దీపావళి వస్తోందంటే ప్రజలకే కాదు.. టపాసుల వ్యాపారులకు.. ఆ దుకాణాలకు అనుమతిలిచ్చే అధికారులకు పండగే. ఎందుకంటే వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు ఏర్పాటు చేసి అధిక ధరలకు బాణాసంచా విక్రయిస్తుంటారు. ఈ తతంగమంతా కళ్లముందే జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినందుకు వారికీ కొంత ‘ప్రతిఫలం’ దక్కుతుంది. ఇలా వ్యాపారులు, అధికారుల వైఖరి పుణ్యమాని మోసపోయేది ప్రజలేనన్నది ఏటా జరుగుతున్న తంతే.
సిరిసిల్ల/మంథని/జగిత్యాల, న్యూస్‌లైన్ : దీపావళి టపాసుల వ్యాపారులు నిబంధనల ప్రకారం అగ్నిప్రమాదాలు జరగకుండా నివాస ప్రాంతాలకు దూరంగా దుకాణాలను ప్రారంభించాలి. ఒక్కో దుకాణం అనుమతికి రెవెన్యూ, మున్సిపాలిటీ, మేజర్ గ్రామపంచాయతీ, పోలీసు, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతులు కావాలి. దుకాణదారులు అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కారణంగా అన్ని శాఖల అధికారులు డబ్బులు తీసుకుంటూ కళ్లు మూసుకొని అనుమతులిస్తున్నారు. దీపావళి పండగకు టపాసులు అమ్ముకొని నాలుగు డబ్బులు సంపాదించుకోవాలన్న వ్యాపారుల మధ్య పోటీ ముడుపులకు ఆజ్యం పోస్తోంది.
ఇప్పటికే లక్షలాది రూపాయల టపాసులను కొనుగోలు చేసిన వ్యాపారులు లెసైన్స్ రాకుంటే నష్టపోతామని పోటాపోటీగా అధికారులకు డబ్బులిస్తూ లెసైన్స్ సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అన్నీ సక్రమంగా ఉన్నా అధికారులకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే. లేకుంటే ఏదో ఒక సాకుతో దుకాణాల లెసైన్స్‌లు ఇవ్వకుండా సతాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లావ్యాప్తంగా సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, మెట్‌పల్లి, కరీంనగర్, హుస్నాబాద్, సుల్తానాబాద్, ధర్మపురి, రాయికల్, చొప్పదండి, గంగాధర, హుజూరాబాద్, జమ్మికుంట, పెద్దపల్లి, మంథని, రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో 475 దుకాణాల అనుమతికి దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
ముడుపులే ఎక్కువ..
నిబంధనల ప్రకారం రెవెన్యూ, అగ్నిమాప క, పోలీసు, మున్సిపల్ అధికారులకు నిర్దిష్ట రుసుమును వ్యాపారులు ఎస్టీవోల్లో చలాన చెల్లించాల్సి ఉంది. రెవెన్యూ, ఫైర్, మున్సిపాలిటీలకు రూ.500 చొప్పున, పోలీసు శా ఖకు రూ.1500 ప్రభుత్వానికి పన్ను చెల్లిం చాల్సి ఉండగా, వ్యాపారుల నుంచి ముడుపులే ఎక్కువ దండుకుంటున్నారు.
రెవెన్యూ అధికారులు తాత్కాలిక అనుమతి కోసం రూ.3000, మున్సిపల్ అధికారులు రూ. 2000, అగ్నిమాపక అధికారులు ఒక్కో లెసైన్స్‌కు రూ.2000, అందరికంటే ఎక్కువగా పోలీసుశాఖ రూ.3000 చొప్పున వసూలు చేస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. టపాసులపై ఎమ్మార్పీ లేకపోవడం, ఎక్కడ తయారయ్యాయో ముద్రించకపోవడంతో దీన్ని సాకుగా చూపుతూ తూనికలు, కొలతల అధికారులు దుకాణం తెరచిన రోజు వచ్చి వేధిస్తారని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఒక్కో లెసైన్స్‌కు రూ.5000 వరకు ఖర్చయితే ఈసారి రూ.10 వేలవుతోందని వ్యాపారులు వాపోతున్నారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా రూ.47.50 లక్షల మేరకు అధికార యంత్రాంగం దీపావళి అవినీతి ధమాకాను మోగించారు.
‘హోల్‌సేల్’ లాభాలు
టపాసులను నిల్వ చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. నిబంధనల మేరకు గోదాముల నిర్మాణం చేపట్టాలి. జిల్లాలో జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, కోరుట్లతోపాటు మరో రెండు పట్టణాల్లో టపాసులు నిల్వ చేయడానికి వ్యాపారులకు అనుమతి ఉంది. వీరు గోదాముల సామర్థ్యానికి మించి టపాసులను నిల్వ ఉంచి అమ్మకాలు చేపట్టి లాభాలు గడిస్తారు. దీపావళికి రెండు రోజుల ముందు ఆయా పట్టణాల్లో ఒక దుకాణానికి అనుమతి తీసుకుని రెండు దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తారు. మరికొందరు పట్టణాల్లో తమ గృహాల్లో అక్రమంగా నిల్వ చేసి రిటేల్ వ్యాపారులకు అమ్ముతారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనేది అధికారులకే తెలియాలి.
భారీగా పెరిగిన ధరలు
ప్రతి సంవత్సరం అన్ని ముడిసరుకుల రీతిలో టపాసులకు సంబంధించిన ముడిసరుకుల ధరలు, లేబర్ చార్జీలు పెరుగడంతో టపాసుల ధరలు 20-30 శాతం పెరుగుతాయని హోల్‌సేల్ వ్యాపారులు అంటున్నారు. గతంలో కిలో టపాసులు రూ.240 ఉండగా, ఈసారి రూ.300కు పైగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా రూ.5కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా.
ముడుపుల ‘బాంబులు’
Published Wed, Oct 30 2013 3:50 AM | Last Updated on Wed, Sep 5 2018 9:51 PM
Advertisement