సంక్షేమం చిన్నబోతుంది... సౌకర్యాలు మృగ్యమౌతున్నాయి.. చదువుకొనే పిల్లలు వసతి గృహం మాటెత్తితేనే హడలిపోతున్నారు.. తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వచ్చింది...కళ్ల ముందే పిల్లలుండాలని తపిస్తున్నారు...కాసిన్ని కాసులు కూడేసి కాన్వెంటు చదువులపై మొగ్గు చూపుతున్నారు.. ఫలితంగా ఒకప్పుడు కిటకిటలాడిన సంక్షేమ వసతి గృహాలు నేడు విద్యార్థులు లేక వెలవెల బోతున్నాయి.
శ్రీకాకుళం పాతబస్టాండ్ : సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సీటు కావాలంటే గతంలో ఎంతో ఉన్నత వ్యక్తులతో రికమండేషన్ చేయించాల్సి వచ్చేది. సీటు దొరికితే తమ పిల్లల చదువుకు ఢోకా లేదని తల్లిదండ్రులు భావించేవారు. నేడు రోజులు మారాయి. ఉన్న సీట్లు భర్తీ కాని పరిస్థితి నెలకొంది. గ్రామీణ విద్యార్థులు సైతం నేడు ప్రభుత్వ వసతి గృహాల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. తల్లిదండ్రులు సైతం వసతి గృహాలకు పిల్లలను పంపించేందుకు ససేమీరా అంటున్నారు. ఫలితంగా క్రమంగా సంక్షేమ వసతి గృహలో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది.
దీంతో తక్కువ విద్యార్థులు ఉన్న వసతి గృహాలను మూసివేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. జిల్లాలో సుమారు పది వసతి గృహాల్లో తగినంత మంది విద్యార్థులు చేరకపోవడంతో వాటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు దరఖాస్తుల పరిశీలన పెద్ద ప్రహాసనంగా ఉండేది. ప్రత్యేక కవిటీ విద్యార్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టేవారు. దీంతో హాస్టళ్లలో ప్రవేశానికి పైరవీలు, సిఫార్సులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఖాళీల సంఖ్య పెరిగిపోయింది. వీటిని భర్తీ చేసేందుకు నేరుగా వార్డెన్లు, అధికారులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి హాస్టళ్లలో చేరాలని బతిమలాడే పరిస్థితి నెలకొంది.
జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఇలా..
జిల్లాలో 78 బీసీ వసతి గృహాలు ఉన్నాయి. వసతి గృహానికి 120 మంది వంతునా 9,360 మంది ఉండాలి. అయితే వీటిలో ప్రస్తుతం 6,801 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నట్టు అధికారులే చెపుతున్నారు. సాంఘిక సంక్షేమ విబాగంలో 61 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 7.321 మంది విద్యార్థులు ఉండాల్సిండగా, వీటిలో ఈ ఏడాది 5,123 మంది ఉన్నారు. దీంతో వసతిగృహం అధికారులు ప్రతి గ్రామం వెళ్లి విద్యార్థులను వసతి గృహాల్లో చేరాల్సిందిగా అభ్యర్థించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇవీ కారణాలు !
ఉపాధి హామీ పథకం పనులతో చాలామంది ఆదాయం పెరిగింది. భార్యా భర్తలు కలిపి పనికి వెళితే రోజు వేతనం సుమారు రూ. 550 సంపాదిస్తున్నారు. వారి పిల్లలను మంచి కాన్వెంటులో చదివించాలని చూస్తున్నారు. అంతే కాకుండా పాఠశాలల్లో ఒక పూట భోజనం పెట్టడంతో రెండో పూట భోజనం వారికి భారం కావడంలేదు. దీనికి తోడు చిన్న కుటుంబాలు పెరిగిపోయాయి. ఒకరిద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉండడం లేదు. దీంతో పిల్లలను బయట ఉంచేందుకు ఇష్టపడంలేదు. వసతి గృహల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండటంతో అక్కడకు పిల్లల్ని పంపించేందుకు చాలామంది తల్లిదండ్రులు అంగీకరించడంలేదు. దీనికి తోడు పుస్తకాలు, దుస్తులు సకాలంలో పిల్లకు చేరకపోవడం, సంక్షేమాధికారులు స్థానికంగా ఉండకపోవడం, మెనూ పాటించకపోవడం వంటివి కూడా విద్యార్థులు వసతి గృహాల వైపు చూడకపోవడానికి కారణమవుతున్నాయి.
సంక్షేమం వైపు చూడని విద్యార్థులు !
Published Fri, Jul 17 2015 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM
Advertisement
Advertisement