సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇసుక మాఫియా మళ్లీ పేట్రేగిపోతోంది! వారం పది రోజుల వ్యవధిలోనే ధరలు రెట్టింపు కావడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. హైదరాబాద్‌లో వారం కింద రూ.40 వేలు పలికిన 25 టన్నుల ఇసుక లారీ ధర ఏకంగా రూ.87 వేలకు చేరింది. మొన్నటిదాకా టన్ను రూ.1,600–1,700 పలికిన నాణ్యమైన సన్న ఇసుక ధర రూ.3,400–3,500కు ఎగబాకింది. సిమెంట్ ఇటుకలు, శ్లాబుల నిర్మాణానికి వినియోగించే దొడ్డు ఇసుక టన్నుకు రూ.1,300–1,400 నుంచి రూ.2,500–2,600కు చేరింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలతో తవ్వకాలు, రవాణా నిలిచిపోయి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఇసుక కొరత ఏర్పడింది.
ఇందుకు లారీల సమ్మె మరింత ఆజ్యం పోసింది. ఇదే అదనుగా మాఫియా, దళారులు రెచ్చిపోతున్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, సాగునీటి, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ముందస్తుగా బుక్ చేసుకున్న ఇసుకను కాంట్రాక్టర్లు బ్లాక్‌లో విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. 2014 డిసెంబర్‌లో ప్రకటించిన కొత్త ఇసుక విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం.. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులు, ఉపనదుల ఇసుకతోపాటు జలాశయాల్లోని ఇసుక పూడికల తవ్వకాల బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ)కు బదలాయించింది. ఏటా జూలై–అక్టోబర్ మధ్య వర్షాలతో ఇసుక తవ్వకాలు, రవాణాకు ఆటంకం కలగడం, మాఫియా రంగంలోకి దిగి ధరలు పెంచేయడం గత నాలుగేళ్లుగా కొనసాగుతోంది. కొత్త విధానంలో ప్రభుత్వం.. క్వారీల్లో ఇసుక వ్యాపారులకు విక్రయించే ఇసుక ధరలను మాత్రమే నిర్ణయించింది. ప్రజలకు విక్రయించాల్సిన రిటైల్ ధరలను నిర్ణయించకపోవడంతో ఇసుక వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది.
వర్షాలతో నిలిచిన తవ్వకాలు
రాష్ట్రంలోని పాత ఏడు జిల్లాల పరిధిలోని గోదావరి తీరంలో 56 చోట్లలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం గతేడాది టీఎస్‌ఎండీసీకి అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం 30 చోట్ల మాత్రమే తవ్వకాలు జరుగుతున్నాయి. ఇందులో 25 భారీ, మరో ఐదు చిన్న రీచ్‌లున్నాయి. ఈ రీచ్‌ల నుంచి తవ్విన ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేసి ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా టీఎస్‌ఎండీసీ విక్రయిస్తోంది. సాధారణంగా టీఎస్‌ఎండీసీ ప్రతి రోజూ 40 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను బుకింగ్ కోసం అందుబాటులో ఉంచేది అందులో 30 వేల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక అమ్ముడయ్యేది. అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గత 10 రోజులుగా ఇసుక తవ్వకాలు, రవాణాకు ఆటంకం ఏర్పడింది.
రీచ్‌లు, స్టాక్ యార్డులకు వెళ్లే దారులు దెబ్బతినడంతో వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా రోజువారీగా ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా రోజుకు 9 వేల నుంచి 12 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే టీఎస్‌ఎండీసీ విక్రయిస్తోంది. ఫలితంగా ఇసుక కొరత తీవ్రమైంది. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ కోసం వ్యాపారులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇసుక అవసరం ఉన్నవారు టీఎస్‌ఎండీసీ పేరిట మీ సేవా, ఆన్‌లైన్ కేంద్రాలకు డబ్బులు చెల్లించి రశీదు పొందితే వారి బుకింగ్ ఆర్డర్ మేరకు స్టాక్ పాయింట్ల వద్ద లారీల్లో ఇసుక నింపుతున్నారు. క్యూబిక్ మీటర్‌కు రూ.550 (టన్నుకు రూ.357.5) చొప్పున ప్రభుత్వం ఇసుకను రీచ్‌ల వద్ద విక్రయిస్తోంది.
అయితే రవాణా కోసం అవసరమైన లారీలు ఇసుక వ్యాపారుల వద్దే ఉండడంతో దళారుల ప్రమేయం లేకుండా సామాన్య ప్రజలు ఇసుకను పొందలేకపోతున్నారు. ఇసుక వ్యాపారులే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని అవసరమైన వారికి హైదరాబాద్‌లో టన్నుకు రూ.1600–1700లు, జిల్లాల్లో రూ.1200కు చొప్పున విక్రయించేవారు. హైదరాబాద్‌లో 25 టన్నుల ఇసుక లారీ రూ.40 వేలలోపు ధర పలికేది. ప్రస్తుతం కొరత ఉండడంతో టన్ను ఇసుక ధరను అడ్డగోలుగా రూ.3,400–3,500కు పెంచేశారు. లారీ ఇసుక ధర రూ.40 వేల నుంచి రూ.87 వేలకు పెంచడంతో సామాన్యులతోపాటు బిల్డర్లు గగ్గోలు పెడుతున్నారు.
సర్కారీ కాంట్రాక్టర్ల బ్లాక్ దందా
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానేరు నది పరిధిలోని నాలుగు రీచ్‌లలోని ఇసుకను డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, మరో ఆరు రీచ్‌లలోని ఇసుకను పూర్తిగా సాగునీటి, ఇతర ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన ఇసుక మొత్తాన్ని నిర్ధారిస్తూ సంబంధిత ప్రాజెక్టుల నిర్వహణ అధికారులు జారీ చేసిన అంచనా నివేదిక ఆధారంగా టీఎస్‌ఎండీసీ నుంచి కాంట్రాక్టర్లు నేరుగా ఇసుక కొనుగోలు చేస్తున్నారు. కానీ కాంట్రాక్టర్లు.. ఇంజనీరింగ్ శాఖల అధికారులను ప్రలోభపెట్టి ప్రాజెక్టులకు అవసరమైన ఇసుక కన్నా ఐదారు రెట్లు ఎక్కువగా అంచనాలను తెచ్చుకుంటున్నారు. వాటి ఆధారంగా టీఎస్‌ఎండీసీ నుంచి ఒకేసారి బల్క్‌గా ఇసుక కొనుగోలు కోసం ఆర్డర్లు పొందుతున్నారు.
ఆ ఆర్డర్ల ఆధారంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు టీఎస్‌ఎండీసీకి డీడీలు చెల్లించి నేరుగా మానేరు రీచ్‌ల నుంచి ఇసుకను తరలించుకుపోతున్నారు. ఇసుక కొరత నెలకొన్న సమయంలో కూడా ప్రభుత్వ పనులకు ఆటంటం కలగకూడదన్న ఉద్దేశంతో టీఎస్‌ఎండీసీ కాంట్రాక్టర్లు తొలి ప్రాధాన్యం ఇస్తూ ఇసుక విక్రయిస్తోంది. కాంట్రాక్టర్లు అవసరానికి మించి బుక్ చేసుకున్న ఇసుకకు సంబంధించిన ఆర్డర్లను ఇసుక వ్యాపారులకు బ్లాకులో విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు.
ఆన్‌లైన్‌లో 25 టన్నుల లారీ ఇసుక కోసం వ్యాపారులు టీఎస్‌ఎండీసీకి రూ.8,889 డీడీని చెల్లిస్తే కొనుగోలు ఆర్డర్ జారీ అవుతోంది. ప్రస్తుతం టీఎస్‌ఎండీసీ ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయాలు తగ్గిపోవడంతో సర్కారీ కాంట్రాక్టర్లు 25 టన్నుల ఇసుక ఆర్డర్‌ను ఇసుక వ్యాపారులు, లారీల యజమానులకు బ్లాక్‌లో రూ.20 వేలకు అమ్ముకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా ఇసుక ధరలు రెట్టింపు అయ్యాయి. సర్కారీ పనుల కోసం కేటాయించిన ఇసుకను దారి మళ్లించి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న లారీలు నిత్యం పట్టుబడుతున్నా.. కేవలం వాటిని బ్లాక్‌లిస్టులో పెట్టి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అధిక ధరకు కొనుగోలు చేయకండి: టీఎస్‌ఎండీసీ
గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు, రహదారులు దెబ్బతినడంతో ఇసుక సరఫరాలో కొంత ఇబ్బంది కలుగుతోందని టీఎస్‌ఎండీసీ వైస్ చైర్మన్, ఎండీ జి.మల్సూర్ తెలిపారు. వినియోగదారులకు సరిపడ ఇసుకను రోజువారీగా సరఫరా చేయలేకపోతున్నామన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఇసుక దళారులు మార్కెట్‌లో అధిక ధరకు ఇసుక విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అధిక ధరకు ఇసుక కొనుగోలు చేయొద్దని, కొన్ని రోజులు వేచి ఉంటే ధరలు సాధారణ స్థితికి వస్తాయని సూచించారు. వర్షాకాలంలో వినియోగదారులకు సరఫరా చేసేందుకు స్టాక్ యార్డుల్లో 50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక 25 ప్రాంతాల్లో అందుబాటులో ఉందని, ఇసుక కొరత లేదని చెప్పారు. ప్రభుత్వ పనులకు కేటాయించిన ఇసుకను దారి మళ్లించి బ్లాక్‌లో విక్రయిస్తున్న లారీలను పట్టుకుని బ్లాక్‌లిస్టులో పెడుతున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment