సూర్యాపేటలో యాక్సిడెంట్‌.. ఆరుగురి దుర్మరణం | Serious road accident in Suryapet district | Sakshi
Sakshi News home page

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

Published Thu, Apr 25 2024 6:49 PM | Last Updated on Thu, Apr 25 2024 6:49 PM

Serious road accident in Suryapet district - Sakshi

మొన్నే భార్యాభర్తల్ని బలిగొన్న రహదారి.. ఇవాళ ఏకంగా ఆరుగురిని ఘోరంగా బలిగొంది.

సూర్యాపేట, సాక్షి: తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి నెత్తురోడింది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

కారు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వాళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

లారీ బ్రేక్‌ డౌన్‌ కావడంతో డ్రైవర్‌ దానిని రోడ్డు పక్కగా నిలిపాడు. అయితే కారును వేగంగా నడుపుతున్న వ్యక్తి  ఓ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో గమనించకుండా లారీని ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం ధాటికి కారు లారీ కిందకు వెళ్లిపోయింది. ఇరుక్కుపోయిన వాహనాన్ని స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీశారు. ఆ తర్వాతే మృతదేహాలను, క్షతగాత్రులను తరలించారు.  

మృతుల వివరాలు
కారులో ప్రయాణిస్తున్నవాళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం ఎల్‌ గోవిందాపురం గ్రామానికి చెందినవాళ్లని పోలీసులు గుర్తించారు. విజయవాడ గుణదలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. 

మాణిక్యం

స్వర్ణ

చందర్ రావు

కృష్టంరాజు

లాస్య

శ్రీకాంత్

ఇదిలా ఉంటే..రెండ్రోజుల కిందట ఇదే తరహాలో మునగాల మండలం ముకుందాపురం వద్ద ఘోరం జరిగింది. ఆగి ఉన్న కారును వేగంగా ఢీ కొట్టింది ఓ కారు. ఈ ప్రమాదంలో అందులో ఉన్న యువ దంపతులు అక్కడికక్కడే మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement