Fraud gang
-
రూ.8 వేలకోట్ల ఎగవేతకు ప్రణాళిక.. సూత్రధారి అరెస్ట్
దేశంలో జీఎస్టీ ఎగవేత మోసాలు ఎక్కువవుతున్నాయి. రూ.5,000 కోట్లు-రూ.8,000 కోట్ల విలువైన జీఎస్టీని ఎగవేసేందుకు 246 బోగస్ కంపెనీలను సృష్టించిన ముఠా గుట్టు రట్టయింది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన అస్రఫ్ ఇబ్రహీం కలవాడియా(50) సహా ఎనిమిది మంది వ్యక్తులపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బృందం నకిలీ పత్రాలు, సంస్థలను సృష్టించి మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించారు.పుణెలోని కోరేగావ్ పార్క్ పోలీసుల కథనం ప్రకారం..సూరత్‌కు చెందిన అస్రఫ్ ఇబ్రహీం కలవాడియా (50) సహా ఎనిమిది మంది వ్యక్తులు భారీగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 246 బోగస్ కంపెనీలు సృష్టించి ఈ చర్యకు పూనుకున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏకంగా రూ.5000 కోట్లు-రూ.8000 కోట్లు వరకు నష్టం జరుగుతుంది. సెప్టెంబర్ 2018-మార్చి 2024 మధ్య వివిధ కంపెనీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిగింది. పుణెకు చెందిన హడప్సర్లోని శివ చైతన్య కాలనీ చిరునామాతో రిజిస్ట్రర్ అయిన పఠాన్ ఎంటర్ప్రైజెస్ రూ.20.25 కోట్ల జీఎస్టీను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. దాంతో జీఎస్టీ సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) జోనల్ యూనిట్ అధికారులు పుణె పోలీసుల సహకారంతో కలవాడియాను ఎరవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సంఘటనలో తనకు సహకరించిన మరో ఏడుగురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు.ఆటోరిక్షా డ్రైవర్ పేరుతో కంపెనీ నమోదుపఠాన్ షబ్బీర్ ఖాన్ అన్వర్ ఖాన్ అనే వ్యక్తి పాన్‌కార్డుతో పఠాన్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను నమోదు చేశారు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని ఖుంబర్వాడ ప్రాంతానికి చెందిన పఠాన్ ఆటోరిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పాన్‌కార్డులో నమోదైన చిరునామాతో పోలీసులు తన ఇంటికి వెళ్లేసరికి అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. తనకు ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. నిందితులు చట్ట విరుద్ధంగా పఠాన్ పాన్‌కార్డు వాడి కంపెనీ నమోదు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఇదీ చదవండి: డిఫెన్స్ ఉత్పత్తులు ఎగుమతయ్యే టాప్ 3 దేశాలుసెక్యూరిటీగార్డు పేరుతో బ్యాంకు ఖాతాతదుపరి విచారణలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జీత్ కుకాడియా అనే పేరుతో బ్యాంక్ ఖాతా తెరిచారు. కుకాడియా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ నేరంతో తనకు సంబంధం లేదని ఆయన తెలిపారు. బ్యాంకు స్టేట్మెంట్లు, కాల్ రికార్డులను పరిశీలించిన తర్వాత ఈ ఘటనకు కలవాడియాను ప్రధాన సూత్రధారిగా గుర్తించామని సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రకాశ్ తెలిపారు. ముంబైలోని మీరా భయాందర్‌లోని ఒక హోటల్లో కలవాడియాను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తన వద్ద నుంచి సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సిమ్ కార్డ్‌లు, చెక్ బుక్‌లు, డెబిట్ కార్డ్‌లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పన్ను ఎగవేత కోసం మోసపూరిత లావాదేవీలు జరిపేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు కలవాడియా అంగీకరించాడని ప్రకాశ్ వివరించారు. -
ఘరానా మోసాలకు పాల్పడుతున్న కుటుంబం అరెస్ట్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో.. 400 మందిని మోసం చేసిన యువకుడు
వైఎస్సార్: సాఫ్ట్వేర్ ఉద్యోగం కలి ్పస్తామని సుమారు రూ. 10 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన సంఘటన పీలేరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం పలువురు బాధితులు పీలేరు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి ఎస్ఐ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం బండ్లవంకకు చెందిన రెడ్డిసూర్యప్రసాద్ అలియాస్ భరత్ అనే యువకుడు హైదరాబాద్‌లో ఉంటూ అడ్డదారిలో సంపాదించడానికి నిరుద్యోగులకు వల వేశాడు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు 400 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేశాడు. రెండు నెలల పాటు వేతనాలు సక్రమంగా చెల్లించి నమ్మించాడు. అనంతరం మొహం చాటేశాడు. దీంతో మోసపోయిన కొంత మంది యువకులు తాము డబ్బులు చెల్లించిన బ్యాంకు అకౌంట్ చిరునామాను గుర్తించారు. హైదరాబాద్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూ రు, కడప, అన్నమయ్య జిల్లాల నుంచి సుమారు 400 మంది నిరుద్యోగులు మోసపోయినట్లు తెలుసుకున్నారు. పలువురు బాధితులు తమకు న్యాయం చేయాలని పీలేరు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. -
అగర్ బత్తీ కంపెనీ పేరుతో రూ.85 లక్షలు స్వాహా
సాక్షి, హైదరాబాద్: అగర్బత్తీల తయారీ కంపెనీ ఏర్పాటు చేద్దామంటూ నమ్మించి మంగళ్‌హాట్‌కు చెందిన ఒక మహిళను ఓ గ్యాంగ్ రూ. 85 లక్షలు మోసం చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళ్‌హాట్‌కు చెందిన బిరదర్ ఉమా కు, తన మేనల్లుడు రాజ్‌కుమార్ ద్వారా శ్రీకాంత్, భీమా, శశిధర్ అనే వ్యక్తులు పరిచయం అయ్యారు. అగర్బత్తీల కంపెనీ ఏర్పాటు చేద్దామని దానికి సంబంధించిన లైసెన్స్‌లు, యాంత్రాలు తెప్పిస్తామని నమ్మించారు. మున్నా సింగ్ అనే వ్యక్తిని పరిచయం చేసి అరంఘార్, దూల్పేట్లోని ప్యాక్టరీ పెట్టేందుకు స్థలాన్ని అగ్రిమెంట్ చేసుకోవాలని ఒప్పించారు. ఆ తరువాత సంగమేశ్వర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో లైసెన్స్ తెప్పించారు, దానికి బాధితురాలు అంగీకరించలేదు. తన పేరుతోనే లైసెన్స్ కావాలని స్వయంకృషి ఇండస్ట్రీస్ పేరుతో లైసెన్స్ దరఖాస్తు చేసింది. వీటన్నింటికి లక్షల రూపాయలలో డబ్బులు తీసుకొని రేపు మాపంటూ కాలయాపన చేస్తున్నారు. అలాగే తన మేనల్లుడైన రాజ్‌కుమార్ వద్ద కూడా యంత్రాల కోసం డబ్బు తీసుకున్నారు. ఇలా మొత్తం రూ. 85 లక్షల వరకు తమ వద్ద డబ్బు తీసుకొని మోసం చేశారంటూ బాధితురాలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జయ దశరథ ప్రాజెక్ట్ పేరుతో ఈ ముఠా నకిలీ పత్రాలను సృష్టించి భూములు విక్రయించి..మోసాలకు పాల్పడుతోంది. వివరాలను సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఖాళీగా ఉన్న భూములను గుర్తించి మోసం చేయడంలో ముఠా దిట్ట అని తెలిపారు. గొల్లూరు గ్రామంలో నకిలీ పత్రాలతో 40 ఎకరాల భూమిని ముఠా విక్రయించినట్లు సీపీ తెలిపారు. డబ్బు తీసుకుని అగ్రిమెంట్ చేయకపోవడంతో బాధితుడు ఫిర్యాదు చేశారని.. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు. చదవండి: చిన్నారి అనుమానాస్పద మృతి; నీటిట్యాంకులో మృతదేహం ఏమిటి జోకర్ యాప్స్.. బహుపరాక్ -
సోనూసూద్ పేరుతో సైబర్ నేరగాడి మోసం
సాక్షి, హైదరాబాద్ : పేదలకు చేయూతనిస్తున్న సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. గూగుల్, ట్విట్టర్లో సోనూసూద్ ఫౌండేషన్ అని ఎవరైనా టైప్ చేస్తే ఆ సంస్థ పేరుతో పోలిన కొన్ని సెల్ నంబర్లు వచ్చేలా నిక్షిప్తం చేశారు. సైబరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు పది వేల ఆర్థిక సాయం కోసం ఆ నకిలీ నంబర్‌ను సంప్రదించగా, హిందీ భాషలో మాట్లాడిన బలిరాం అనే వ్యక్తి ఆ సంస్థ అడ్వైజర్‌గా పంకజ్‌సింగ్ బాదురియా పేరుతో గుర్తింపు కార్డ్‌ను బాధితుడికి వాట్సాప్ చేశాడు. బాధితుడికి సాయం చేస్తామని ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకున్నాడు. సోనూసూద్ 50 వేల ఆర్థిక సాయం చేయడానికి ఒప్పుకున్నాడని, అయితే.. రిజిస్ట్రేషన్ కోసం రూ. 8,300 చెల్లించాలని చెప్పడంతో బాధితుడు తన కుమారుడి ఖాతా నుంచి డబ్బు బదిలీ చేశాడు. అనంతరం ఆర్థిక సాయం రూ. 3.60 లక్షలకు పెరిగిందని నమ్మించి దశల వారీగా 60 వేలు బాధితుడి నుంచి వసూలు చేశాడు. మళ్లీ మరో రూ. 7900 చెల్లిస్తే ఆర్థిక సాయం డబ్బు మీ ఖాతాలో డిపాజిట్ అవుతుందని చెప్పాడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు ఈ నెల 3న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ.. సెలబ్రిటీలు, వీఐపీలు, ఎన్జీఓల పేరిట సహాయం చేస్తామని నమ్మించి కొందరు కేటుగాళ్లు భారీ మొత్తంలో డబ్బులు కాజేస్తున్నారని, ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చదవండి: హైదరాబాద్‌లో కృష్ణ జింక వేటగాళ్లు అరెస్ట్ చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడిని దూరం పెట్టడంతో -
ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
సాక్షి, శంషాబాద్: రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నఅంతర్ రాష్ట్ర ముఠాను శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలోని నలుగురు సభ్యుల్లో సర్వేష్ సాహు, అబ్ధుల్ మాజిద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు మిశ్రా, దినేష్‌లు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ఆరు లక్షల నగదు, ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్, ఐడి కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా సంప్రదిస్తే వారిని నమ్మొద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. కాగా, నిందితులు కేంద్ర రైల్వే సర్వీసెస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వందలాది మంది నిరుద్యోగుల నుండి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. బాధితులకు ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నమ్మించిన నిందితులు.. ఫేక్ మెడికల్ టెస్ట్ సైతం నిర్వహించారు. రైల్వే డిపార్ట్మెంట్ నుండి మెయిల్ వచ్చినట్లు ఫేక్ ఐడితో మెయిల్స్ పంపి, ఢిల్లీ, బెంగాల్‌లలో ట్రైనింగ్ క్లాసులంటూ నమ్మించారు. నార్త్ సెంట్రల్ రైల్వే పేరుతో బాధితుల పేరిట ఫేక్ ఐడి కార్డులను సృష్టించారు. ఉద్యోగం కోసం బాధితులు రైల్వే కార్యాలయాన్ని సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. -
యూట్యూబ్ గ్రూపు గుట్టు రట్టు
సాక్షి, అనకాపల్లి: ఓ వ్యక్తి బలవన్మరణంతో మారణాయుధాలు విక్రయించడమేగాక, ఎంచుకున్న పారిశ్రామిక వేత్తలను డబ్బుకోసం బెదిరించే ఓ యూట్యూబ్ గ్రూపు గుట్టు రట్టయ్యింది. విశాఖ జిల్లా అనకాపల్లి పోలీస్ గెస్ట్‌హౌస్‌లో సీఐ లంక భాస్కరరావు మంగళవారం విలేకరులకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి గవరపాలేనికి చెందిన భీశెట్టి లోకనాథం (30) గత నెల 27న తన స్వగృహంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఇంటిని శుభ్రపరుస్తున్న సమయంలో రెండు పిస్టళ్లతోపాటు 18 బుల్లెట్లు ప్రత్యక్షం కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు మృతుడు లోకనాథం సెల్‌ఫోన్ ఆధారంగా కొన్ని ఫోన్ నంబర్లు గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు. తీగ లాగితే.. పట్టణ పోలీసులు లోకనాథం సెల్‌ఫోన్ ఆధారంగా గుర్తించిన ఓ నంబర్‌పై దృష్టి పెట్టి గాజువాక న్యూపోర్టు ప్రాంతానికి చెందిన గంగాధర్ (రాజుబాయ్)ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతను తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలం క్రితం లోకనాథానికి తమ కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చాయి. దీంతో తన మామను అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చాడు. భార్యబిడ్డలకు సైతం దూరంగా ఒంటరిగా జీవిస్తూ మామ హత్యకు పథకాలు వేయడం మొదలెట్టాడు. గతంలో లోకనాథం దేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల్లో సైతం ఉద్యోగాలు చేయడంతో అనేక పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే మారణాయుధాల అక్రమ వ్యాపారం చేస్తూ.. బడా పారిశ్రామిక వేత్తలను బెదిరించి డబ్బు వసూలు చేసే నలుగురు సభ్యులున్న ఆజాద్ మాంగేర్ గ్రూపుతో పరిచయం ఏర్పడింది. గ్రూపు సభ్యుల ఆదేశాల మేరకు ఇటీవలే విదేశీ కంపెనీలకు అవసరయ్యే మెన్ పవర్‌ను పంపించే విశాఖలో ఉండే ఒక ప్రైవేటు కంపెనీని రూ.5 లక్షలు ఇవ్వాలని లోకనాథం డిమాండ్ చేశాడు. అంతేకాకుండా పాత ఇనుప సామాన్ల దుకాణం యాజమాన్యాన్ని రూ.6 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. అయితే..ఇటీవల లోకనాథం అనారోగ్యానికి గురికావడం, భార్య, కుమార్తెలు దూరంగా ఉండడంతో తీవ్ర మానసిక సంఘర్షణకు గురై ఉరేసుకుని బలవన్మరణానికి తెగబడ్డాడు. ఇదే సమయంలో లోకనాథం గ్రూపులోకి రాకపోవడంతో గ్రూపు సభ్యులైన హరియాణా రాష్ట్రం మోహిత్ ఎరియాన్‌కు చెందిన బంటీజూట్, ఉత్తరాఖండ్ దినేష్‌పూర్‌కు చెందిన సామ్రాట్ దాలి, ఢిల్లీకి చెందిన అభిషేక్ భరద్వాజ్ లోకనాథం విషయమై గంగాధర్ (రాజుబాయ్)ను సంప్రదించారు. అప్పటికే నిఘా పెట్టిన పోలీసులు గంగాధర్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఒక పిస్టల్, 4 బుల్లెట్లు, 6 సెల్ఫోన్లు స్వాదీన పరుచుకోవడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచి్చన సామ్రాట్ దాలి, బంటీజాట్, అభిషేక్ భరద్వాజ్‌ను అరెస్టు చేసి మంగళవారం స్థానిక కోర్టులో హాజరు పరిచారు. వీరికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. -
ఇత్తడి పాత్రకు అద్భుత శక్తి ఉందంటూ..
సాక్షి, రాజేంద్రనగర్: ఇత్తడి పాత్రకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని.. ఇంట్లో ఉంచి పూజ చేస్తే కోటీశ్వరులు అవుతారని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని అమాయకులను నమ్మించి అంటగట్టేందుకు యత్నించిన ఓ రైస్ పుల్లింగ్ ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈమేరకు 14 మంది నిందితులను అరెస్టు చేసి రూ. 1.30 లక్షల నగదు, 16 సెల్ఫోన్లు, హోండా యాక్టివా వాహనంతో పాటు ఇత్తడి పాత్రను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓటీ సీఐ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. ఇత్తడి పాత్రకు అద్భుత శక్తులు ఉన్నాయని దానిని రూ. 15 లక్షలకు విక్రయిస్తామంటూ ఒక ముఠా రాజేంద్రన గర్‌లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రాజేంద్రనగర్ పోలీసులతో పాటు ఎస్ఓటీ సిబ్బంది తాము కొనుగోలు చేస్తున్నట్లు ముఠా సభ్యులతో సంప్రదింపులు జరిపారు. వారం రోజుల పాటు నిందితులతో మాట్లాడి రూ. 15 లక్షలకు కొంటామని నమ్మబలికారు. రాజేంద్రనగర్ కిషన్‌బాగ్ ప్రాంతానికి వచ్చి పాత్రను తీ సుకోవాలని ముఠా సభ్యులు సమాచారం ఇవ్వడంతో రా జేంద్రనగర్ పోలీసులు, ఎస్ఓటీ సిబ్బంది సంయుక్తంగా దాడి చేశాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా లక్కసాగరం గ్రామానికి చెందిన ఏ.శ్రీనివాస్‌గౌడ్, ఎమిగనూ రు గ్రామానికి చెందిన వడ్డె ఇరుకుండ, హన్మకొండ ని వాసి సి.భాస్కర్ , బేలగాల గ్రామానికి చెందిన బి.రాములు, నందవరం మండలాని చెందిన బి.జయ రాముడు, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నివాసి ప్రవీణ్‌కుమార్, కుత్బుల్లాపూర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ బిలాల్, మహ్మద్ ఆలీమ్పాషా, రాజేంద్రనగర్ సిక్చౌనీ నివాసి కుల్దీప్సింగ్, ఆసిఫ్‌నగర్‌కు చెందిన సి.రాకేష్, బహదూర్‌పురాకు చెందిన నాగరాజు, దోమలగూడకు నివాసి సంతోష్‌కుమార్, నాంపల్లివాసి మహ్మద్ అబ్దుల్ హసన్, అత్తాపూర్‌కు చెందిన సర్ధార్ డీదర్సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. వీరు పద్నాలుగు మంది ఒక ముఠాగా ఏర్పడి అమాయకులను నమ్మించి ఇత్తడిపాత్రను విక్రయించేందుకు ప్రయత్నించారు. ఇత్తడి పాత్రకు ఎలాంటి శక్తులు లేవని, అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు వసూలు చేసుకొని పారిపోతారని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. ఈమేరకు కేసు నమోదు చేసి నిందితులను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. పోలీసులకు పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసుకున్న ఇత్తడి పాత్ర రెట్టింపు డబ్బులు ఇస్తామని టోకరా పోలీసులకు ఫిర్యాదు యాలాల: ఐదేళ్ల తర్వాత రెట్టింపు డబ్బులు ఇస్తామని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా కోస్గి మండలం తోగాపూర్కు చెందిన మ్యాతరి వెంకటేష్ ఎస్ఆర్జీసీ అనే సంస్థలో డబ్బులు పొదుపు చేస్తే ఐదేళ్ల తర్వాత రెట్టింపు ఇస్తామని అప్పట్లో యాలాల మండలంలోని రాస్నం గ్రామంలోని పలువురిని నమ్మించాడు. దీంతో గ్రామానికి చెందిన గాజుల ఖైరూన్ బేగం, అబ్దుల్ కరీం, షేక్ ఖైసర్ బాను, గురదోట్ల విజయ్, గాజుల మ హ్మద్ ముస్తఫా తదితరులు రూ.25,300 చొప్పున చెల్లించారు. తీ రా గడువు పూర్తయిన తరువాత డబ్బులు ఇవ్వాలని మ్యా తరి వెంకటేష్‌ను కోరగా రేపు, మాపు అంటూ తప్పించు కొని తిరుగుతున్నాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితు లు తమకు ఇచ్చిన బాండ్లపై ఉన్న చిరునా మాలో ఆరా తీ యగా ఎలాంటి సంస్థ లేదని గుర్తించారు. దీంతో ఆది వారం యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మ్యా తరి వెంకటేష్ నారాయణపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.2 కోట్ల మేర బాధితుల నుంచి సేకరించి మోసం చేసినట్లు ఆరోపిస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయాన్ మృతదేహం లభ్యం గగన్‌పహాడ్ చౌరస్తా సమీపంలో రాళ్లలో గుర్తింపు శంషాబాద్: వరదలో కొట్టుకుపోయిన మరో మృతదేహం ఆదివారం లభ్యమైంది. వరద నీటిలో కొట్టుకుపోయి మృతిచెందిన ఖరీమాబేగం కుమారుడు ఆయాన్(7) మృతదేహం నాలుగురోజులుగా లభ్యం కాలేదు. గగన్‌పహాడ్ చౌరస్తా సమీపంలోని సెలబ్రేషన్ కన్వెన్షన్ దగ్గర రాళ్లలో చిక్కుకుపోయిన మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వరదలో కొట్టుకుపోయిన ఆయాన్‌గా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రేమ, ఉద్యోగాల పేరుతో.. రూ.లక్షల్లో వసూలు
సాక్షి, బెల్లపల్లి: నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని, ఉద్యోగాల ఆశ చూపి, ఓ ముఠా రూ.లక్షల్లో వసూలు చేసింది. అనంతరం బాధితులను మోసగించిన ఘటనలో ఓ మహిళతోపాటు మరో ముగ్గురు వ్యక్తులను కరీంనగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ ఉద్యోగం లేక ఖాళీగా ఉండేది. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో విడిపోయి, కరీంనగర్‌లోని ఆదర్శ నగర్లో ఒంటరిగా జీవిస్తోంది. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో అమాయక యువకులను లక్ష్యంగా చేసుకొని, ప్రేమ, ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెబుతూ వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసింది. ఆమె తన ముఠా సభ్యులైన కంబాల రాజేశ్(41), కుసుమ భాస్కర్(48), భీమాశంకర్(28)లతో కలిసి కరీంనగర్‌లోని సిక్‌వాడీకి చెందిన ఓ యువకుడిని వరంగల్‌లోని ప్రభుత్వ ఆస్పుత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించింది. క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్టు పేరుతో రూ.13.5 లక్షలు, కరీంనగర్‌లోని తిరుమల నగర్లో నివాసం ఉంటున్న మరో వ్యక్తి నుంచి ప్రభుత్వ ఊద్యోగం పేరుతో రూ.7 లక్షలు, గోదావరిఖనికి చెందిన ఓ యువకుడి వద్ద రూ.3లక్షలు వసూలు చేశారు. నిందితురాలు వరంగల్‌కు చెందిన యువకుడితో తనను నికితారెడ్డిగా పరిచయం చేసుకొని, అతనితో చేసిన ఫోన్ చాటింగ్ చేసింది. దాన్ని అడ్డుగా పెట్టుకొని బాధితుడిని బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.8లక్షల వరకు తీసుకుంది. సదరు మహిళ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని, అధికారుల వద్ద పలుకుబడి ఉందని నిరుద్యోగులతో నమ్మబలికింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని, రిజిస్ట్రేషన్ నిమిత్తం, అధికారులకు ఇవ్వడానికి డబ్బులు ఖర్చవుతాయని నమ్మించింది. తన మూఠా సభ్యులను అధికారులుగా చూపించి, వసూళ్లకు తెరలేపింది. బాధితులు తాము మోసపోయామని గ్రహించి, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే రాజేష్, భాస్కర్, భీమాశంకర్‌లను పెద్ద మనుషులుగా చూపించింది. తన మొబైల్లో చాటింగ్‌ను చూపిస్తూ వారిపైనే కేసులు పెడుతూ బెదిరింపులకు గురిచేసింది. ఈ ఘటనలతో నిఘా పెట్టిన పోలీసులు నిందితులందరినీ పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.20 వేలు, నకిలీ నియామక పత్రాలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కరీంనగర్, గోదావరిఖని, వరంగల్, హైద్రాబాద్ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరీంనగర్ సీపీ వీబీ.కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇప్పిస్తామని వచ్చేవారి మాయమాటలు నమ్మి, డబ్బు, సమయం కోల్పోవద్దన్నారు. ఈ ముఠా వల్ల మోసపోయిన వారు ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అధికారులను సంప్రదించాలని సూచించారు. సీఐ విజయ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ప్రకాష్, శశిధర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
30 వేలు పెట్టుబడి, ప్రతి నెల రూ.10వేలు
ఫుడ్ ఐటమ్స్ పేరుతో దుకాణం తెరిచారు. దాని చాటున మనీ సర్క్యులేషన్‌కు తెరతీశారు. రూ. 30వేలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ. 10 వేలచొప్పున పది నెలలపాటు తిరిగి ఇస్తామంటూ స్కీం ప్రారంభించారు. కొందరికి డబ్బులు తిరిగి ఇవ్వడంతో జనం ఎగబడి సభ్యులుగా చేరారు. ఆ తర్వాత సంస్థ చేతులెత్తేయడంతో వేలాది మంది రోడ్డున పడ్డారు. సాక్షి, కామారెడ్డి: సులువుగా డబ్బులు వస్తున్నాయంటే చాలు ముందూవెనకా ఆలోచించకుండా చాలామంది ఎగబడుతుంటారు. వీరి బలహీనతను ఆసరా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. అంతా అయిపోయాక గానీ తాము మోసపోయామని గుర్తించలేకపోతున్నారు. జిల్లాలో ఓ సంస్థ భారీ స్థాయిలో మోసానికి పాల్పడింది. ఒక్కసారి రూ. 30 వేలు కడితే పది నెలల్లో రూ. లక్షలు తిరిగిస్తామని నమ్మించింది. కొందరికి డబ్బులు ఇవ్వడంతో కరోనా వైరస్ లాగే ఈ ‘చైన్’ పది జిల్లాలకు విస్తరించింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత ఈ స్కీంకు ఆటంకాలు మొదలయ్యాయి. కొత్తగా డబ్బులు రావడం ఆగిపోవడం, డబ్బులు కట్టిన వారు కార్యాలయాల చుట్టూ తిరగడంతో వివాదం మొదలైంది. చివరకు ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు సంస్థ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రికార్డులన్నింటినీ సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న 37 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అయితే రెండేళ్ల కాలంలో ఈ సంస్థ రూ. 250 కోట్ల మేర సమీకరించినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఫుడ్ ఐటమ్స్ పేరుతో దందా.. 2018 జనవరిలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్నేహపురి కాలనీలో ‘కీ నెక్ట్స్ ఇండియా రియల్ ఎస్టేట్స్, ఫుడ్స్ అండ్ యాడ్స్, బీర్షేబా ఫుడ్స్’ పేరుతో కార్యాలయాన్ని తెరిచారు. పిండి, రవ్వ తదితర ఫుడ్ ఐటమ్లకు సంబంధించిన వ్యాపారం అంటూ సంస్థను మొదలుపెట్టారు. దాని మాటున మనీ సర్కులేషన్ స్కీమ్‌కు తెరలేపారు. ఒకేసారి రూ.30 వేలు చెల్లిస్తే నెలకు రూ.10 వేల చొప్పున పది నెలల పాటు తిరిగి ఇస్తామని నమ్మించారు. అత్యాశకు పోయిన పలువురు సభ్యులుగా చేరారు. చెప్పిన ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీన రూ. 10 వేల చొప్పున సంస్థ నిర్వాహకులు తిరిగిచ్చారు. ఇలా కొన్ని నెలలు సాగింది. దీంతో స్కీం వైపు చాలామంది ఆకర్షితులయ్యారు. ప్రధానంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో స్కీంలో చేరారు. తమ బంధుమిత్రులందరినీ చేర్పించారు. మంచి కమీషన్ ఇవ్వడంతో పలువురు ఏజెంట్లు పోటీ పడి సభ్యులను చేర్పించారు. నెలనెలా డబ్బులు వస్తుండడంతో జనంలో నమ్మకం పెరిగిపోయింది. మొదట్లో తాము కట్టిన రూ.30 వేలతో ఆగకుండా రూ.10 లక్షల దాకా పెట్టుబడులు పెట్టిన వారున్నారు. రోజు కూలీ నుంచి మొదలుకుంటే ఉద్యోగులు, వ్యాపారుల దాకా చాలా మంది బీర్షేబా సంస్థలో సభ్యులుగా చేరి డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. కరోనాతో చైన్‌కు బ్రేక్.. కరోనాను ఎదుర్కొనేందుకు లాక్డౌన్ విధించడంతో ఈ చైన్‌కు బ్రేక్ పడింది. కొత్త సభ్యులు చేరకపోవడానికితోడు పాతవారు డబ్బుల కోసం తిరగడం మొదలుపెట్టారు. నిర్వాహకులు పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసి పెట్టడం, కొత్త సభ్యులు రాకపోవడంతో డబ్బుల రొటేషన్‌కు ఇబ్బంది ఏర్పడింది. సభ్యులు డబ్బుల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతుండడంతో నిర్వాహకుడు కుటుంబ సభ్యులతో సహా కనిపించకుండాపోయాడు. కార్యాలయానికి తాళం పడడంతో డబ్బులు కట్టిన వారంతా ఆందోళనకు గురయ్యారు. ఏజెంట్ల దగ్గరికి వెళ్లి నిలదీశారు. వారూ చేతులెత్తేయడంతో కొందరు సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పది జిల్లాలు... 27 వేల మంది సభ్యులు మనీ సర్కులేషన్ స్కీంలో దాదాపు పది జిల్లాలకు చెందిన 27 వేల మంది సభ్యులుగా చేరినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్ తదితర జిల్లాలకు చెందిన వారు సభ్యులుగా చేరినట్టు తెలుస్తోంది. అత్యధికంగా కామారెడ్డి, సిరిçసిల్ల జిల్లాల వారే ఉన్నారు. కూతురి పెళ్లి కోసం జమ చేసిన డబ్బులు, ఇంటి నిర్మాణం కోసం పొదుపు చేసిన సొమ్ము.. ఇలా ఎంతో మంది దాచుకున్న డబ్బులన్నింటినీ బీర్షేబాలో కట్టి మోసపోయారు. తక్కువలో తక్కువ ఒక్కో సభ్యుడు రూ. 30 వేలు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. కొందరు గరిష్టంగా రూ. 10 లక్షలవరకు పెట్టుబడి పెట్టారు. చాలా మంది బంగారం అమ్ముకుని, భూములు కుదువ పెట్టి మరీ స్కీంలో డబ్బులు కట్టారు. కూలినాలి చేసుకుని బతికే వారు సైతం అప్పులు తెచ్చి సంస్థలో సభ్యులుగా చేరారు. స్కీం నిర్వాహకుడు డబ్బులను దారిమళ్లించి అరెస్టై జైలులో ఉండగా, నమ్మి మోసపోయిన వారంతా రోడ్డున పడ్డారు. డబ్బులు తిరిగి వస్తాయన్న నమ్మకం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 37 మంది అరెస్టు.. బీర్షేబాలో డబ్బులు పెట్టి మోసపోయిన బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులకు ఫిర్యాదులు చేయసాగారు. దీంతో పోలీసులు బీర్షేబా కార్యాలయాన్ని సోదా చేసి రికార్డులను సీజ్ చేశారు. ఇప్పటి వరకు సంస్థ నిర్వాహకుడితో పాటు 37 మందిని అరెస్టు చేసి రిమాండుకు పంపినట్టు కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ ‘సాక్షి’తో తెలిపారు. ప్రధాన నిందితుడు జూలై 2న అరెస్టూ జైల్లో ఉన్నాడన్నారు. మిగతా వారిని దొరికినవారిని దొరికినట్టుగా అరెస్టు చేస్తున్నామన్నారు. మరో 15 మందిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. సంస్థకు సంబంధించిన స్థిర, చరాస్తుల వివరాలను సేకరించి వాటిని సీజ్ చేశామని వివరించారు. -
ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని టోకరా
సాక్షి, పెబ్బేరు (కొత్తకోట): ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను నమ్మించి రూ. కోట్లు వసూలు చేసిన చిన్నంబావి మండలం అమ్మాయిపల్లికి చెందిన మండ్ల వసంత, వీపనగండ్ల మండలం కల్వరాలకు చెందిన చింతమోని శాంతయ్య, వీపనగండ్లకు చెందిన డ్రైవర్ అశోక్‌రెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్, కొత్తకోట సీఐ మల్లికార్డున్‌రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. తాను రైల్వేశాఖలో టీసీ (టికెట్ కలెక్టర్)గా ఉద్యోగం చేస్తున్నానని..రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు పడ్డాయని, చాలామంది తెలుసు, ఉద్యోగాలు ఇప్పిస్తామనని చెప్పి వసంత చాలామంది యువత నుంచి డబ్బులు వసూలు చేసేది. 2014లో ఆమెకు శాంతయ్య పరిచయం అయ్యాడు. పోలీస్‌శాఖలో తనకు ఉన్నతాధికారులు బాగా తెలుసని ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.12 లక్షలు వసూలు చేసింది. నకిలీ అర్డర్ కాపీ అందజేసి.. కొన్నిరోజులు గడిచాక తన ఉద్యోగం ఏమైందని అడుగగా ఎస్ఐ ఉద్యోగం కాదు నీకు సీఐగా పదోన్నతి వచ్చిందని చెప్పి నకిలీ ఆర్డర్ కాపీని అందజేసి పోలీస్ యూనిఫాం కూడా ఇచ్చింది. అప్పటికే అతడు బంధువులు మరికొందరికి ఉద్యోగాలు కావాలని వారి వద్ద డబ్బులు వసూలు చేసి తెచ్చి ఇచ్చాడు. అనంతరం ఆమె చెబుతున్న మాటలు నమ్మక.. తాను మోసపోయానని గుర్తించి ఆమెతో కలిసి మోసాలు చేయడం ప్రారంభించాడు. వీరు తరచూ వీపనగండ్ల అశోక్‌రెడ్డి కారు తీసుకొని హైదరాబాద్, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లేవారు. రోజూ వీరు మాట్లాడుతున్న మాటలు గమనించి అతను కూడా కలిసిపోయాడు. అందరూ కలిసి పరిసర మండలాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల వారిని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తూ వచ్చారు. రైల్వేలో టికెట్ కలెక్టర్, వివిధ రకాల ఉద్యోగాలు ఇప్పిస్తామని బత్తుల రాజేశ్ నుంచి రూ.6 లక్షలు, చటమోని అనిల్ దగ్గర రూ.4 లక్షలు, మిద్దె శ్రీనివాసులు నుంచి రూ.2 లక్షలు, కొల్లాపూర్‌కు చెందిన సుధాకర్ దగ్గర రూ.2.50 లక్షలు వసూలు చేశారు. అలాగే గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుట్టాన్దొడ్డికి చెందిన బొమ్మిరెడ్డి విమలకు పోలీస్‌శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని రూ.5 లక్షలు బ్యారం కుదుర్చుకొని మొదటగా రూ.3 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. మిగతా వారుంటే చెప్పండి చూద్దామని నమ్మించటంతో వారి బంధువులతో నుంచి రూ.40 లక్షలు వసూలు చేసి ఇచ్చింది. పెబ్బేరులో విజయకుమారితో పాటు వారి బంధువుల నుంచి రూ.40 లక్షలు వసూలు చేశారు. పోలీస్ యూనిఫాంతో.. ఉద్యోగం ఏమైంది ఇంకా ఎన్నిరోజులు అన్ని అడిగితే శాంతయ్య పోలీస్ యూనిఫాంతో కారులో వారి ఇంటి వద్దకు వెళ్లి వసంత మేడం ఇప్పించిన ఎస్ఐ ఉద్యోగమే ఇప్పుడు నాకు సీఐగా ప్రమోషన్ వచ్చిందని చెప్పడం ప్రారంభించారు. ఇలా మొత్తం రూ.1.62 కోట్లు వసూలు చేశారు. మరికొందరికి ఉద్యోగాల పేరిట నకిలీ ఆర్డర్ కాపీలు అందించి రెండునెలల పాటు వారి అకౌంట్లలో నెలకు రూ.14 వేల చొప్పున వేతనాన్ని కూడా వేశారు. వేతనం సరే ఉద్యోగాలు ఏమయ్యాయని అని అడుగగా వారు రోజురోజు పొంతన లేని సమాధానాలు చెప్పటంతో కొందరు బాధితులు వీపనగండ్ల, పెబ్బేరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వసంత, శాంతయ్య, అశోక్‌రెడ్డిని అదుపులోకి తీసుకొన్ని వివరాలు సేకరించారు. ఇప్పటి వరకు 28 మంది బాధితులు ముందుకొచ్చారు. ఇందులో రూ.6 లక్షల నగదు, 6 తులాల బంగారం, ఒక ల్యాప్‌టాప్, ఒక కారు స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తు చేపట్టిన పెబ్బేరు ఎస్ఐ రాఘవేందర్‌రెడ్డి, ఏఎస్ఐ జయన్న, కానిస్టేబుళ్లు స్వామి, భీమయ్యను డీఎస్పీ అభినందించారు. -
అమ్మకు సీరియస్‌గా ఉంది.. డబ్బులు కట్టాలి
పంజగుట్ట: ‘‘మా అమ్మకు సీరియస్‌గా ఉంది ... అర్జెంటుగా ఆసుపత్రిలో డబ్బులు కట్టాలి ... నా కార్డులు పనిచేయడంలేదు.. కొద్దిగా డబ్బులు ఉంటే సర్దండి. వెంటనే ఆన్లైన్లో పేమెంట్ చేస్తా’’ అని నమ్మబలికి 13 కార్పొరేట్ ఆసుపత్రుల వద్ద పలువురి నుంచి సుమారు రెండు లక్షల వరకూ వసూలు చేసి పారిపోయిన నిందితుడ్ని పంజగుట్ట క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పశ్బిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ తిరుపతన్న, ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, క్రైమ్ ఇన్స్పెక్టర్ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం... హనుమకొండ, వికాస్ నగర్‌కు చెందిన కాసిడి రాజ రోహిత్ రెడ్డి అలియాస్ రోహిత్ అలియాస్ చిన్ను(27) నిరుద్యోగి. త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మోసాలు చేస్తున్నాడు. నగరంలోని పలు కార్పొరేట్ ఆసుపత్రులను ఎంచుకుంటాడు. అక్కడ మాటువేసి తన డెబిట్, క్రెడిట్ కార్డులు పని చేయడం లేదని అమాయకులకు చెప్పి నగదు తీసుకుంటాడు. ఆన్లైన్లో పేమెంట్ చేసినట్టు నటించి తన ఫోన్లో ఉన్న ట్రాన్సక్షన్ సక్సెస్ అనే పాత మెసేజ్‌ను చూపించి అక్కడి నుంచి జారుకుంటాడు. ఇలా రూ.1,98,850 వరకు చీటింగ్ చేశాడు. పంజగుట్ట క్రైమ్ పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకొని రూ.30 వేల నగదు, ఓ మొబైల్ ఫోన్ స్వాధీనంచేసుకున్నారు. -
నేరగాళ్ల అడ్డా..!
-
రెండింతలు చేసిస్తా‘మనీ’..
చెన్నై, అన్నానగర్: పోరూర్ సమీపంలో నగదు రెండింతలుగా చేసి ఇస్తామని చెప్పి ఉపాధ్యాయురాలి వద్ద రూ.12 లక్షలు మోసం చేసిన ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై కొలత్తూర్ అన్నపూర్ణా నగర్ 3వ వీధికి చెందిన శివాజీ భార్య శ్రీప్రియ. పాఠశాల ఉపాధ్యాయురాలు. ఈమె మంగళవారం వడపళణి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో తాను టైలర్స్ రోడ్డులో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నానని, తనతో పనిచేసే మరో ఉపాధ్యాయురాలి ద్వారా వడపళణి అళగిరి నగర్ మెయిన్ రోడ్డులో కార్యాలయం నడుపుతూ వచ్చి శివకుమార్, వనిత, ప్రభాకర్ గత ఏడాది తనకు పరిచయమయ్యారని తెలిపింది. ఆ ముగ్గురూ తమ సంస్థలో రూ.50 వేల నగదు పెట్టుబడి పెడితే రోజూ రూ.410 చొప్పున 200 రోజులుకి నగదు బ్యాంక్‌లో జమచేస్తామని చెప్పారని తెలిపింది. దీన్ని నమ్మి గత ఏడాది మే 7వ తేదీ రూ.2 లక్షల నగదు, ఆన్లైన్ ద్వారా మరో రూ.10 లక్షలు ఇచ్చానని, మొదటి నెల వారు చెప్పిన ప్రకారం రూ.1 లక్ష 25 వేలు తన బ్యాంక్ ఖాతాలో జమ అయ్యిందని తెలిపింది. ఆ తరువాత నగదు ఏమీ రాలేదని, దీనిపై శివకుమార్‌కి కాల్ చేస్తే అది పనిచేయలేదని పేర్కొంది. కార్యాలయం కూడా మూసివేసి ఉందని తెలిపింది. తనకు రావాల్సిన రూ. 12 లక్షల నగదుని మోసం చేసి శివకుమార్, వనిత, ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వీసాల మోసగాళ్ల అరెస్టు
వరంగల్ క్రైం: విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేలా వీసాలు ఇప్పిస్తామని మోసం చేసి రూ.3 కోట్ల వరకు వసూలు చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రమైన హన్మకొండ సుబేదారి పోలీసు స్టేషన్లో గురువారం ఏసీపీ జితేందర్‌రెడ్డి ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన పడిగల సుమంత్, వరంగల్ ఎల్బీ నగర్‌కు చెందిన కల్వల రాహుల్ విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు అవసరమైన వీసాలను ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేశారు. హన్మకొండ నక్కలగుట్టలో 2017లో ఫైర్ సేఫ్టీ శిక్షణ సంస్థను ఏర్పాటు చేసిన మీర్‌హౌసీర్ హుస్సేన్.. పలువురు అభ్యర్థులను సుమంత్‌కు పరిచయం చేశాడు. వారి నుంచి వీసా కోసం రూ.8 లక్షల చొప్పున తీసుకున్నారు. సుమంత్ తన కుటుంబ సభ్యులు శృతి, హేమ, సుగుణ అకౌంట్లలోకి డబ్బు వేయించుకున్నాడు. నకిలీ అగ్రిమెంట్లపై సంతకాలు చేయించగా.. ఎంత కూ వీసాలు రాకపోవడంతో మహబూబ్‌నగర్, జగిత్యాల, వేములవాడ, హైదరాబాద్ సైబర్ క్రైం, చెన్నారావుపేట, సుబేదారి, మట్టెవాడ, హన్మకొండ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ఏడుగురు సభ్యులకు గాను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. -
డూప్లి కేట్‌గాళ్లు!
నెల్లూరు (క్రైమ్): ఏటీఎం కేంద్రాల వద్ద రెక్కీ వేస్తారు. వృద్ధులు, నిరక్షరాస్యులే వారి లక్ష్యం. ఏటీఎంల్లో నగదు విత్‌డ్రా చేయడంలో వారికి సాయం చేస్తున్నట్లు నటిస్తూ స్కిమ్మింగ్ మెషిన్ ద్వారా వారి ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తున్నారు. వీటి ద్వారా నకిలీ ఏటీఎం కార్డులను తయారు చేసి ఖాతాల్లోని నగదు దోచేస్తున్నారు. జిల్లాలో గతేడాది కలిగిరిలో ఈ తరహా నేరానికి పాల్పడ్డారు. ఇటీవలి కాలంలో ఈ తరహా నేరాలు అధికం కావడంతో పోలీసులు నిఘా పెంచారు. ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తీగ లాగితే డొంక కదిలిందన్న చందాన 14 రాష్ట్రాల్లో వారి నేరాలు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం నెల్లూరు నగరంలోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వివరాలను వెల్లడించారు. హరియాణా రాష్ట్రం భివానీ జిల్లా భవానీకేడ తాలూకా బార్సీ గ్రామానికి చెందిన సందీప్‌కుమార్, మంజీత్ సోదరులు. సందీప్‌కుమార్ ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంపై మంచి పట్టు ఉంది. తమ సమీప బంధువు జగ్జీత్తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. నేరాలు ఇలా చేస్తారు.. ఏటీఎం కేంద్రాల వద్ద ఉంటారు. స్కిమ్మింగ్ మెషిన్‌ను బ్లూటూత్ సహాయంతో ఫోన్‌కు అనుసంధానం చేస్తారు. ఎవరైనా నగదు డ్రా చేయమని సాయం కోరితే నగదు డ్రా చేస్తున్నట్లు నటించి వారి ఏటీఎం కార్డునుస్కిమ్మర్ సాయంతో స్వైప్ చేసి కార్డు డేటాను తస్కరిస్తారు. వారి పిన్ వివరాలను గమనించి వాటిని బుక్‌లో నోట్ చేసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి జారుకుని ఫోన్లోని వివరాలను రైటర్ డివైజ్ ద్వారా నకిలీ ఏటీఎం కార్డులోకి మార్చుకుంటారు. వాటిని వినియోగించి ఖాతాలోని నగదును కాజేస్తారు. అందిన కాడికి దోచుకెళ్తున్నారు.. ఎవరూ ఊహించని రీతిలో నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠా లక్ష్యం వృద్ధులు, నిరక్షరాస్యులు, దినసరి కూలీలు. వారైతే కేసులు వరకు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నది వారి అభిప్రాయం. వారి ఖాతాల్లో నుంచి రూ.5 వేలు, రూ.10 వేలు ఇలా దొరికిన కాడికి దోచుకెళతారు. 14 రాష్ట్రాల్లో వెయ్యికిపైగా నేరాలు నిందితులు 14 రాష్ట్రాల్లో వెయ్యికి పైగా నేరాలకు పాల్పడ్డారు. హరియాణా నుంచి వారు రోడ్డు మార్గాన ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో నిర్దేశిత ప్రాంతాలకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు సమీపంలో డ్రైవర్ రహిత కార్లను అద్దెకు తీసుకుని నేరాలు చేసేందుకు బయలుదేరుతారు. వారు అనుకున్న లక్ష్యాలకు చేరుకోగానే కారును ఎయిర్‌పోర్టులో అప్పగించి తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లిపోతారు. ఒక్కో ట్రిప్పులో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు దోచేసి అందులో రూ.లక్షకు పైగా తమ రవాణా, వ్యక్తిగత అవసరాలకు వెచ్చిస్తారు. మిగిలిన సొమ్మును సమానంగా పంచుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో, హైదరాబాద్‌లో రెండు నేరాలకు పాల్పడ్డారు. రూ.25 వేల సొత్తున దోచుకెళ్లారు. నెల్లూరు జిల్లాల్లో 16 కేసుల్లో రూ.3.17 లక్షలు, శ్రీకాకుళంలో ఎనిమిది కేసుల్లో రూ.95 వేలు, విశాఖపట్నంలో 8 కేసుల్లో రూ.లక్ష, అనంతపురం జిల్లాలో ఏడు కేసుల్లో రూ.80 వేలు, గుంటూరు జిల్లాలో మూడు కేసుల్లో రూ.17 వేలు, కర్నూలు జిల్లాలో నాలుగు కేసుల్లో రూ.60 వేలు, ప్రకాశం జిల్లాలో రెండు కేసులో రూ.10 వేలు దోచుకెళ్లారు. విచారణ వేగవంతం ఈ తరహా నేరాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి లోతుగా దర్యాప్తు చేపట్టారు. సూళ్లూరుపేట, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, కర్ణాటక, హరియాణా రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఇటీవల వైజాగ్‌లో ఉన్నారని సమాచారం రావడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కానీ అప్పటికే వారు అక్కడి నుంచి జారుకున్నారు. అయినప్పటికీ వారి కోసం గాలిస్తుండగా శుక్రవారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ పడమర వైపునున్న ఏటీఎం కేంద్రం వద్ద నిందితులు ఉండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు, కారు, స్కిమ్మింగ్ మెషిన్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందికి రివార్డులు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రతిభ కనపరిచిన ఇన్స్పెక్టర్లు ఐ.శ్రీనివాసన్, పి.అక్కేశ్వరరావు, ఎం.నాగేశ్వరమ్మ, పి.బాజీజాన్‌సైదా, ఎస్సైలు జేపీ శ్రీనివాసులురెడ్డి, బాబీ, శేఖర్‌బాబు, విజయకుమార్, బలరామయ్య, ఏఎస్సైలు వెంకటేశ్వర్లు, బుజ్జయ్య, హెడ్‌కానిస్టేబుల్స్ వారీస్, టి.సుబ్రహ్మణ్యం, సీహెచ్ సుబ్రహ్మణ్యం, కానిస్టేబుల్స్ మహేంద్రనాథ్‌రెడ్డి, వినోద్, రమేష్‌కృష్ణ, దుర్గారావు, గౌస్‌బాషా, నరేష్, శివనారాయణ తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. బయటపడిందిలా.. ఏడాది క్రితం జిల్లాలో తొలి సారిగా ఈ ముఠా కలిగిరిలో ఈ తరహా నేరానికి పాల్పడింది. ఇటీవల ఢిల్లీ నుంచి చెన్నైకు చేరుకున్న నిందితులు అద్దె కారు తీసుకున్నారు. నెల్లూరు బొల్లినేని హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఏటీఎంలో భారతమ్మ అనే మహిళకు సాయం చేస్తున్నట్లు నటించి కార్డు వివరాలను సేకరించారు. వాటిని వినియోగించి వింజమూరులోని ఓ ఏటీఎంలో నగదు డ్రా చేశారు. ఆమె దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అక్కడి ఏటీఎం కార్డులోని సీసీ టీవీ ఫుటేజ్ వివరాలను సేకరించారు. వింజమూరులోని పోలీసులు ఏటీఎం కేంద్రంలోని సీసీ టీవీ ఫుటేజ్ వివరాలను సేకరించారు. రెండింటిని పరిశీలించగా నేరం చేసిన వారు ఒక్కరేనని నిర్ధారణ కావడంతో వారి కోసం నిఘా ఉంచి పట్టుకున్నారు. దీంతో 14 రాష్ట్రాల్లో జరిగిన నేరాల పుట్ట కదిలింది. -
మాయ!
‘హలో..సార్ మేము కర్ణాటకలోని బల్లారి నుంచి మాట్లాడుతున్నం..మా ఊరి దగ్గర పల్లెటూరిలో పాత ఇల్లు తవ్వకాల్లో ఐదు కిలోల బంగారం దొరికింది..ఇక్కడ అమ్మితే అనుమానం వస్తది..మీకు తక్కువ ధరకే ఇస్తాం..కావాలంటే వచ్చి శాంపిల్ చూసుకోండి..ఆ తరువాతే డబ్బులు తీసుకుని వచ్చి బంగారం తీసుకెళ్లండి’..ఇలా వరుస కాల్స్‌తో బంగారు మాయలో పడేసి నగదు కాజేసే మోసగాళ్ల ముఠా జిల్లాపై కన్నేసింది. ఒకరు ఇద్దరు కాదు..పదుల సంఖ్యలో వ్యక్తులకు ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. బంగారం తక్కువ ధరకు దొరుకుతుందని అత్యాశకు పోతే మిగిలేది..ఇత్తడి మాత్రమే. – కోరుట్ల జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వెంకటేశ్వర్రావుకు రెండు నెలల క్రితం ఓ వ్యక్తి కర్ణాటకలోని బల్లారి నుంచి మాట్లాడుతున్నామని బంగారం పేరిట మభ్యపెట్టారు. ఫోన్‌కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి బంగారం తక్కువ ధరకు వస్తోందని నమ్మి కర్ణాటకలోని బల్లారికి వెళ్లి రూ.10 లక్షలు గుర్తుతెలియని అగంతకులకు ఇచ్చి బంగారం బిల్లలు తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చిన తరువాత చూసుకుంటే ఆ బిల్లలు ఇత్తడివి అని తేలింది. లబోదిబోమంటూ పోలీసులకు íఫిర్యాదు చేయగా నెల క్రితం పోలీసులు జగిత్యాలలో కర్ణాటకకు చెందిన రవిచంద్ర, శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు. అయినా బంగారం పేరిట మోసాలు ఆగలేదు. ఆరు నెలల క్రితం కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్టకు చెందిన తిరుపతి అనే వ్యక్తి ఈ విధంగానే రూ.10 లక్షలు మోసపోయాడు. రెండు నెలల క్రితం కోరుట్ల పట్టణంలోని 20 వార్డుకు చెందిన ఓ వ్యక్తి రూ.12 లక్షలకు మోసపోయినట్లు తెలిసింది. మోసపోయినవారు పోలీసులకు íఫిర్యాదు చేయడానికి పరువు తక్కువ వ్యవహారంగా భావిస్తుండటంతో మోసగాళ్లు ఆడిందే ఆటగా సాగుతోంది. ఆగని ఫోన్‌కాల్స్.. బంగారం పేరిట మాయ చేస్తున్న కర్ణాటక ముఠాలోని ఇద్దరు సభ్యులను పోలీసులు నెల రోజుల క్రితం అరెస్టు చేసినప్పటికీ ఫోన్‌కాల్స్ ఆగలేదు. ఇదే ముఠాలోని ఇతర సభ్యులు కోరుట్ల, జగిత్యాల, మెట్పల్లి పట్టణాల్లోని వ్యాపారులకు ఫోన్లు చేస్తూ బంగారం పేరిట వల వేస్తున్నారు. ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఉంచుతున్న వ్యాపారులు చివరి వరకు తాము మోసపోయామన్న విషయాన్ని గుర్తించి ఆందోళన చెందుతున్నారు. బంగారం పేరిట మోసగించి దొరికిపోయిన నిందితులను పూర్తిస్థాయిలో విచారిస్తే ఇంకా ఈ ముఠా సభ్యులు ఎంత మంది ఉన్నారో తేల్చే అవకాశముంటుంది.ఈ దిశలో పోలీసు శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటే బంగారం పేరిట వల వేసి మోసగిస్తున్న వారి ఆగడాలకు చెక్ పెట్టవచ్చు. సమాచారం ఇవ్వండి : రాజశేఖర్‌రాజు, సీఐ కోరుట్ల కర్ణాటకలో బంగారం దొరికింది..తక్కువ ధరకు ఇస్తామని ఫోన్‌కాల్స్ వస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. ఫోన్‌కాల్స్ ఆధారంగా మోసగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాం. ప్రజలు అత్యాశకు పోకుండా అప్రమత్తంగా ఉండటం అవసరం.