స్కిమ్మింగ్ మెషిన్, రైటర్ డివైజ్
నెల్లూరు (క్రైమ్): ఏటీఎం కేంద్రాల వద్ద రెక్కీ వేస్తారు. వృద్ధులు, నిరక్షరాస్యులే వారి లక్ష్యం. ఏటీఎంల్లో నగదు విత్‌డ్రా చేయడంలో వారికి సాయం చేస్తున్నట్లు నటిస్తూ స్కిమ్మింగ్ మెషిన్ ద్వారా వారి ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తున్నారు. వీటి ద్వారా నకిలీ ఏటీఎం కార్డులను తయారు చేసి ఖాతాల్లోని నగదు దోచేస్తున్నారు. జిల్లాలో గతేడాది కలిగిరిలో ఈ తరహా నేరానికి పాల్పడ్డారు. ఇటీవలి కాలంలో ఈ తరహా నేరాలు అధికం కావడంతో పోలీసులు నిఘా పెంచారు. ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తీగ లాగితే డొంక కదిలిందన్న చందాన 14 రాష్ట్రాల్లో వారి నేరాలు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం నెల్లూరు నగరంలోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వివరాలను వెల్లడించారు. హరియాణా రాష్ట్రం భివానీ జిల్లా భవానీకేడ తాలూకా బార్సీ గ్రామానికి చెందిన సందీప్‌కుమార్, మంజీత్ సోదరులు. సందీప్‌కుమార్ ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంపై మంచి పట్టు ఉంది. తమ సమీప బంధువు జగ్జీత్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
నేరాలు ఇలా చేస్తారు..
ఏటీఎం కేంద్రాల వద్ద ఉంటారు. స్కిమ్మింగ్ మెషిన్‌ను బ్లూటూత్ సహాయంతో ఫోన్‌కు అనుసంధానం చేస్తారు. ఎవరైనా నగదు డ్రా చేయమని సాయం కోరితే నగదు డ్రా చేస్తున్నట్లు నటించి వారి ఏటీఎం కార్డునుస్కిమ్మర్ సాయంతో స్వైప్ చేసి కార్డు డేటాను తస్కరిస్తారు. వారి పిన్ వివరాలను గమనించి వాటిని బుక్‌లో నోట్ చేసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి జారుకుని ఫోన్‌లోని వివరాలను రైటర్ డివైజ్ ద్వారా నకిలీ ఏటీఎం కార్డులోకి మార్చుకుంటారు. వాటిని వినియోగించి ఖాతాలోని నగదును కాజేస్తారు.
అందిన కాడికి దోచుకెళ్తున్నారు..
ఎవరూ ఊహించని రీతిలో నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠా లక్ష్యం వృద్ధులు, నిరక్షరాస్యులు, దినసరి కూలీలు. వారైతే కేసులు వరకు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నది వారి అభిప్రాయం. వారి ఖాతాల్లో నుంచి రూ.5 వేలు, రూ.10 వేలు ఇలా దొరికిన కాడికి దోచుకెళతారు.
14 రాష్ట్రాల్లో వెయ్యికిపైగా నేరాలు
నిందితులు 14 రాష్ట్రాల్లో వెయ్యికి పైగా నేరాలకు పాల్పడ్డారు. హరియాణా నుంచి వారు రోడ్డు మార్గాన ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో నిర్దేశిత ప్రాంతాలకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు సమీపంలో డ్రైవర్ రహిత కార్లను అద్దెకు తీసుకుని నేరాలు చేసేందుకు బయలుదేరుతారు. వారు అనుకున్న లక్ష్యాలకు చేరుకోగానే కారును ఎయిర్‌పోర్టులో అప్పగించి తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లిపోతారు. ఒక్కో ట్రిప్పులో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు దోచేసి అందులో రూ.లక్షకు పైగా తమ రవాణా, వ్యక్తిగత అవసరాలకు వెచ్చిస్తారు. మిగిలిన సొమ్మును సమానంగా పంచుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో, హైదరాబాద్‌లో రెండు నేరాలకు పాల్పడ్డారు. రూ.25 వేల సొత్తున దోచుకెళ్లారు. నెల్లూరు జిల్లాల్లో 16 కేసుల్లో రూ.3.17 లక్షలు, శ్రీకాకుళంలో ఎనిమిది కేసుల్లో రూ.95 వేలు, విశాఖపట్నంలో 8 కేసుల్లో రూ.లక్ష, అనంతపురం జిల్లాలో ఏడు కేసుల్లో రూ.80 వేలు, గుంటూరు జిల్లాలో మూడు కేసుల్లో రూ.17 వేలు, కర్నూలు జిల్లాలో నాలుగు కేసుల్లో రూ.60 వేలు, ప్రకాశం జిల్లాలో రెండు కేసులో రూ.10 వేలు దోచుకెళ్లారు.
విచారణ వేగవంతం
ఈ తరహా నేరాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి లోతుగా దర్యాప్తు చేపట్టారు. సూళ్లూరుపేట, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, కర్ణాటక, హరియాణా రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఇటీవల వైజాగ్‌లో ఉన్నారని సమాచారం రావడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కానీ అప్పటికే వారు అక్కడి నుంచి జారుకున్నారు. అయినప్పటికీ వారి కోసం గాలిస్తుండగా శుక్రవారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ పడమర వైపునున్న ఏటీఎం కేంద్రం వద్ద నిందితులు ఉండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు, కారు, స్కిమ్మింగ్ మెషిన్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
సిబ్బందికి రివార్డులు
నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రతిభ కనపరిచిన ఇన్‌స్పెక్టర్లు ఐ.శ్రీనివాసన్, పి.అక్కేశ్వరరావు, ఎం.నాగేశ్వరమ్మ, పి.బాజీజాన్‌సైదా, ఎస్సైలు జేపీ శ్రీనివాసులురెడ్డి, బాబీ, శేఖర్‌బాబు, విజయకుమార్, బలరామయ్య, ఏఎస్సైలు వెంకటేశ్వర్లు, బుజ్జయ్య, హెడ్‌కానిస్టేబుల్స్ వారీస్, టి.సుబ్రహ్మణ్యం, సీహెచ్ సుబ్రహ్మణ్యం, కానిస్టేబుల్స్ మహేంద్రనాథ్‌రెడ్డి, వినోద్, రమేష్‌కృష్ణ, దుర్గారావు, గౌస్‌బాషా, నరేష్, శివనారాయణ తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.
బయటపడిందిలా..
ఏడాది క్రితం జిల్లాలో తొలి సారిగా ఈ ముఠా కలిగిరిలో ఈ తరహా నేరానికి పాల్పడింది. ఇటీవల ఢిల్లీ నుంచి చెన్నైకు చేరుకున్న నిందితులు అద్దె కారు తీసుకున్నారు. నెల్లూరు బొల్లినేని హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఏటీఎంలో భారతమ్మ అనే మహిళకు సాయం చేస్తున్నట్లు నటించి కార్డు వివరాలను సేకరించారు. వాటిని వినియోగించి వింజమూరులోని ఓ ఏటీఎంలో నగదు డ్రా చేశారు. ఆమె దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అక్కడి ఏటీఎం కార్డులోని సీసీ టీవీ ఫుటేజ్ వివరాలను సేకరించారు. వింజమూరులోని పోలీసులు ఏటీఎం కేంద్రంలోని సీసీ టీవీ ఫుటేజ్ వివరాలను సేకరించారు. రెండింటిని పరిశీలించగా నేరం చేసిన వారు ఒక్కరేనని నిర్ధారణ కావడంతో వారి కోసం నిఘా ఉంచి పట్టుకున్నారు. దీంతో 14 రాష్ట్రాల్లో జరిగిన నేరాల పుట్ట కదిలింది.
Comments
Please login to add a commentAdd a comment