దేశంలో జీఎస్టీ ఎగవేత మోసాలు ఎక్కువవుతున్నాయి. రూ.5,000 కోట్లు-రూ.8,000 కోట్ల విలువైన జీఎస్టీని ఎగవేసేందుకు 246 బోగస్ కంపెనీలను సృష్టించిన ముఠా గుట్టు రట్టయింది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన అస్రఫ్ ఇబ్రహీం కలవాడియా(50) సహా ఎనిమిది మంది వ్యక్తులపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బృందం నకిలీ పత్రాలు, సంస్థలను సృష్టించి మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించారు.
పుణెలోని కోరేగావ్ పార్క్ పోలీసుల కథనం ప్రకారం..సూరత్‌కు చెందిన అస్రఫ్ ఇబ్రహీం కలవాడియా (50) సహా ఎనిమిది మంది వ్యక్తులు భారీగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 246 బోగస్ కంపెనీలు సృష్టించి ఈ చర్యకు పూనుకున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏకంగా రూ.5000 కోట్లు-రూ.8000 కోట్లు వరకు నష్టం జరుగుతుంది. సెప్టెంబర్ 2018-మార్చి 2024 మధ్య వివిధ కంపెనీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిగింది. పుణెకు చెందిన హడప్‌సర్‌లోని శివ చైతన్య కాలనీ చిరునామాతో రిజిస్ట్రర్ అయిన పఠాన్ ఎంటర్‌ప్రైజెస్ రూ.20.25 కోట్ల జీఎస్టీను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. దాంతో జీఎస్టీ సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) జోనల్ యూనిట్ అధికారులు పుణె పోలీసుల సహకారంతో కలవాడియాను ఎరవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సంఘటనలో తనకు సహకరించిన మరో ఏడుగురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు.
ఆటోరిక్షా డ్రైవర్ పేరుతో కంపెనీ నమోదు
పఠాన్ షబ్బీర్ ఖాన్ అన్వర్ ఖాన్ అనే వ్యక్తి పాన్‌కార్డుతో పఠాన్ ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థను నమోదు చేశారు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని ఖుంబర్‌వాడ ప్రాంతానికి చెందిన పఠాన్ ఆటోరిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పాన్‌కార్డులో నమోదైన చిరునామాతో పోలీసులు తన ఇంటికి వెళ్లేసరికి అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. తనకు ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. నిందితులు చట్ట విరుద్ధంగా పఠాన్ పాన్‌కార్డు వాడి కంపెనీ నమోదు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఇదీ చదవండి: డిఫెన్స్ ఉత్పత్తులు ఎగుమతయ్యే టాప్ 3 దేశాలు
సెక్యూరిటీగార్డు పేరుతో బ్యాంకు ఖాతా
తదుపరి విచారణలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జీత్ కుకాడియా అనే పేరుతో బ్యాంక్ ఖాతా తెరిచారు. కుకాడియా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ నేరంతో తనకు సంబంధం లేదని ఆయన తెలిపారు. బ్యాంకు స్టేట్‌మెంట్‌లు, కాల్ రికార్డులను పరిశీలించిన తర్వాత ఈ ఘటనకు కలవాడియాను ప్రధాన సూత్రధారిగా గుర్తించామని సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రకాశ్ తెలిపారు. ముంబైలోని మీరా భయాందర్‌లోని ఒక హోటల్‌లో కలవాడియాను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తన వద్ద నుంచి సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, సిమ్ కార్డ్‌లు, చెక్ బుక్‌లు, డెబిట్ కార్డ్‌లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పన్ను ఎగవేత కోసం మోసపూరిత లావాదేవీలు జరిపేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు కలవాడియా అంగీకరించాడని ప్రకాశ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment