Coconuts
-
కోతి... కొబ్బరి కాయ!
కోతి చేష్టలన్న మాట మీరెప్పుడైనా విన్నారా? అర్థం పర్థం లేని పనులు చేస్తూంటే వాడతారిలా! కానీ మీరోసారి థాయ్‌లాండ్, మరీ ముఖ్యంగా... దేశం దక్షిణం వైపున ఉన్న కొబ్బరి తోటలకు వెళ్లి చూడండి... మీ అభిప్రాయం తప్పకుండా మార్చుకుంటారు. ఏముంది అక్కడ అని ఆలోచిస్తూంటే కథనాన్ని పూర్తిగా చదివేయండి!! విషయం ఏమిటంటే... థాయ్‌ల్యాండ్‌లో కోతులు కొబ్బరికాయలు కోసే పని చేస్తున్నాయట కొబ్బరికాయలు తెంపడం అంత సులువైన పనేమీ కాదండోయ్. నిట్ట నిలువుగా 30-40 అడుగులున్న కొబ్బరి చెట్లు ఎక్కడం ఒక సవాలైతే.. బ్యాలెన్స్ చేసుకుంటూ కాయలు తెంపడమూ ఓ కళ... నైపుణ్యమే. అయితే ఈ నైపుణ్యం ఉన్న వారు రాను రాను తగ్గిపోతున్నారని కొబ్బరి తోటల పెంపకం దారులు తరచూ వాపోతూంటారు. కూలీలు దొరక్క ఇబ్బందులు పడటమూ మనం చూస్తూంటాం. థాయ్‌ల్యాండ్ రైతులు పరిష్కారం కనుక్కున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ కోతులకు కొబ్బరి కాయలు తెంపడంలో శిక్షణ ఇచ్చి వాటి సేవలను వాడుకుంటున్నారు మరి! కానీ విశేషం ఏమిటంటే... కోతులు ఆ పనులు చాలా చక్కగా పద్ధతిగా చేస్తూండటం. ఎంత పద్ధతిగా చేస్తున్నాయంటే.. మగ కోతులు చెట్లు ఎక్కి కాయలు తెంపుతూంటే... ఆడ కోతులు కిందపడ్డ వాటిని రైతుల వాహనాల్లోకి చేర్చడం వంటివి చేస్తున్నాయి. నాణేనికి మరోవైపు... కొబ్బరి కాయలు తెంపేందుకు కోతుల వాడకం బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. నాణేనికి ఇంకో పార్శ్వమూ ఉన్నట్లు దీనిపై కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, కథనాలను బట్టి చూస్తే థాయ్‌లాండ్ రైతులు ఈ కోతులను కూలీలుగా వాడుకుంటున్నా.. అందుకు తగ్గ ప్రతిఫలమూ వాటికి అందిస్తున్నారు. వాటి ఆకలిదప్పులు తీర్చడం మాత్రమే కాకుండా.. ఇంటి మనిషిగానూ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కోతుల పట్ల కొంతమంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, పనులు చేయనప్పుడు చైన్లతో కట్టిపడేస్తున్నారన్నది జంతు ప్రేమికుల ఆరోపణ. పైగా కాయలు తెంపే కోతులను అడవిలోంచి వేటాడి పట్టుకొస్తున్నారని, చిన్న వయసులోనే అక్రమంగా పట్టుకొచ్చి శిక్షణ ఇచ్చి పని చేయించుకుంటున్నారని పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్) వంటి సంస్థలు విమర్శిస్తున్నాయి. శిక్షణ సందర్భంగానూ కోతులపట్ల సరిగా వ్యవహరించడం లేదని చెబుతున్నారు. దాడులు చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు కోతుల పళ్లు తీసేస్తున్నారని తెలుస్తోంది. ఎగుమతులకు పెట్టింది పేరు... థాయ్‌లాండ్ కొబ్బరి ఎగుమతులకు పెట్టింది పేరు. స్థానికంగానూ కొబ్బరి పాలకు డిమాండ్ ఎక్కువ. పశువుల నుంచి సేకరించే పాలకు బదులుగా ఇక్కడ పచ్చి కొబ్బరి పాలను ఉపయోగిస్తూంటారు. అయితే ఇటీవలి కాలంలో కోతులతో కాయలు తెంపిస్తున్నారన్న వార్తలు ప్రబలడంతో నైతికాంశాల రీత్యా కొంతమంది కొబ్బరి పాల వాడకాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది. కొన్ని బహుళజాతి కంపెనీలు కూడా కోతులను కూలీలుగా వాడుతున్న వారి ఉత్పత్తులను కొనరాదని తీర్మానించాయి. ఇదీ థాయ్‌లాండ్ కోతుల చేష్టలు! మీరేమంటారు? కోతులను మనం కూలీలుగా వాడుకోవచ్చా? లేక వాటి మానాన వాటిని వదిలేయాలా? -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్: 51 టెంకాయలు ఆర్డర్.. ‘ఎక్స్’ పోస్ట్ వైరల్!
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. భారత్ విజయం కోసం కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆతృతంగా ఎదురు చూశారు.. అన్ని వర్గాల వారు ఆకాంక్షించారు.. ప్రార్థనలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించి కప్ గెలిస్తే కొట్టడానికి 51 టెంకాయలను థానేకు చెందిన ఓ వ్యక్తి ఫుడ్‌డెలివరీ యాప్ స్విగ్గీలో ఆర్డర్ చేశారు. ఈ సమాచారాన్ని స్విగ్గీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. థానే నుంచి ఎవరో ఇప్పుడే 51 టెంకాయలు ఆర్డర్ చేశారు. బహుశా వరల్డ్ కప్ ఫైనల్ గెలుపు కోసమే అయిఉండచ్చు. అదే నిజమై భారత్‌కు కప్ రావాలని ఆకాంక్షించింది. కాగా స్విగ్గీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ఆర్డర్ చేసింది తానే అంటూ ఓ వ్యక్తి స్విగ్గీ పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. భారత్ వరల్డ్ కప్ గెలిస్తే కొట్టడానికే టెంకాయలు ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. టీవీ ముందు టెంకాయలు ఉంచిన దృశ్యాన్ని ఈ ట్వీట్‌కు జత చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. లక్షల్లో వ్యూవ్స్, కామెంట్లు వచ్చాయి. కాగా ఇదే వ్యక్తి భారత్ విజయాన్ని వ్యక్తీకరించడానికి 240 అగరబత్తులను ఆర్డర్ చేశారు. haan bhay yeh someone from thane bhi mai hi hoon, 51 nariyal for unreal manifestation✨ https://t.co/aNa3WACNOp pic.twitter.com/kVuQ6WjCjH — gordon (@gordonramashray) November 19, 2023 -
కొబ్బరి మాత్రమే ఆహారం..ఈ పెద్దాయన డైట్ ప్లాన్ వింటే షాకవుతారు..
‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా..’ అంటూ వేడి అన్నంలోకి నెయ్యి, పప్పు, ఆవకాయ, అప్పడాలు ఇలా ఎన్నో రకరకాల వంటకాలను తింటుంటారు భోజన ప్రియలు. అదే ప్రతిరోజూ ప్రతిపూట ఒకే ఆహారం తినాల్సి వస్తే? ఆ బాధ వర్ణించరానిది. అలాంటిది ఒక వ్యక్తి ఎంతో ఇష్టంగా ఒకే ఆహారాన్ని గత రెండు దశాబ్దాలుగా తీసుకుంటున్నాడు. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన బాలకృష్ణ పలాయి, గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కేవలం కొబ్బరి నీళ్లు, కొబ్బరి కాయలు తింటూ జీవితం సాగిస్తున్నాడు.ఎందుకంటే, అతనికి ‘గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్ (జీఈఆర్డీ). ఈ జబ్బుతో బాధపడేవారి అన్నవాహిక చివర ఉండే కండరం సరిగ్గా మూసుకోదు. దీంతో, ఏ ఆహారం తిన్నా గుండెల్లో మంట, వాంతులు, కడుపు ఉబ్బరంతో నీరసించి, ఒక్కోసారి కుప్పకూలిపోతారు కూడా. బాలకృష్ణకు కూడా ఇదే పరిస్థితి. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, తక్కువ మొత్తంలో ఆహారం తిసుకునేవాడు. కాలక్రమంలో తనకు కొబ్బరి నీళ్లతో ఏ ఇబ్బంది లేదని గ్రహించాడు. తర్వాత కొంచెం లేత కొబ్బరిని ప్రయత్నించాడు. దాంతో కూడా ఏ ఇబ్బంది లేకపోవడంతో ఇక తన ఆహారం కేవలం కొబ్బరి మాత్రమేనని నిర్ణయించుకున్నాడు. View this post on Instagram A post shared by Travel, Romance, Smiles (@shenaztreasury) కొబ్బరినీళ్లతో బోలెడు ప్రయోజనాలు ► కొబ్బరినీళ్లలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి అనేకరకాల వ్యాధులను దూరం చేస్తాయి. ► కొబ్బరినీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది. ఇది వ్యార్థాలను తొలగించి శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. ► కొబ్బరినీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ► జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపర్చడమే కాకుండా పొట్ట సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ► రోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటును నివారిస్తుంది. ► గుండెజబ్బులు, హార్ట్ ఫెయిల్యూర్ రిస్కును తగ్గించడంలో కొబ్బరినీళ్లు ముఖ్య పాత్ర వహిస్తుంది. కొబ్బరిలో ఎన్నో మినరల్స్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి, కాబట్టి బాలకృష్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. అంతేకాదు, లోకల్ క్లబ్లో తనకెంతో ఇష్టమైన ఫుట్‌బాల్ ఆడుతూ ఫుట్‌బాల్ ప్లేయర్‌గానూ విజయాలు సాధిస్తున్నాడు. -
ఎండుకొబ్బరి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి
ఎండుకొబ్బరిని నిల్వ ఉంచిన కొద్దిరోజులకే కొబ్బరిచిప్ప లోపల బూజులాగా రావడం, కొన్నిసార్లు లోపల తెల్లగా ఉన్నప్పటికీ చేదుగా మారడం చూస్తుంటాం. ఇవేవీ రాకుండా, కొబ్బరిచిప్పలను చింతలేకుండా ఇలా నిల్వచేసుకోండి... మార్కెట్ నుంచి తెచ్చిన ఎండు కొబ్బరి చిప్పలను శుభ్రంగా తుడిచి, ఎండలో ఆరబెట్టాలి. ఆరిన చిప్పలను ఉప్పునీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరినూనెను వేళ్లతో తీసుకుని చిప్పకు రాసి నిమిషం పాటు రుద్దాలి. ఈ చిప్పలను రెండురోజుల పాటు ఎండలో పెట్టి , కవర్లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా పెట్టిన కొబ్బరి నెలల పాటు పాడవకుండా ఉంటుంది. టేబుల్ స్పూను పటిక పొడిని కప్పు నీటిలో కలపాలి. పటిక మొత్తం కరిగిన తరువాత ఈ నీటిలో చిన్న గుడ్డను ముంచి కొబ్బరి చిప్పల లోపల, బయటా తుడవాలి. ఇలా తుడిచిన చిప్పలను ఎండలో రెండు రోజుల పాటు ఆరబెట్టి, కవర్లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వచేయాలి. ఇలా కూడా ఎక్కువ రోజుల పాటు చిప్పలు తాజాగా ఉంటాయి. -
శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం
రాజంపేట టౌన్ (అన్నమయ్య జిల్లా): కార్తీక మాసం సందర్భంగా వందలాది మంది భక్తులు శివాలయాలకు తరలి వచ్చి దీపాలను వెలిగించి స్వామివారికి పండ్లను ప్రసాదంగా ఉంచుతారు. ఆ పండ్లను భక్తులు తమ వెంట తీసుకెళ్లకుండా అక్కడే ఉంచి వెళ్లిపోతారు. వందలాది మంది భక్తులు వదిలి వెళ్లే వివిధ రకాల పండ్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రధానంగా భక్తులు దీపాలను వెలిగించాక స్వామివారికి అరటి పండ్లను ప్రసాదంగా పెడతారు. ఒక్క రాజంపేట పట్టణంలోని శివాలయంలోనే కార్తీక సోమవారం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఈ కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆలయ ప్రాంగణమంతా వేల సంఖ్యలో అరటి పండ్లు పడి ఉంటాయి. అయితే ఈ పండ్లు నిరుపయోగమవుతున్నాయని పట్టణంలోని ఈడిగపాళెంకు చెందిన నరసింహా అనే ఎలక్ట్రీషియన్ గుర్తించాడు. పండ్లను మూగజీవులకు ఆహారంగా పెడితే ఒక రోజు అయినా అవి కడుపు నింపుకోగలవన్న ఆలోచన ఆయనలో తట్టింది. అనుకున్నదే తడవుగా తన షాపునకు చుట్టుపక్కల ఉండే చిరు వ్యాపారులు, దినసరి కూలీల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, భక్తులు శివాలయ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ వదిలిన అరటి పండ్లను ఏరుకొని మూగజీవులకు ఆహారంగా పెడతామని చెప్పాడు. వారు కూడా నరసింహా ఆలోచన సరైనదేనని భావించి కార్తీక మాసంలో భక్తులు శివాలయంలో స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లతో పాటు కొబ్బెర చిప్పలను మూగజీవులకు ఆహారంగా పెట్టేందుకు ముందుకు వచ్చారు. 2016వ సంవత్సరం నుంచి కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది కార్తీక మాసంలో నరసింహాతో పాటు చిరువ్యాపారులు, దినసరి కూలీలైన వెంకటనరసయ్య, రమణ, బీవీ సురేంద్ర, ఉమాశంకర్‌లు శివాలయంలోని అరటి పండ్లను గోతాల్లో వేసుకొని ప్రత్యేక వాహనంలో రాపూరు ఘాట్‌లో ఉండే కోతులకు ఆహారంగా పెడుతున్నారు. కార్తీక మాసంలో ప్రతి మంగళవారం ఈ చిరు వ్యాపారులు, దినసరి కూలీలు తమ పనులను సైతం మానుకొని ఆటో బాడుగను కూడా వారే భరించి మూగజీవులకు చేస్తున్న సేవకు పట్టణ వాసులచే ప్రసంశలు, అభినందనలు అందుకుంటున్నారు. రాపూరు ఘాట్‌లో కోతులు పెద్ద సంఖ్యలో ఉంటాయని, వాటికి ఎవరు కూడా ఆహారం పెట్టే పరిస్థితి ఉండదని అందువల్ల ప్రతి ఏడాది కార్తీకమాసంలో ఈసేవా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. (క్లిక్ చేయండి: వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!) -
అన్ని ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టండి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): వికేంద్రీకరణను ఆకాంక్షిస్తూ రాష్ట్రంలో ప్రతిఒక్కరూ విజయదశమి రోజున కుల, మతాలకు అతీతంగా అన్ని ఆలయాల్లోను ప్రార్థించి కొబ్బరికాయలు కొట్టాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ఇంతకంటే మంచి రోజు మరొకటి రాదన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు ఏ రోజూ ప్రజల కోసం ఆలోచించని చంద్రబాబుకు సద్బుద్ధి వచ్చేటట్లు, వికేంద్రీకరణకు మద్దతిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కొబ్బరికాయలు కొట్టాలన్నారు. అమరావతి నుంచి అరసవిల్లి వరకు రైతుల ముసుగులో బూటకపు పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు బృందానికి ఆ దేవుడే సరైన బుద్ధి చెబుతారని వారన్నారు. పాదయాత్రతో అరసవిల్లి వెళ్లే వారు సూర్యభగవానుడ్ని ఏమని కోరుకుంటారని.. అమరావతి మాత్రమే బాగుండాలని కోరుకుంటారా.. లేక, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారా.. అని వేణు, కన్నబాబు ప్రశ్నించారు. అందుకే పాదయాత్ర చేస్తూ అరసవల్లి వెళ్లే వారు ఏమి కోరుకున్నా సూర్యభగవానుడు మాత్రం మెజార్టీ ప్రజల అభీష్టమైన వికేంద్రీకరణకే ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. -
వింత సంప్రదాయం: కొబ్బరికాయలను తలపై కొడతారు
కెలమంగలం(కర్ణాటక): డెంకణీకోట తాలూకా జే.కారుపల్లి పంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో మల్లేశ్వరస్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించి తలపై కొబ్బరికాయలను కొట్టించుకొన్నారు. ప్రతి 9 ఏళ్లకొకసారి ఈ సంప్రదాయం పాటిస్తారు. వెంకటాపురం, గంగసంద్రం, పాపిరెడ్డిపాళ్యం తదితర గ్రామాల నుంచి 500 మంది భక్తులు ఏమాత్రం భీతి లేకుండా తలపై కొబ్బరికాయలు కొట్టించుకొని మొక్కులు తీర్చుకొన్నారు. పెద్దఎత్తున ప్రజలు పాల్గొని భక్తుల విన్యాసాలను తిలకించారు. -
‘కొబ్బరి’కి మొలకలు.. రైతులకు కన్నీళ్లు
సాక్షి, అమలాపురం: కొబ్బరికాయలకు మొలకలొస్తున్నాయి. నర్సరీ రైతులైతే వీటిని చూసి సంతోషించేవారు కానీ రెండు నెలలుగా సరైన అమ్మకాలు లేక కొబ్బరి రాశుల్లో వస్తున్న మొలకలను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. అన్ని ఉద్యాన పంటలు గత ఏడాది కాలంగా సంక్షోభంలో ఉండగా.. కొబ్బరి దిగుబడితో పాటు ధర బాగా ఉందని రైతులు మురిసిపోయారు. ఆ సంతోషంపై నీళ్లు జల్లుతూ గత కొంతకాలంగా కొబ్బరి ధర నేల చూపులను చూస్తోంది. రాష్ట్రంలో 2.45 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగు జరుగుతోంది. ఇళ్ల వద్ద, చెరువు గట్లు, రహదారులకు ఇరువైపులా ఉన్న చెట్లను పరిగణనలోకి తీసుకుంటే మరో 40 వేల ఎకరాల తోటలున్నట్టు అంచనా. ఏడాదికి సగటున 213.50 కోట్ల కాయల దిగుబడి వస్తోంది. రాష్ట్రంలో 9 జిల్లాల్లో కొబ్బరిసాగు జరుగుతున్నా దానిలో 2.37 లక్షల ఎకరాలు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నాయి. ఇటీవల తిత్లీ తుపాను వల్ల ఉద్ధానం ప్రాంతంలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో 27 వేల ఎకరాలకు పైబడి కొబ్బరి దెబ్బతింది. చెట్లున్నచోట మరో రెండేళ్లపాటు కాలం దిగుబడి రాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో దిగుబడి ఉన్నా.. ధర లేక రైతులు లబోదిబోమంటున్నారు. గతేడాది ఈ సీజన్లో వెయ్యి పచ్చికాయల ధర రూ.13 వేల 500 వరకు ఉండగా.. అంబాజీపేట మార్కెట్లో ఇప్పుడు రూ.6 వేలకు పడిపోయింది. ధర పతనమైనా కొబ్బరి కొనేవారు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఇళ్ల వద్ద రెండు దింపుల రాశులు పేరుకుపోయాయి. వర్షాలకు వాటికి మొలకలు వస్తున్నాయి. ప్రతి 100 కాయలకు 20 కాయలు మొలకలు వస్తున్నాయి. దీనిని ఎండు కొబ్బరిగా చేసినా కాయకు మూడు రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. దీనివల్ల రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. సాధారణంగా శ్రావణమాసం.. దీపావళి.. కార్తిక మాసాల్లో ధరలు పెరుగుతుంటాయి. ఈసారి అది కూడా లేదు. పెట్టుబడులు కూడా రావడం లేదు... ఇటీవల కూలిరేట్లు, దింపు, వలుపు కార్మికుల జీతాలు, ఎరువుల ధరలు పెరగడం వల్ల కొబ్బరి సగటు పెట్టుబడి ఎకరాకు రూ. 50 వేల వరకు అవుతోంది. కానీ ఇప్పుడున్న ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఎకరాకు సగటు దిగుబడి 7 వేల కాయలు కాగా, రూ. 42 వేలు మాత్రమే ఆదాయం వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పాస్ విధానానికి వ్యతిరేకంగా జూలై ఒకటిన ఆరంభమైన సమ్మె ఇంచుమించు నెలాఖరు వరకూ కొనసాగింది. అదే నెల 26 నుంచి దేశవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల సమ్మె, ఆగస్టు ఒకటి నుంచి ప్రాంతాల వారీగా వలుపు కార్మికులు సమ్మె.. ఇలా వరుసగా వ్యాపారాలు మూతపడడంతో ఎక్కడి కొబ్బరి అక్కడే నిలిచిపోయింది. దీనిని అందిపుచ్చుకున్న తమిళనాడు వ్యాపారులు ఉత్తరాదికి భారీగా ఎగుమతులు చేశారు. దీనివల్ల ధర తగ్గిపోయింది. ధర పడిపోయిన నేపథ్యంలో 2005లో అప్పటి సీఎం, దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ హయాంలో కొనుగోలు చేసినట్టుగా పచ్చి కొబ్బరిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ధరలును బట్టి కేజీ రూ. 34 చేసి కొనాలని, జనవరి నుంచి నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. -
కొబ్బరికి లారీల సమ్మె పోటు
పశ్చిమగోదావరి, భీమవరం : ఆలిండియా లారీ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని లారీల యజమానులు బంద్ పాటిస్తుండడంతో కొబ్బరి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో సుమారు లక్ష మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. డీజిల్ ధరలు తగ్గించాలని, థర్ట్ పార్టీ ఇన్సూరెన్స్, టోల్గేట్ తదితర సమస్యలను పరిష్కరించాలని దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి లారీల సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం వరకు చేపలు, రొయ్యలు, నిత్యావసర వస్తువుల రవాణాకు ఎటువంటి ఆటంకం కల్పించకపోవడంతో పరిమితి సంఖ్యలో లారీలు తిరుగుతున్నాయి. అయితే మరో రెండు రోజల్లో పూర్తిస్థాయిలో సమ్మె నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చేపలు, రొయ్యల ఎగుమతులతో పాటు నిత్యావసర వస్తువుల రవాణాను కూడా నిలువరించేందుకు లారీ యజమానుల సంఘాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. నిలిచిన కొబ్బరి ఎగుమతులు రాష్ట్ర వ్యాప్తంగా లారీల సమ్మె కారణంగా జిల్లాలో కొబ్బరి వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. రాజస్తాన్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, హర్యానా, కేరళ తదితర రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో వ్యాపారుల వద్ద కొబ్బరి కాయలు గుట్టలు గుట్టలుగా రాశులు పోసి నిల్వచేస్తున్నారు. అలాగే లారీ డ్రైవర్లు, క్లీనర్లు 30 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోవడమేగాక కొబ్బరి ఒలుపు, ఎగుమతి, దిగుమతి తదితర పనులు చేసి సుమారు లక్ష మంది కార్మికులకు పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి వ్యాపారంలో ఈ పర్మిట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1వ తేదీ కొబ్బరి వ్యాపారులు సమ్మె చేయడంతో 10 రోజుల పాటు వ్యాపారం నిలిచిపోయి కార్మికులు ఉపాధిని కోల్పోయారు. కొబ్బరి వ్యాపారులకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాపారులకు న్యాయం చేస్తామంటూ హామీ ఇవ్వడంతో ఈ నెల 15వ తేదీ నుంచి కొబ్బరి వ్యాపారం తిరిగి ప్రారంభమైంది. కొబ్బరి ఎగుమతులు జోరందుకుంటున్న సమయంలో లారీల సమ్మె కారణంగా వ్యాపారం నిలిచిపోయిందని, దీంతో కొబ్బరి కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆగస్టు నెల 26న రాఖీ పండుగ నేపథ్యంలో రాజస్థాన్‌కు కొబ్బరి ఎగుమతులు ఎక్కువగా జరుగుతాయని దీనికిగాను నెల రోజుల ముందు నుంచి ఎగుమతులు ప్రారంభం కావల్సి ఉండగా లారీల సమ్మెతో వ్యాపారం నిలిచిపోయిందని కొబ్బరి వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఈ పర్మిట్ విధానం వల్ల సమ్మె చేసిన వ్యాపారులకు లారీల సమ్మె గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరుకున్న నిల్వలు ఈ నెల ఒకటో తేది నుంచి కొబ్బరి వ్యాపారుల సమ్మె కారణంగా పది రోజుల పాటు వ్యాపారం నిలిచిపోయింది. మళ్లీ లారీల సమ్మెతో ఎగుమతులు లేక మా వద్ద రాశులుగానే కొబ్బరి నిల్వ చేస్తున్నాం. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన కొబ్బరి కాయలు ఎగమతులు లేకపోవడం పెట్టుబడి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.– కామన రాంబాబు, కొబ్బరి వర్తకుల సంఘం కార్యదర్శి, భీమవరం నిలిచిన కొనుగోళ్లు ఈ నెల ప్రారంభంలో పది రోజుల పాటు కొబ్బరి వ్యాపారులు సమ్మె కారణంగా రైతుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సార్వా సీజన్ ప్రారంభం కావడంతో కొబ్బరిపై ఆదాయం వ్యవసాయానికి ఉపయోగించుకుంటాం. అయితే లారీల బంద్‌తో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నాం.– వేగేశ్న విజయరామరాజు, కొబ్బరి రైతు, కాళ్లకూరు -
కొబ్బరిపాలతో అందం
కొబ్బరిపాలల్లో కొంచెం పసుపు కలుపుకుని ముఖానికి, చేతులకు అప్లై చేసుకోవాలి. ఇది జీవంలేని పొడిచర్మానికి నిగారింపునిస్తుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.కొబ్బరిపాలల్లో గంధంపొడి కలిపి ముఖానికి అప్లై చేస్తే మచ్చలు తొలగిపోతాయి. కొబ్బరిపాలు, క్యారెట్ పేస్ట్ కలిపి ముఖానికి అప్లై చేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. -
టెంకాయల వేలం వాయిదా
గద్వాల న్యూటౌన: పుష్కరాల్లో నదీఅగ్రహరం పుష్కరఘాట్ వద్ద టెంకాలు విక్రయించేందుకు సోమవారం నిర్వహించిన వేలం పాట వాయిదా పడింది. దాదాపు రూ.5లక్షల వరకు వేలం ఖరారు చేయగా కేవలం కేవలం 1.2లక్షల వరకు మాత్రమే వేలందారులు పాడడంతో అధికారులు వాయిదా వేయాల్సి వచ్చింది. తిరిగి 6న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నదీఅగ్రహారం వద్ద శ్రీరామావధూత మఠం పరిధిలో వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకావం ఉందని అధికారులు భావిస్తూ ఈనెల 8 నుంచి 25వ తేదీ వరకు టెంకాయలు విక్రయించుకునేందుకు రూ. 50 వేల డిపాజిట్‌తో వేలానికి పిలిచారు. దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ శకుంతల, ఈఓ పురందర్ కుమార్‌లు వేలం పాట నిర్వహించగా కేవలం 1.2లక్షల వరకు మాత్రమే పాడారు. తక్కువ ఆదాయం రావడంతో అసిస్టెంట్ కమిషనర్ సూచన మేరకు వాయిదా వేశారు. ఇదిలావుండగా లడ్డు, పులిహోరను విక్రయించుకునేందుకు రూ.40వేల డిపాజిట్‌తో వేలం పాట నిర్వహించగా వరంగల్ జిల్లాకు చెందిన ప్రభాకర్ 3.35లక్షలకు పాడి దక్కించుకున్నారు. అలాగే కొబ్బరి చిప్పల సేకరణకు రూ.40వేకు నర్సింహ అనే వ్యక్తి రూ.41,500కు దక్కించుకున్నాడు. -
కొట్టకుండానే పగులుతున్న కొబ్బరికాయలు
నల్గొండ: ఎండలు భగ్గుమంటున్నాయనడానికి ప్రత్యేక్ష నిదర్శనమే ఇది. నల్గొండ జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన కొబ్బరికాయలు ఎండ వేడికి కొట్టకుండానే పగలిపోతున్నాయి. వివరాలు.. సిరిపురం గ్రామంలోని కుక్కడపు నాగేశ్వరరావు కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ షాపులో విక్రయ నిమిత్తం ఉంచిన కొబ్బరికాయలు బుధవారం మధ్యాహ్నం పగిలిపోయాయి. ఎండ వేడిమికి "మనుషులే తట్టుకోలేకుంటే.. కొబ్బరికాయలెంత" అని స్థానికులు వాపోతున్నారు. -
తిరుమలలో టెంకాయలు లేవు
తిరుమల: తిరుమలలో కొబ్బరి కాయల కొరత ఏర్పడింది. కలియుగ దైవం శ్రీవేంటేశ్వరస్వామి వారిని దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు దీంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. భక్తులు కర్పురం వెలిగించి... తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొబ్బరికాయలు స్టాక్ లేవని కౌంటర్లు వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర అసౌర్యానికి గురవుతున్నారు. మొక్కులు తీర్చుకునేందుకు ఎంతో దూరం నుంచి వచ్చామని... అయితే కొబ్బరికాయలు అందుబాటులో లేకపోవడంతో మొక్కులు సరిగ్గా తీర్చుకో లేకపోతున్నామని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కొబ్బరి ‘ధర’హాసం!
భారీగా పెరిగిన ధరలు రిటైల్ మార్కెట్లో రూ.20 పైమాటే నగరానికి తగ్గిన సరఫరా గ్రేటర్‌లోని దేవుళ్లు కొబ్బరికాయలు కొట్టే భక్తుల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్నటి వరకూ ఆలయాల్లోని దేవుళ్లకు భారీ ఎత్తున కొబ్బరి నీటితో అభిషేకం చేసి...ఆ ముక్కలను నైవేద్యంగా పెట్టే భక్తులు... ప్రస్తుతం అరటి పండ్లనో... మరో రూపంలోనో ప్రసాదం పెట్టి మమ అనిపించేస్తున్నారు. సామాన్యులైతే ‘ఈసారికి దండంతో సరిపెట్టుకో’మంటూ దేవుళ్లకు సర్ది చెప్పే పనిలో పడ్డారు. ఇదంతా అతిశయోక్తిలా అనిపించినా... దీని వెనుకనున్న వాస్తవం విస్మరించలేనిది. కొబ్బరి ధరల పెరుగుదల తీవ్రతను చాటిచెప్పేది. సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో కొబ్బరి కాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇవి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి సరఫరా తగ్గిపోవడంతో వీటికి కొరత ఏర్పడింది. డిమాండ్-సరఫరాల మధ్య అంతరంతో గత 15 రోజులుగా కొబ్బరి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ నాడు రూ.10 ఉన్న కొబ్బరికా య ధర ఇప్పుడు రెట్టింపైంది. నగరంలోని హోల్‌సేల్ దుకాణాల్లో గురువారం 100 కొబ్బరికాయలు రూ.1500 వంతున ప్రకారం విక్రయించారు. రిటైల్ మార్కెట్లోఒక్కో కొబ్బరికాయ (చిన్న సైజ్) ధర రూ.20... మీడియం సైజ్ కాయ రూ.22కు పైగా పలికింది. ఇక పెద్ద కొబ్బరి కాయల ధర ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ధరలు నగరమంతటా ఒకేలా లేవు. గిరాకీ, భక్తుల రద్దీని బట్టి ఒక్కో ఆలయం వద్ద ఒక్కో రకంగా వ్యాపారులు వసూలు చేస్తున్నారు. వీరి దోపిడీని అరికట్టే వారే ఉండడం లేదు. పెరిగిన ధరలను చూసి భక్తులు దేవునికి పండ్లు, పూలతో సరిపెడుతున్నారు. గుడికె ళ్లి కొబ్బరికాయ కొట్టకపోతే ఏదో వెలితిగా ఉందంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొన్ని రకాల వంటకాలకు ఎంత ధరైనా పెట్టి కొబ్బరి కాయలను కొనుగోలు చేయాల్సి వస్తోందని క్యాటరింగ్ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. హోటళ్ల మెనూల్లో కొబ్బరి చెట్నీకి ప్రత్యామ్నాయంగా అల్లం, చింతపండు తదితర పచ్చళ్లను మార్పు చేశారు. ఇళ్లలోనూ కొబ్బరి చెట్నీకి కరువొస్తోంది. ఎందుకిలా? హైదరాబాద్ నగరానికి ఉభ య గోదావరి, విశాఖ జిల్లాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కొబ్బరికాయలు దిగుమతి అవుతుంటాయి. అత్యధికంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచే వస్తాయి. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడం... నల్లి తెగులు సోకడంతో పంట దిగుబడి దారుణంగా పడిపోయినట్టు సమాచారం. దీనికి తోడు కొబ్బరి బోండాలకు మంచి డిమాండ్ ఉండటం... గిట్టుబాటు ధర వస్తుండటంతో చాలామంది రైతులు మధ్యలోనే పంట దించుతుండటంతో కొబ్బరికాయల ఉత్పత్తి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే విశాఖ జిల్లాలో ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తుపాన్ ప్రభావంతో కొబ్బరి తోటలు తుడిచిపెట్టుకు పోయాయి. ఆమేరకు నగరానికి కొంతమేర సరఫరా తగ్గిపోయింది. తూర్పు గోదావరి జిల్లాలోని అంబాజీపేట, రాజోలు, రావులపాలెంలలోనే కొబ్బరికాయలకు మంచి రేటు పలుకుతుండటంతో స్థానిక రైతులు, వ్యాపారులు నగరం వైపు చూడడం లేదు. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో టన్ను కొబ్బరికాయల ధర రూ.33 వేలు పలుకుతోంది. అక్కడ 100 కాయల ధర రూ.1800 వరకు ఉండటంతో నగరానికి దిగుమతి చేసుకొనేందుకు వ్యాపారులు ఇష్టపడట్లేదు. ఒకవేళ కొనుగోలు చేసినా సరుకు రవాణా, లోడింగ్/అన్లోడింగ్ వంటి వాటికి లారీకి రూ.5వేల వరకూ అదనంగా ఖర్చవుతుండడంతో వారు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల పైనే నగర కొబ్బరి మార్కెట్ ఆధారపడుతోంది. అక్కడి నుంచి సరఫరా తగ్గిపోవడంతో ఇక్కడ డిమాండ్... ధరలపై ప్రభావం పడుతోంది. -
టెంకాయలు నిషిద్ధం..
సాక్షి, ముంబై: ఉత్తర భారతదేశంలో సుప్రసిద్ధ దేవాలయంగా వినుతిగాంచిన నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయంలోకి కొబ్బరి కాయలు, పూలు, హారాలు, స్వీట్లు, పూజా సాహిత్యాన్ని నిషేధించారు. ఈ మేరకు ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీన్ని నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు ఇప్పటికే అక్కడక్కడ బోర్డులు, పోస్టర్లు ఏర్పాటుచేశారు. ఆలయ కమిటీ తీసుకున్న నిర్ణయంతో భక్తులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి త్రయంబకేశ్వరుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కేవలం నమస్కారంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆలయానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా కారణాల దృష్ట్యా ఈ కఠోర నిర్ణయం తీసుకోక తప్పలేదని కమిటీ స్పష్టం చేసింది. ప్రముఖ 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర్ ఒకటి. దీంతో ఈ ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు, నాసిక్‌లో పంచవటికి, శిర్డీకి వచ్చిన సాయి భక్తులు, ఇతర పర్యాటకులు ఈ త్రయంబకేశ్వర్‌ను సందర్శించకుండా వెళ్లరు. ఇక్కడే గోదావరి నది పుట్టిన విషయం తెలిసిందే. త్రయంబకేశ్వర్ ఆలయంలో ప్రత్యేక దర్శనం, వీఐపీ పాస్‌లు, డబ్బులు చెల్లించి శీఘ్ర దర్శనం లాంటి ప్రత్యేక సౌకర్యాలేమి లేవు. ఇక్కడ అందరు సమానమే. అందుకు దేవుని దర్శనం కోసం ఎవరైనా గంటల తరబడి క్యూలో నిలబడాల్సిందే. ఇలా అనేక ప్రత్యేకతలు ఈ ఆలయానికి ఉన్నాయి. ఈ ఆలయం కీర్తి దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతుండటంతో భక్తుల తాకిడి కూడా అధికమైంది. అదే స్థాయిలో ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని తరుచూ కేంద్ర గుడాచార నిఘా సంస్థ హెచ్చరిస్తూ వస్తోంది. అందుకు భద్రతలో అనేక మార్పులు చేయాలని సూచించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొబ్బరి కాయలు, పూలు, హారాలు, మిఠాయి బాక్స్‌లతో పాటు అర్చన సాహిత్యాన్ని జనవరి ఒకటో తేదీ నుంచి నిషేధిస్తున్నారు. ఇదిలా ఉండగా, అర్చన సామాగ్రిని నిషేధించడంలో వీటిపై ఆధారపడిన అనేక కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. ఆలయానికి సమీపంలో, వాహనాల పార్కింగ్ లాట్లో పూజా సామాగ్రి విక్రయించే వందలాది షాపులున్నాయి. వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. తాము ఉపాధి కోల్పోయి వీధిన పడతామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దుస్థితిలో శ్రీవారి అఖిలాండం
పవిత్ర ప్రదేశంలో అభివృద్ధి పనులను పట్టించుకోని అధికారులు కొబ్బరికాయలు కొట్టే రాతిబండలు విరిగిన వైనం దుర్గంధం.. ఈగల మోత.. అపరిశుభ్రత.. సాక్షి, తిరుమల : కోర్కెలుతీర్చే కొండలరాయునికి మొక్కులు చెల్లించే పవిత్రస్థలం అఖిలాండం దుస్థితిలో ఉంది. నిర్వహణ అధ్వానం గా ఉండటంతో సాక్షాత్తూ శ్రీవారి ఆలయం ఎదుటే ఉన్న శ్రీవారి ఆఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టే బండరాళ్లు రెండుగా విరిగిపోయాయి. కర్పూరం వెలిగించే దీపస్తంభాలు మసిబారాయి. అఖిలాండం చుట్టూ పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యా యి. అధికారులు పట్టించుకోవడం లేదు. భక్తిశ్రద్ధల తో మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తులు దుస్థితి లో ఉన్న అఖిలాండాన్ని చూసి ఆవేదన చెందుతున్నారు. అపవిత్రంగా అఖిలాండం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తుల్లో 75 శాతం మంది అఖిలాండంలో కర్పూరం వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లిస్తుంటారు. ఒకప్పుడు వెండివాకిలి వద్ద, తర్వాత ఆలయం వెలుపల, 2003 ముందు వరకు గొల్లమండపం వద్ద అఖిలాండం ఉండేది. వేయికాళ్ల మండపం తొలగించటం, సన్నిధి వీధి దుకాణాలను మార్పు చేయడంతో బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద పునర్నిర్మించారు. నిత్యం సుమారు 10 వేల నుంచి 20 వేల వరకు భక్తులు కొబ్బరికాయలు కొడుతుంటారు. దీనివల్ల ఇక్కడి రాతి బండలు పగిలిపోయాయి. మరికొన్ని బండరాళ్లు విడిభాగాలు ఊడిపోయాయి. గత ఏడాది రాళ్లపై ఇనుప కవచాలు వేసినా అవి విరిగిపోతున్నాయి. రోజూ 200 నుంచి 300 కిలోల వరకు కర్పూరం వెలిగించటం వల్ల దీప స్తంభాలు మసిబారిపోయాయి. ఇక్కడి పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. సెకన్ల వ్యవధిలో భక్తులు కొబ్బరికాయులు కొడుతూనే ఉంటారు. దీనివల్ల ఇక్కడ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. కొబ్బరినీళ్లు, పేరుకుపోయిన చెత్తాచెదారం వల్ల ఈగలమోత పెరిగిపోయింది. రోజూ నీటితో శుభ్రం చేయకపోవడంతో భక్తులు కాలిజారి కింద పడి గాయాలపాలవుతున్నారు. అభివృద్ధికి నోచుకోని అఖిలాండం పవిత్రస్థలంగా భావించే అఖిలాండం అభివృద్ధి, విస్తరణ పనులు టీటీడీ ఇంజనీర్లకు పట్టనట్టుంది. పెరిగిన భక్తులకు అనుగుణంగా అఖిలాండాన్ని విస్తరించాలని జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు ఆదేశించి ఏడాది అయినా సంబంధిత ఇంజినీర్లు ఏమాత్రం పట్టించుకోలేదు. భక్తుల మనోభావాలతో కూడిన అఖిలాండం బాగు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
వెంకన్నా క్షమించు
నీ పూజకు కొబ్బరి కాయల్లేవు కర్పూరంతో సర్దుకో భక్తుల ఆవేదన సాక్షి, తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి పూజకు కొబ్బరికాయల కొరత ఎదురైంది. శనివారం అఖిలాండం వద్ద భక్తులు కర్పూరం, అగరబత్తీలు మాత్రమే వెలిగించి అసంపూర్తిగా మొ క్కులు చెల్లించారు. ఆలయ అధికారులు మాత్రం పట్టీపట్టనట్టుగా ఉన్నారు. సాధారణంగా భక్తులు నడిచి తిరుమల కొండెక్కడం, కల్యాణకట్టల్లో తలనీలాలు సమర్పించడం, పుష్కరిణి స్నానం, శ్రీవారి దర్శనం, అఖిలాండం వద్ద కొబ్బరికాయ సమర్పించడం ఇక్కడి క్షేత్ర సంప్రదాయం. తిరుమలలో రోజులో స్వామిని దర్శించుకునే 60 వేల మందిలో 20 వేల మంది దాకా ఆలయ అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి పరిపూర్ణంగా మొక్కులు చేసుకుంటారు. కొబ్బరికాయలు విక్రయించేందుకు అఖిలాండం వద్ద టీటీడీ ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసింది. రూ.15 చొప్పున ఒక సెట్లో కొబ్బరికాయ, కర్పూరం, అగర్బత్తీ అందజేస్తుంది. మూడు రోజులుగా భక్తులు పోటెత్తారు. ముందుజాగ్రత్త లేకపోవడంతో మూడు రోజులుగా అఖిలాండం వద్ద కొబ్బరికాయలకు తీవ్ర కొరత ఏర్పడింది. అడపాదడపా కొబ్బరికాయలు వచ్చినా గంటలోపే అమ్ముడవుతున్నాయి. శనివారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొబ్బరికాయల్లేవు. కౌంటర్లు మూసివేయటంతో మొక్కు చెల్లించేందుకు వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇదే ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తులు విక్రయించే కర్పూరం వెలిగించి ‘క్షమించు స్వామి.. కొబ్బరికాయ లేదు. కర్పూరం మాత్రమే వెలిగించా.. సర్దుకో’ అంటూ తీవ్ర ఆవేదనతో తిరుగుముఖం పట్టారు. కొబ్బరికాయల కొరతపై ఆలయ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. తరచూ భక్తులకు ఎదురయ్యే కొబ్బరికాయల స్టాకు సమస్యను పరిష్కరించటంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. -
సీతారాముల కళ్యాణానికి మండ పేట కొబ్బరి బోండాలు
-
సామీ.. ఇదేమి దుర్గతి
=అపరిశుభ్రంగా అఖిలాండం =విరిగిన రాతిబండలు =పనికిరాకుండా పోయిన కర్పూర దీప స్తంభాలు తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట ఉన్న అఖిలాండం దుస్థితికి చేరుకుంది. కొబ్బరికాయలు కొట్టే బండరాళ్లు రెండుగా పగిలిపోయాయి. కర్పూరం వెలిగించే దీపపు స్తంభాలు విరిగి, మసిబారి పనికి రాకుండా పోయాయి. అఖిలాండం చుట్టూ పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. దీన్ని చూసి భక్తులు అసంతృప్తికి గురవుతున్నారు. సాక్షి, తిరుమల: భూ వరాహస్వామి, వేంకటేశ్వరస్వా మిని దర్శించుకున్న ప్రతి భక్తుడూ అఖి లాండం వద్ద కర్పూరం వెలిగించి, కొబ్బరికాయలు కొట్టడం సంప్రదాయం. 2003 ముం దు వరకు గొల్ల మండపం వద్ద ఉన్న అఖి లాండాన్ని వేయికాళ్ల మండపం తొలగించ డం, సన్నిధి వీధి దుకాణాలను మార్పు చేసిన సమయంలో బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద పునఃనిర్మించారు. పదేళ్లు గడిచినా టీటీడీ అధికారులు దృష్టి సారించకపోవడంతో ఈ ప్రదేశం దుస్థితికి చేరు కుంది. నిత్యం ఇక్కడ పది వేల నుంచి 20వేల వరకు కొబ్బరికాయలు కొట్టడం వల్ల రాతి బండలు పగిలిపోయాయి. మరి కొన్ని బండరాళ్లు విడిభాగాలు ఊడిపోయాయి. దీనివల్ల కొబ్బరికాయలు కొట్టేం దుకు భక్తులకు వీలులేకుండా పోతోంది. 200 నుంచి 300 కేజీల వరకు కర్పూరం వెలి గించడం వల్ల దీపపు స్తంభాలు విరిగిపోవడం, రంధ్రాలు పడడం, మసిబారిపోవడంతో పనికిరాకుండా పోయాయి. రోజూ టన్నుల కొబ్బరి లభ్యం శ్రీవారి అఖిలాండం వద్ద రోజూ టీటీడీకి రెండు నుంచి మూడు టన్నుల కొబ్బరి లభిస్తోంది. కొబ్బరి చిప్పలను రెండురోజులకొకసారి సేకరించి, నిత్యాన్నదాన సముదాయానికి తరలించి వంటల్లో వాడుతారు. ఆలయంలోకి వెళ్లలేని భక్తులు అఖిలాండం వద్ద ఉన్న హుండీలో కానుకలు, పత్రాలు సమర్పిస్తుం టారు. వాటిని కూడా టీటీడీ సేకరించి ఆల యానికి తరలిస్తోంది. పట్టించుకోని అధికారులు రోజూ 20 వేల మంది పైగా భక్తులు సందర్శించే అఖిలాండం అభివృద్ధికి నోచుకోవడం లేదు. కొబ్బరికాయల నీరు, కర్పూరపు పొగ, మసి, ఇతరత్రా వ్యర్థ పదార్థాల వల్ల పరిసరాలు దుర్గంధంతో నిండుతున్నాయి. ఈగల మోత పెరిగిపోయింది. దీంతో భక్తులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.