రక్షిత
భూపాలపల్లి అర్బన్/రామన్నపేట/నర్సంపేట రూరల్: ప్రేమికుడితో దిగిన ఫొటోలను అతను మరో యువకుడికి పంపడం, ఇద్దరూ కలిసి బ్లాక్‌మెయిల్ చేయడం, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మనస్తాపానికి గురైన యువతి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ముగ్ధుంపురం శివారులో ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) మూడో సంవత్సరం చదువుతోంది.
అయితే తన కుమార్తె కన్పించడం లేదంటూ రక్షిత తండ్రి శంకరాచారి ఈ నెల 22న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా 24న రక్షిత ఆచూకీ లభించింది. విచారణ సందర్భంగా..తన ప్రేమికుడితో దిగిన ఫొటోలను అతను వేరొకరికి పంపిన విషయం, ఇతర వివరాలు ఆమె వెల్లడించింది. దీంతో పోలీసులు ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించి పంపేశారు.
ఈ ఇద్దరు యువకులూ భూపాలపల్లికి చెందిన వారేనని మట్టెవాడ పోలీసులు తెలిపారు. కాగా సరదాగా తీసుకున్న ఫొటోలు కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మనస్తాపానికి గురైన రక్షిత ఆదివారం వరంగల్‌లోని తమ బంధువుల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు.
ర్యాగింగ్ ఆరోపణలపై కాలేజీ యాజమాన్యం ఖండన
‘పబ్బోజు రక్షిత అనే విద్యార్థిని మా కళాశాలలోనే ఈసీఈ విభాగంలో అడ్మిషన్ పొందింది. రెండేళ్లు కళాశాలలోనే చదివింది. కానీ బ్యాక్‌లాగ్‌లు ఎక్కువగా ఉండడంతో మూడో సంవత్సరంలో డిటెండ్ అయింది. దీంతో ఆరు నెలలుగా కళాశాలకు రావడం లేదు. కళాశాలకు రాని విద్యార్థినిని ఎవరు ర్యాగింగ్ చేస్తారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వైరల్ అవుతోంది..’ అని కాలేజీ యాజమాన్యం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment