- ప్రైవేటు మార్కెట్‌లో కొనుగోళ్లపై ఆంక్షలు
- అక్రమాల నిరోధానికి అధికారుల చర్యలు
పాడేరు: పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పూర్తిస్థాయి నిత్యవసర సరుకులను అందుబాటులో ఉంచుతున్నారు. టెండర్లు పొందిన వ్యాపారులు జీసీసీకి సక్రమంగా సరుకులను సరఫరా చేయకపోవడం, అక్కడ నుంచి జీసీసీ ద్వారా ఆశ్రమాలకు పూర్తిస్థాయిలో పంపిణీ జరగడం లేదనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. హాస్టల్ వార్డెన్లు కూడా నెలకు సరిపడా పూర్తిస్థాయి సరుకులకు ఇండెంట్లను జీసీసీకి పంపడం లేదనే విమర్శలు ఉన్నాయి.
దీంతో పూర్తిస్థాయిలో సరుకుల నిల్వలకు ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్, గిరిజన సంక్షేమశాఖ డీడీ బి.మల్లికార్జునరెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు భోజన అవసరాలకు సంబంధించిన అన్ని నిత్యవసర సరుకులను జీసీసీ నుంచే పంపిణీ చేయాలని, ప్రైవేటు మార్కెట్‌లో కొనుగోళ్లు తగ్గించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్రమాలకు చెక్ పడింది.
టెండరుదారులంతా జీసీసీ ఇండెంట్ల ప్రకారం సరుకులను సరఫరా చేస్తున్నారు. అక్కడ నుంచి విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా సరుకులు పూర్తిస్థాయిలో ఆశ్రమ పాఠశాలలకు చేరుతున్నాయి. గతంలో వార్డెన్లు కొద్ది మొత్తంలోనే సరుకులను పొందేవారు. కొంత మంది వార్డెన్లు బయట ప్రైవేటు మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నామంటూ బిల్లులు పెట్టేవారు. దీనివల్ల అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆంక్షలు విధించారు.
సరుకులు పక్కదారి పట్టకుండా ఏటీడబ్ల్యుఓల పర్యవేక్షణలోనే అన్ని సరుకులను ఆశ్రమ పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు. దీనికితోడు రోజువారీ సరుకుల నిల్వల రికార్డుల తనిఖీ బాధ్యత కూడా ఏటీడబ్ల్యుఓలకే అప్పగించారు. ఆశ్రమ పాఠశాలల్లో రోజువారీ విద్యార్థుల సంఖ్యను కూడా ఆన్‌లైన్ చేయాలనే నిబంధనలు కూడా ఆశ్రమాల్లో అక్రమాలకు చెక్ పెట్టేదిగా ఉంది. విద్యార్థులు సెలవు దినాల్లో ఇళ్లకు పోయినా రోజు వారీ నివేదికను గిరిజన సంక్షేమ అధికారులు సేకరిస్తున్నారు.