‘కొబ్బరి’కి మొలకలు.. రైతులకు కన్నీళ్లు | Drastic Decline Of Coconut Price | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 7 2018 10:03 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

Drastic Decline Of Coconut Price - Sakshi

సాక్షి, అమలాపురం: కొబ్బరికాయలకు మొలకలొస్తున్నాయి. నర్సరీ రైతులైతే వీటిని చూసి సంతోషించేవారు కానీ రెండు నెలలుగా సరైన అమ్మకాలు లేక కొబ్బరి రాశుల్లో వస్తున్న మొలకలను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. అన్ని ఉద్యాన పంటలు గత ఏడాది కాలంగా సంక్షోభంలో ఉండగా.. కొబ్బరి దిగుబడితో పాటు ధర బాగా ఉందని రైతులు మురిసిపోయారు. ఆ సంతోషంపై నీళ్లు జల్లుతూ గత కొంతకాలంగా కొబ్బరి ధర నేల చూపులను చూస్తోంది. రాష్ట్రంలో 2.45 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగు జరుగుతోంది. ఇళ్ల వద్ద, చెరువు గట్లు, రహదారులకు ఇరువైపులా ఉన్న చెట్లను పరిగణనలోకి తీసుకుంటే మరో 40 వేల ఎకరాల తోటలున్నట్టు అంచనా. ఏడాదికి సగటున 213.50 కోట్ల కాయల దిగుబడి వస్తోంది. రాష్ట్రంలో 9 జిల్లాల్లో కొబ్బరిసాగు జరుగుతున్నా దానిలో 2.37 లక్షల ఎకరాలు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నాయి.

ఇటీవల తిత్లీ తుపాను వల్ల ఉద్ధానం ప్రాంతంలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో 27 వేల ఎకరాలకు పైబడి కొబ్బరి దెబ్బతింది. చెట్లున్నచోట మరో రెండేళ్లపాటు కాలం దిగుబడి రాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో దిగుబడి ఉన్నా.. ధర లేక రైతులు లబోదిబోమంటున్నారు. గతేడాది ఈ సీజన్‌లో వెయ్యి పచ్చికాయల ధర రూ.13 వేల 500 వరకు ఉండగా.. అంబాజీపేట మార్కెట్‌లో ఇప్పుడు రూ.6 వేలకు పడిపోయింది. ధర పతనమైనా కొబ్బరి కొనేవారు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఇళ్ల వద్ద రెండు దింపుల రాశులు పేరుకుపోయాయి. వర్షాలకు వాటికి మొలకలు వస్తున్నాయి. ప్రతి 100 కాయలకు 20 కాయలు మొలకలు వస్తున్నాయి. దీనిని ఎండు కొబ్బరిగా చేసినా కాయకు మూడు రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. దీనివల్ల రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. సాధారణంగా శ్రావణమాసం.. దీపావళి.. కార్తిక మాసాల్లో ధరలు పెరుగుతుంటాయి. ఈసారి అది కూడా లేదు.

పెట్టుబడులు కూడా రావడం లేదు...
ఇటీవల కూలిరేట్లు, దింపు, వలుపు కార్మికుల జీతాలు, ఎరువుల ధరలు పెరగడం వల్ల కొబ్బరి సగటు పెట్టుబడి ఎకరాకు రూ. 50 వేల వరకు అవుతోంది. కానీ ఇప్పుడున్న ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఎకరాకు సగటు దిగుబడి 7 వేల కాయలు కాగా, రూ. 42 వేలు మాత్రమే ఆదాయం వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పాస్‌ విధానానికి వ్యతిరేకంగా జూలై ఒకటిన ఆరంభమైన సమ్మె ఇంచుమించు నెలాఖరు వరకూ కొనసాగింది.

అదే నెల 26 నుంచి దేశవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల సమ్మె, ఆగస్టు ఒకటి నుంచి ప్రాంతాల వారీగా వలుపు కార్మికులు సమ్మె.. ఇలా వరుసగా వ్యాపారాలు మూతపడడంతో ఎక్కడి కొబ్బరి అక్కడే నిలిచిపోయింది. దీనిని అందిపుచ్చుకున్న తమిళనాడు వ్యాపారులు ఉత్తరాదికి భారీగా ఎగుమతులు చేశారు. దీనివల్ల ధర తగ్గిపోయింది. ధర పడిపోయిన నేపథ్యంలో 2005లో అప్పటి సీఎం, దివంగత నేత డాక్టర్‌ వైఎస్సార్‌ హయాంలో కొనుగోలు చేసినట్టుగా పచ్చి కొబ్బరిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుత ధరలును బట్టి కేజీ రూ. 34 చేసి కొనాలని, జనవరి నుంచి నాఫెడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement