యూట్యూబ్‌ గ్రూపు గుట్టు రట్టు | Youtube Fraud Gang Arrested In Visakhapatnam | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌ గ్రూపు గుట్టు రట్టు

Published Wed, Dec 23 2020 9:17 AM | Last Updated on Wed, Dec 23 2020 10:36 AM

Youtube Fraud Gang Arrested In Visakhapatnam - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న సీఐ లంక భాస్కరరావు

సాక్షి, అనకాపల్లి: ఓ వ్యక్తి బలవన్మరణంతో మారణాయుధాలు విక్రయించడమేగాక, ఎంచుకున్న పారిశ్రామిక వేత్తలను డబ్బుకోసం బెదిరించే ఓ యూట్యూబ్‌ గ్రూపు గుట్టు రట్టయ్యింది. విశాఖ జిల్లా అనకాపల్లి పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లో సీఐ లంక భాస్కరరావు మంగళవారం విలేకరులకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి గవరపాలేనికి చెందిన భీశెట్టి లోకనాథం (30) గత నెల 27న  తన స్వగృహంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  కుటుంబసభ్యులు ఇంటిని శుభ్రపరుస్తున్న సమయంలో రెండు పిస్టళ్లతోపాటు 18 బుల్లెట్లు ప్రత్యక్షం కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు మృతుడు లోకనాథం సెల్‌ఫోన్‌ ఆధారంగా కొన్ని ఫోన్‌ నంబర్లు గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు.  

తీగ లాగితే..  
పట్టణ పోలీసులు లోకనాథం సెల్‌ఫోన్‌ ఆధారంగా గుర్తించిన ఓ నంబర్‌పై దృష్టి పెట్టి  గాజువాక న్యూపోర్టు ప్రాంతానికి చెందిన గంగాధర్‌ (రాజుబాయ్‌)ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతను తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలం క్రితం లోకనాథానికి తమ కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చాయి. దీంతో తన మామను అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చాడు. భార్యబిడ్డలకు సైతం దూరంగా ఒంటరిగా జీవిస్తూ మామ హత్యకు పథకాలు వేయడం మొదలెట్టాడు. గతంలో లోకనాథం దేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల్లో సైతం ఉద్యోగాలు చేయడంతో అనేక పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే మారణాయుధాల అక్రమ వ్యాపారం చేస్తూ.. బడా పారిశ్రామిక వేత్తలను బెదిరించి డబ్బు వసూలు చేసే  నలుగురు సభ్యులున్న ఆజాద్‌ మాంగేర్‌ గ్రూపుతో పరిచయం ఏర్పడింది.

గ్రూపు సభ్యుల ఆదేశాల మేరకు ఇటీవలే విదేశీ కంపెనీలకు అవసరయ్యే మెన్‌ పవర్‌ను పంపించే విశాఖలో ఉండే ఒక ప్రైవేటు కంపెనీని రూ.5 లక్షలు ఇవ్వాలని లోకనాథం డిమాండ్‌ చేశాడు. అంతేకాకుండా పాత ఇనుప సామాన్ల దుకాణం యాజమాన్యాన్ని రూ.6 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. అయితే..ఇటీవల లోకనాథం అనారోగ్యానికి గురికావడం, భార్య, కుమార్తెలు దూరంగా ఉండడంతో తీవ్ర మానసిక సంఘర్షణకు గురై ఉరేసుకుని బలవన్మరణానికి తెగబడ్డాడు. ఇదే సమయంలో లోకనాథం గ్రూపులోకి రాకపోవడంతో గ్రూపు సభ్యులైన హరియాణా రాష్ట్రం మోహిత్‌ ఎరియాన్‌కు చెందిన బంటీజూట్, ఉత్తరాఖండ్‌ దినేష్‌పూర్‌కు చెందిన సామ్రాట్‌ దాలి, ఢిల్లీకి చెందిన అభిషేక్‌ భరద్వాజ్‌ లోకనాథం విషయమై గంగాధర్‌ (రాజుబాయ్‌)ను సంప్రదించారు.

అప్పటికే నిఘా పెట్టిన పోలీసులు గంగాధర్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఒక పిస్టల్, 4 బుల్లెట్లు, 6 సెల్‌ఫోన్లు స్వాదీన పరుచుకోవడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచి్చన సామ్రాట్‌ దాలి, బంటీజాట్, అభిషేక్‌ భరద్వాజ్‌ను అరెస్టు చేసి మంగళవారం స్థానిక కోర్టులో హాజరు పరిచారు. వీరికి న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement