30 వేలు పెట్టుబడి, ప్రతి నెల రూ.10వేలు | Food Items Chain System Fraud Scheme In Nizamabad | Sakshi
Sakshi News home page

రూ. 250 కోట్ల మేర టోకరా 

Published Wed, Sep 23 2020 10:51 AM | Last Updated on Wed, Sep 23 2020 12:27 PM

Food Items Chain System Fraud Scheme In Nizamabad - Sakshi

ఫుడ్‌ ఐటమ్స్‌ పేరుతో దుకాణం తెరిచారు. దాని చాటున మనీ సర్క్యులేషన్‌కు తెరతీశారు. రూ. 30వేలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ. 10 వేలచొప్పున పది నెలలపాటు తిరిగి ఇస్తామంటూ స్కీం ప్రారంభించారు. కొందరికి డబ్బులు తిరిగి ఇవ్వడంతో జనం ఎగబడి సభ్యులుగా చేరారు. ఆ తర్వాత సంస్థ చేతులెత్తేయడంతో వేలాది మంది రోడ్డున పడ్డారు.  

సాక్షి, కామారెడ్డి: సులువుగా డబ్బులు వస్తున్నాయంటే చాలు ముందూవెనకా ఆలోచించకుండా చాలామంది ఎగబడుతుంటారు. వీరి బలహీనతను ఆసరా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. అంతా అయిపోయాక గానీ తాము మోసపోయామని గుర్తించలేకపోతున్నారు. జిల్లాలో ఓ సంస్థ భారీ స్థాయిలో మోసానికి పాల్పడింది. ఒక్కసారి రూ. 30 వేలు కడితే పది నెలల్లో రూ. లక్షలు తిరిగిస్తామని నమ్మించింది. కొందరికి డబ్బులు ఇవ్వడంతో కరోనా వైరస్‌ లాగే ఈ ‘చైన్‌’ పది జిల్లాలకు విస్తరించింది.

అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత ఈ స్కీంకు ఆటంకాలు మొదలయ్యాయి. కొత్తగా డబ్బులు రావడం ఆగిపోవడం, డబ్బులు కట్టిన వారు కార్యాలయాల చుట్టూ తిరగడంతో వివాదం మొదలైంది. చివరకు ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు సంస్థ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రికార్డులన్నింటినీ సీజ్‌ చేశారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న 37 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అయితే రెండేళ్ల కాలంలో ఈ  సంస్థ రూ. 250 కోట్ల మేర సమీకరించినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.  

ఫుడ్‌ ఐటమ్స్‌ పేరుతో దందా.. 
2018 జనవరిలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్నేహపురి కాలనీలో ‘కీ నెక్ట్స్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్స్, ఫుడ్స్‌ అండ్‌ యాడ్స్, బీర్షేబా ఫుడ్స్‌’ పేరుతో కార్యాలయాన్ని తెరిచారు. పిండి, రవ్వ తదితర ఫుడ్‌ ఐటమ్‌లకు సంబంధించిన వ్యాపారం అంటూ సంస్థను మొదలుపెట్టారు. దాని మాటున మనీ సర్కులేషన్‌ స్కీమ్‌కు తెరలేపారు. ఒకేసారి రూ.30 వేలు చెల్లిస్తే నెలకు రూ.10 వేల చొప్పున పది నెలల పాటు తిరిగి ఇస్తామని నమ్మించారు. అత్యాశకు పోయిన పలువురు సభ్యులుగా చేరారు. చెప్పిన ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీన రూ. 10 వేల చొప్పున సంస్థ నిర్వాహకులు తిరిగిచ్చారు.

ఇలా కొన్ని నెలలు సాగింది. దీంతో స్కీం వైపు చాలామంది ఆకర్షితులయ్యారు. ప్రధానంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో స్కీంలో చేరారు. తమ బంధుమిత్రులందరినీ చేర్పించారు. మంచి కమీషన్‌ ఇవ్వడంతో పలువురు ఏజెంట్లు పోటీ పడి సభ్యులను చేర్పించారు. నెలనెలా డబ్బులు వస్తుండడంతో జనంలో నమ్మకం పెరిగిపోయింది. మొదట్లో తాము కట్టిన రూ.30 వేలతో ఆగకుండా రూ.10 లక్షల దాకా పెట్టుబడులు పెట్టిన వారున్నారు. రోజు కూలీ నుంచి మొదలుకుంటే ఉద్యోగులు, వ్యాపారుల దాకా చాలా మంది బీర్షేబా సంస్థలో సభ్యులుగా చేరి డబ్బులు పెట్టుబడిగా పెట్టారు.  

కరోనాతో చైన్‌కు బ్రేక్‌.. 
కరోనాను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ విధించడంతో ఈ చైన్‌కు బ్రేక్‌ పడింది. కొత్త సభ్యులు చేరకపోవడానికితోడు పాతవారు డబ్బుల కోసం తిరగడం మొదలుపెట్టారు. నిర్వాహకులు పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసి పెట్టడం, కొత్త సభ్యులు రాకపోవడంతో డబ్బుల రొటేషన్‌కు ఇబ్బంది ఏర్పడింది. సభ్యులు డబ్బుల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతుండడంతో నిర్వాహకుడు కుటుంబ సభ్యులతో సహా కనిపించకుండాపోయాడు. కార్యాలయానికి తాళం పడడంతో డబ్బులు కట్టిన వారంతా ఆందోళనకు గురయ్యారు. ఏజెంట్ల దగ్గరికి వెళ్లి నిలదీశారు. వారూ చేతులెత్తేయడంతో కొందరు సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.  

పది జిల్లాలు... 27 వేల మంది సభ్యులు 
మనీ సర్కులేషన్‌ స్కీంలో దాదాపు పది జిల్లాలకు చెందిన 27 వేల మంది సభ్యులుగా చేరినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్‌ తదితర జిల్లాలకు చెందిన వారు సభ్యులుగా చేరినట్టు తెలుస్తోంది. అత్యధికంగా కామారెడ్డి, సిరిçసిల్ల జిల్లాల వారే ఉన్నారు. కూతురి పెళ్లి కోసం జమ చేసిన డబ్బులు, ఇంటి నిర్మాణం కోసం పొదుపు చేసిన సొమ్ము.. ఇలా ఎంతో మంది దాచుకున్న డబ్బులన్నింటినీ బీర్షేబాలో కట్టి మోసపోయారు. తక్కువలో తక్కువ ఒక్కో సభ్యుడు రూ. 30 వేలు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. కొందరు గరిష్టంగా రూ. 10 లక్షలవరకు పెట్టుబడి పెట్టారు. చాలా మంది బంగారం అమ్ముకుని, భూములు కుదువ పెట్టి మరీ స్కీంలో డబ్బులు కట్టారు. కూలినాలి చేసుకుని బతికే వారు సైతం అప్పులు తెచ్చి సంస్థలో సభ్యులుగా చేరారు. స్కీం నిర్వాహకుడు డబ్బులను దారిమళ్లించి అరెస్టై జైలులో ఉండగా, నమ్మి మోసపోయిన వారంతా రోడ్డున పడ్డారు. డబ్బులు తిరిగి వస్తాయన్న నమ్మకం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.   

37 మంది అరెస్టు..
బీర్షేబాలో డబ్బులు పెట్టి మోసపోయిన బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులకు ఫిర్యాదులు చేయసాగారు. దీంతో పోలీసులు బీర్షేబా కార్యాలయాన్ని సోదా చేసి రికార్డులను సీజ్‌ చేశారు. ఇప్పటి వరకు సంస్థ నిర్వాహకుడితో పాటు 37 మందిని అరెస్టు చేసి రిమాండుకు పంపినట్టు కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్‌ ‘సాక్షి’తో తెలిపారు. ప్రధాన నిందితుడు జూలై 2న అరెస్టూ జైల్లో ఉన్నాడన్నారు. మిగతా వారిని దొరికినవారిని దొరికినట్టుగా అరెస్టు చేస్తున్నామన్నారు. మరో 15 మందిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. సంస్థకు సంబంధించిన స్థిర, చరాస్తుల వివరాలను సేకరించి వాటిని సీజ్‌ చేశామని వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement