‘హలో..సార్ మేము కర్ణాటకలోని బల్లారి నుంచి మాట్లాడుతున్నం..మా ఊరి దగ్గర పల్లెటూరిలో పాత ఇల్లు తవ్వకాల్లో ఐదు కిలోల బంగారం దొరికింది..ఇక్కడ అమ్మితే అనుమానం వస్తది..మీకు తక్కువ ధరకే ఇస్తాం..కావాలంటే వచ్చి శాంపిల్ చూసుకోండి..ఆ తరువాతే డబ్బులు తీసుకుని వచ్చి బంగారం తీసుకెళ్లండి’..ఇలా వరుస కాల్స్‌తో బంగారు మాయలో పడేసి నగదు కాజేసే మోసగాళ్ల ముఠా జిల్లాపై కన్నేసింది. ఒకరు ఇద్దరు కాదు..పదుల సంఖ్యలో వ్యక్తులకు ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. బంగారం తక్కువ ధరకు దొరుకుతుందని అత్యాశకు పోతే మిగిలేది..ఇత్తడి మాత్రమే. – కోరుట్ల
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వెంకటేశ్వర్రావుకు రెండు నెలల క్రితం ఓ వ్యక్తి కర్ణాటకలోని బల్లారి నుంచి మాట్లాడుతున్నామని బంగారం పేరిట మభ్యపెట్టారు. ఫోన్‌కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి బంగారం తక్కువ ధరకు వస్తోందని నమ్మి కర్ణాటకలోని బల్లారికి వెళ్లి రూ.10 లక్షలు గుర్తుతెలియని అగంతకులకు ఇచ్చి బంగారం బిల్లలు తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చిన తరువాత చూసుకుంటే ఆ బిల్లలు ఇత్తడివి అని తేలింది. లబోదిబోమంటూ పోలీసులకు íఫిర్యాదు చేయగా నెల క్రితం పోలీసులు జగిత్యాలలో కర్ణాటకకు చెందిన రవిచంద్ర, శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు. అయినా బంగారం పేరిట మోసాలు ఆగలేదు. ఆరు నెలల క్రితం కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్టకు చెందిన తిరుపతి అనే వ్యక్తి ఈ విధంగానే రూ.10 లక్షలు మోసపోయాడు. రెండు నెలల క్రితం కోరుట్ల పట్టణంలోని 20 వార్డుకు చెందిన ఓ వ్యక్తి రూ.12 లక్షలకు మోసపోయినట్లు తెలిసింది. మోసపోయినవారు పోలీసులకు íఫిర్యాదు చేయడానికి పరువు తక్కువ వ్యవహారంగా భావిస్తుండటంతో మోసగాళ్లు ఆడిందే ఆటగా సాగుతోంది.
ఆగని ఫోన్‌కాల్స్..
బంగారం పేరిట మాయ చేస్తున్న కర్ణాటక ముఠాలోని ఇద్దరు సభ్యులను పోలీసులు నెల రోజుల క్రితం అరెస్టు చేసినప్పటికీ ఫోన్‌కాల్స్ ఆగలేదు. ఇదే ముఠాలోని ఇతర సభ్యులు కోరుట్ల, జగిత్యాల, మెట్‌పల్లి పట్టణాల్లోని వ్యాపారులకు ఫోన్లు చేస్తూ బంగారం పేరిట వల వేస్తున్నారు. ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఉంచుతున్న వ్యాపారులు చివరి వరకు తాము మోసపోయామన్న విషయాన్ని గుర్తించి ఆందోళన చెందుతున్నారు. బంగారం పేరిట మోసగించి దొరికిపోయిన నిందితులను పూర్తిస్థాయిలో విచారిస్తే ఇంకా ఈ ముఠా సభ్యులు ఎంత మంది ఉన్నారో తేల్చే అవకాశముంటుంది.ఈ దిశలో పోలీసు శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటే బంగారం పేరిట వల వేసి మోసగిస్తున్న వారి ఆగడాలకు చెక్ పెట్టవచ్చు.
సమాచారం ఇవ్వండి : రాజశేఖర్‌రాజు, సీఐ కోరుట్ల
కర్ణాటకలో బంగారం దొరికింది..తక్కువ ధరకు ఇస్తామని ఫోన్‌కాల్స్ వస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. ఫోన్‌కాల్స్ ఆధారంగా మోసగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాం. ప్రజలు అత్యాశకు పోకుండా అప్రమత్తంగా ఉండటం అవసరం.
మాయ!
Published Mon, Jan 16 2017 10:22 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
Advertisement