వరంగల్ క్రైం: విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేలా వీసాలు ఇప్పిస్తామని మోసం చేసి రూ.3 కోట్ల వరకు వసూలు చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రమైన హన్మకొండ సుబేదారి పోలీసు స్టేషన్‌లో గురువారం ఏసీపీ జితేందర్‌రెడ్డి ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన పడిగల సుమంత్, వరంగల్ ఎల్‌బీ నగర్‌కు చెందిన కల్వల రాహుల్ విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు అవసరమైన వీసాలను ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేశారు. హన్మకొండ నక్కలగుట్టలో 2017లో ఫైర్ సేఫ్టీ శిక్షణ సంస్థను ఏర్పాటు చేసిన మీర్‌హౌసీర్ హుస్సేన్.. పలువురు అభ్యర్థులను సుమంత్‌కు పరిచయం చేశాడు. వారి నుంచి వీసా కోసం రూ.8 లక్షల చొప్పున తీసుకున్నారు. సుమంత్ తన కుటుంబ సభ్యులు శృతి, హేమ, సుగుణ అకౌంట్లలోకి డబ్బు వేయించుకున్నాడు. నకిలీ అగ్రిమెంట్లపై సంతకాలు చేయించగా.. ఎంత కూ వీసాలు రాకపోవడంతో మహబూబ్‌నగర్, జగిత్యాల, వేములవాడ, హైదరాబాద్ సైబర్ క్రైం, చెన్నారావుపేట, సుబేదారి, మట్టెవాడ, హన్మకొండ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ఏడుగురు సభ్యులకు గాను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment