
కృష్ణారెడ్డి, వరలక్ష్మి దంపతులు(ఫైల్)
వర్ధన్నపేట: రోడ్డుపై నిలిచిన లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టిన పమ్రాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలైన ఘటన మంగళవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ పరిధిలోని డీసీ తండా శివారులో చోటుచేసుకుంది. ఎస్సై రామారావు కథనం ప్రకారం.. వరంగల్ నగరంలోని పెరుకవాడకు చెందిన ఇల్లూరి కృష్ణారెడ్డి(45), అతని భార్య వరలక్ష్మి(35), కుమారుడు వెంకటసాయిరెడ్డి(14)తోపాటు సోదరుడు రవీందర్‌రెడ్డి, అతని భార్య లక్ష్మీదేవి, వీరి కుమారులు శ్రీధర్‌రెడ్డి, విజ్ఞాన్‌రెడ్డి, కృష్ణారెడ్డి కూతురు హేమలతారెడ్డి, డ్రైవర్ కంజర్ల రమేశ్‌తో కలసి కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొనేందుకు తమ ఇన్నోవా కారులో ఈనెల 6న తమ సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా శంకరపురం వెళ్లారు.
7వ తేదీ సోమవారం రాత్రి 10 గంటలకు కారులో తిరిగి బయలుదేరారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో డీసీతండా శివారులో వరంగల్–ఖమ్మం హైవే మూలమలుపు వద్ద రోడ్డుపైనే నిలిచిన లారీని కారు ఢీకొని ఆ వేగానికి పక్కనే ఉన్న కల్వర్టు గోడను ఢీకొట్టి ఆగిపోయింది. ఒకవేళ కల్వర్టు గోడ లేకుంటే కారులో మిగిలిన వారి ప్రాణాలు కూడా దక్కేవి కాదని స్థానిక గిరిజనులు తెలిపారు. ప్రమాద ఘటనలో కృష్ణారెడ్డి, వరలక్ష్మి, వెంకటసాయిరెడ్డిలకు బలమైన గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ఢీకొట్టిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో పొరుగున ఉన్న గిరిజనులు, స్థానికులు పరుగు పరుగున వచ్చి కారులో ఆర్తనాదాలతో విలవిల్లాడుతున్న క్షతగాత్రులను అతి కష్టంమీద బయటకు తీశారు. సమాచారం అందుకున్న ఎస్సై రామారావు హుటాహుటిన పోలీస్ సిబ్బందితో కలిసి వచ్చి క్షతగాత్రులను 108 వాహనం ద్వారా వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను తీయడానికి వీలుకాకపోవడంతో జేసీబీని తెప్పించి.. డోర్లను తొలగించి వెలికితీసి వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా, రోడ్డు పక్కనే దాబా హోటల్ వద్ద రెడ్ లైట్లు వేయకుండా లారీని నిలిపిన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment