సాక్షి, వరంగల్: నలుగురు యువకుల ప్రాణాలను బస్సు రూపంలో మృత్యువు కబలించింది. నిర్లక్ష్యపు ప్రయాణానికి నాలుగు ప్రాణాలు గాల్లో కలిసాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకున్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ హృదయ విదారకఘటన వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది.
వర్ధన్నపేట నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సును ఇల్లందు నుంచి వర్ధన్నపేట వైపు వస్తున్న ద్విచక్రవాహనం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా. మరో యువకుడు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతులు వరుణ్ తేజ(18), సిద్దు(18),గణేష్(18), రనిల్ కుమార్(18) లుగా పోలీసులు గుర్తించారు.
నలుగురు యువకులు స్నేహితులు, ప్రమాద సమయంలో ఒక్క ద్విచక్ర వాహనంపై నలుగురు యువకులు ప్రయాణించారు. మృతులు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందినవారు కాగా యువకుల మృతితో వారి కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతంగా మారగా ఇల్లంద గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment