
రంగురాళ్ల క్వారీలపై కన్ను!
- తవ్వకందారులకు అనుకూలిస్తున్న వర్షాలు
- సాలికమల్లవరం క్వారీపై వ్యాపారుల దృష్టి
- అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు
- బేస్ క్యాంపులు ఏర్పాటు
గొలుగొండ: రంగురాళ్ల తవ్వకాలు అడపాదడపా జరుగుతున్నాయి. కరక, పప్పుశెట్టిపాలెం, సాలికమల్లవరం ప్రాంతాల్లో సుమారు 30కి పైగా రంగురాళ్ల క్వారీలు ఉన్నాయి. వీటిలో రెండేళ్లుగా నిలిచిపోయిన అక్రమతవ్వకాలు మళ్లీ అక్కడక్కడ జరుగుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు అనుకూలం కావడంతో తవ్వకందారులు మళ్లీ రంగురాళ్ల క్వారీలపై దృష్టి సారించారు. కరక ప్రాంతంలో కాపలా పటిష్టంగా ఉన్నందున తవ్వకందారుల కళ్లు సాలిక మల్లవరంపై పడింది. పప్పుశెట్టిపాలెంలో కూడా తవ్వకాలు ఊపందుకున్నాయి. రెండు రోజులక్రితం వరకు ప్రశాంతంగా ఉన్న సాలిక మల్లవరం క్వారీపై తవ్వకందారులు దృష్టి సారించడం అటవీ, పోలీసు అధికారులకు తలనొప్పిగా మారింది.
తవ్వకాలకు పాల్పడిన, సహకరించిన వ్యాపారులపై వారు నిఘా ఏర్పాటుచేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు అనుకూలం కావడంతోతవ్వకాలను కొంతమంది వ్యాపారులు ప్రోత్సహిస్తున్నారు. రెండు నెలల క్రితం ఈ ప్రాంతంలో తవ్వకందారులతోపాటు వ్యాపారులను ఎస్‌ఐ జోగారావు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. మళ్లీ తవ్వకాలపై అక్రమార్కుల దృష్టి మరలడంతో అటవీ, పోలీసు అధికారులు దృష్టి సారించారు.
దీనిపై అటవీశాఖ నర్సీపట్నం రేంజర్ మస్తాన్‌వల్లీని వివరణ కోరగా కరక, దోనిపాలెం,సాలికమల్లవరం ప్రాంతాల్లో తవ్వకాలు నిరోధించేందుకు బేస్ క్యాంప్‌లు ఏర్పాటుచేశామని తెలిపారు. తవ్వకాలను ప్రోత్సహించిన వారిని అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. వర్షాకాలంలో తవ్వకాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ మూడు నెలలు మొబైల్ పార్టీలు ఏర్పాటుచేస్తున్నామని ఆయన వివరించారు.