వ్యాపారులు వద్ద రాశులుగా దర్శనమిస్తున్న కొబ్బరి కాయలు
పశ్చిమగోదావరి, భీమవరం : ఆలిండియా లారీ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని లారీల యజమానులు బంద్ పాటిస్తుండడంతో కొబ్బరి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో సుమారు లక్ష మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. డీజిల్ ధరలు తగ్గించాలని, థర్ట్ పార్టీ ఇన్సూరెన్స్, టోల్‌గేట్ తదితర సమస్యలను పరిష్కరించాలని దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి లారీల సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం వరకు చేపలు, రొయ్యలు, నిత్యావసర వస్తువుల రవాణాకు ఎటువంటి ఆటంకం కల్పించకపోవడంతో పరిమితి సంఖ్యలో లారీలు తిరుగుతున్నాయి. అయితే మరో రెండు రోజల్లో పూర్తిస్థాయిలో సమ్మె నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చేపలు, రొయ్యల ఎగుమతులతో పాటు నిత్యావసర వస్తువుల రవాణాను కూడా నిలువరించేందుకు లారీ యజమానుల సంఘాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి.
నిలిచిన కొబ్బరి ఎగుమతులు
రాష్ట్ర వ్యాప్తంగా లారీల సమ్మె కారణంగా జిల్లాలో కొబ్బరి వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. రాజస్తాన్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, హర్యానా, కేరళ తదితర రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో వ్యాపారుల వద్ద కొబ్బరి కాయలు గుట్టలు గుట్టలుగా రాశులు పోసి నిల్వచేస్తున్నారు. అలాగే లారీ డ్రైవర్లు, క్లీనర్లు 30 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోవడమేగాక కొబ్బరి ఒలుపు, ఎగుమతి, దిగుమతి తదితర పనులు చేసి సుమారు లక్ష మంది కార్మికులకు పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి వ్యాపారంలో ఈ పర్మిట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1వ తేదీ కొబ్బరి వ్యాపారులు సమ్మె చేయడంతో 10 రోజుల పాటు వ్యాపారం నిలిచిపోయి కార్మికులు ఉపాధిని కోల్పోయారు.
కొబ్బరి వ్యాపారులకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాపారులకు న్యాయం చేస్తామంటూ హామీ ఇవ్వడంతో ఈ నెల 15వ తేదీ నుంచి కొబ్బరి వ్యాపారం తిరిగి ప్రారంభమైంది. కొబ్బరి ఎగుమతులు జోరందుకుంటున్న సమయంలో లారీల సమ్మె కారణంగా వ్యాపారం నిలిచిపోయిందని, దీంతో కొబ్బరి కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆగస్టు నెల 26న రాఖీ పండుగ నేపథ్యంలో రాజస్థాన్‌కు కొబ్బరి ఎగుమతులు ఎక్కువగా జరుగుతాయని దీనికిగాను నెల రోజుల ముందు నుంచి ఎగుమతులు ప్రారంభం కావల్సి ఉండగా లారీల సమ్మెతో వ్యాపారం నిలిచిపోయిందని కొబ్బరి వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఈ పర్మిట్ విధానం వల్ల సమ్మె చేసిన వ్యాపారులకు లారీల సమ్మె గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పేరుకున్న నిల్వలు
ఈ నెల ఒకటో తేది నుంచి కొబ్బరి వ్యాపారుల సమ్మె కారణంగా పది రోజుల పాటు వ్యాపారం నిలిచిపోయింది. మళ్లీ లారీల సమ్మెతో ఎగుమతులు లేక మా వద్ద రాశులుగానే కొబ్బరి నిల్వ చేస్తున్నాం. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన కొబ్బరి కాయలు ఎగమతులు లేకపోవడం పెట్టుబడి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.– కామన రాంబాబు, కొబ్బరి వర్తకుల సంఘం కార్యదర్శి, భీమవరం
నిలిచిన కొనుగోళ్లు
ఈ నెల ప్రారంభంలో పది రోజుల పాటు కొబ్బరి వ్యాపారులు సమ్మె కారణంగా రైతుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సార్వా సీజన్ ప్రారంభం కావడంతో కొబ్బరిపై ఆదాయం వ్యవసాయానికి ఉపయోగించుకుంటాం. అయితే లారీల బంద్‌తో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నాం.– వేగేశ్న విజయరామరాజు, కొబ్బరి రైతు, కాళ్లకూరు
Comments
Please login to add a commentAdd a comment