష్టపోలేదు. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా ఆర్ వెల్లూరు గ్రామానికి చెందిన క్రిష్ణం సతీష్ అలియాస్ భద్రాచలం వ్యాపారులను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతను పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఉదయం పెళ్లూరులో అరెస్టు చేసినట్లు ఒంగోలు తాలూకా సీఐ శ్రీనివాసన్ తన చాంబర్‌లో శుక్రవారం సాయంత్రం మీడియాకు వివరించారు.
ఇదీ..జరిగింది
క్రిష్టం సతీష్ ఆర్‌వల్లూరు గ్రామంలో 2001లో ఇంటర్ పూర్తిచేశాడు. ఓ ఫైనాన్స్ వ్యాపారి వద్ద పనిచేస్తూ * 4 లక్షలతో ఉడాయించాడు. అక్కడి నుంచి సేలం సమీపంలోని మేటూరు చేరుకున్నాడు. అక్కడ ఫైనాన్స్ వ్యాపారిగా పరిచయం చేసుకొని *40 లక్షలు వసూలు చేసి ఉడాయించాడు. అక్కడ పోలీసుస్టేషన్లో ఇతనిపై కేసు నమోదైంది. ఈసారి నెల్లూరు వచ్చాడు. అక్కడ మూడు నెలల పాటు నివాసం ఉన్నాడు. లాభం లేదనుకుని ప్రకాశం జిల్లా న్యూ పెళ్లూరు కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. దానికి కేటీఆర్ అండ్ సీఎంఎల్ ఫైనాన్స్, కెమికల్ కంపెనీ అని బోర్డు తగిలిచ్చాడు.
కేఆర్‌టీ, సీఎంఎల్ అనే ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు ఇప్పిస్తుంటానని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను కలిశాడు. విదేశాల్లో చదువుకునేందుకు రుణం ఇప్పించమని కొందరు ఇతడిని వేడుకున్నారు. వారికి ఎంత రుణం కావాలో అడిగి తెలుసుకున్నాడు. వాటికి హామీగా అవసరమైన ఆస్తుల తాలూకా బాండ్లు, ఫైనాన్స్ కంపెనీలకు రాసిచ్చే ఒప్పంద పత్రాలు తీసుకున్నాడు. రుణం మంజూరు కావాలంటే ముందుగా తీసుకునే మొత్తానికి కనీసం రెండు ఇన్‌స్టాల్‌మెంట్లు అడ్వాన్సుగా చెక్కులు ఇవ్వాలని నమ్మించాడు. ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తాన్ని సంస్థ నిర్ణయిస్తుందంటూ ఖాళీ చెక్కులు తీసుకున్నాడు. ఇలా ఇతని వలలో చిక్కుకున్నవారిలో జిల్లాకు చెందిన ఒక టీడీపీ నేత, రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఓ హాస్పిటల్ డెరైక్టర్, తూర్పుగోదావరి జిల్లాలోని ఓ విద్యాసంస్థ యజమాని ఇలా అనేక మంది ఉన్నారు. తమ ఫైనాన్స్ కంపెనీలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తాలూకా బ్లాక్‌మనీ ఉందంటూ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న బిగ్‌షాట్స్‌కు వివరించేవాడు.
గుట్టురట్టు ఇలా..
నెలలు గడుస్తున్నా రుణం అందకపోవడం, తమ పత్రాలన్నీ అతని చేతిలో ఇరుక్కుపోవడంతో ఏం చేయాలో పాలుపోని పలువురు తాలూకా సీఐని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సీఐ శ్రీనివాసన్ పెళ్లూరులోని సతీష్ ఇంటిపై తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. అక్కడ పలువురికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 10 సూట్‌కేసుల్లోని పత్రాలను సీజ్ చేశారు. ఖాళీ చెక్కులు కూడా లభ్యమయ్యాయి. అనంతరం నిందితుడిని విచారించగా అసలు విషయాలు బహిర్గతమయ్యాయి. గతంలో కేసులతో పాటు తాను ఏం చేయాలనుకున్నది వివరించాడు. రుణాలు కావాలనుకున్నవారి నుంచి ప్రాసెసింగ్ ఫీజు కింద రుణాన్ని బట్టి * 2 నుంచి * 10 లక్షలు చొప్పున వసూలు చేసుకోవాలనే అతని పన్నాగం బయటపడింది. వారం రోజుల్లో కనీసం పదిమంది నుంచి * 50 లక్షలు వసూలు చేసుకొని పరారీ కావాలనేది నిందితుని ఉద్దేశం. అదృష్టవశాత్తు ఇంతవరకు నిందితుని చేతికి ఒక్క రూపాయి కూడా చేరలేదని సీఐ స్పష్టం చేశారు. కేసును ఛేదించి ప్రజల్లో పోలీసుశాఖకు మంచి పేరు తీసుకొచ్చారంటూ సీఐతో పాటు ఆయన సిబ్బందిని ఒంగోలు టౌన్ డీఎస్పీ పల్లె జాషువా అభినందించారు. ఈ సందర్భంగా బాధితులు పలువురు తాలూకా సీఐ వద్దకు చేరుకుని తమ పేర్లను బయటపెట్టొద్దంటూ వేడుకోవడం గమనార్హం.
పోలీసులు స్పందించకుంటే..
పోలీసులు సకాలంలో స్పందించకుంటే కొంతకాలం తరువాత బాధితులే నిందితులుగా మారేవారని కూడా పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఖాళీ చెక్కులపై తన ఇష్టం వచ్చినట్లుగా నగదు రాసుకొని నిందితుడు జిల్లా మార్చి ఎక్కడో ఒకచోట క్యాష్ చేసుకునేందుకు యత్నించేవాడు. చెక్కులు బౌన్స్ అయితే బాధితుల మీదే పోలీసులకు ఫిర్యాదు చేసేవాడు. రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను పరిశీలించిన పోలీసులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వ్యాపారులే అతని టార్గెట్
Published Sat, Oct 5 2013 4:10 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement