అమలాపురం, న్యూస్‌లైన్ : ‘పెద్ద పండుగ’కు పల్లె ముస్తాబయింది. సంక్రాంతి రావడంతో పచ్చని పల్లెలు.. ఇళ్లు.. కొత్తశోభను సంతరించుకున్నాయి. కుటుంబ సభ్యులు.. బంధువులు.. కొత్త అల్లుళ్ల రాకతో సందడిగా మారాయి. ముంగిళ్లలో రంగుల హరివిల్లులు.. గొబ్బెమ్మలు.. కొత్తగా వేసిన రంగులతో ఇళ్లు కొంగ్రొత్త సొగసును సంతరించుకున్నాయి. తాతా, మమ్మా, పిల్లలు, మనవలు చేరి పండుగ సందడిలో మునిగితేలుతున్నారు.
అయితే అసలు పండుగ చేసుకోవాల్సిన ‘రైతన్న’ వరుస నష్టాల్లో మునిగిపోవడంతో గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది జిల్లాలో పండుగ సందడి అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఏడాది సంక్రాంతి కొంత వన్నెతగ్గడంతోపాటు గందరగోళం కూడా నెలకొంది. 13న భోగి అని ఒకరు, కాదు 14న అని మరొకరు చెబుతుండడంతో భోగిమంటలు వేసేదెప్పుడో తెలియకుండా పోయింది. ఎక్కువమంది 14న భోగిమంటలు వేయనున్నారు.
అష్టకష్టాలు పడి...
పండుగ కోసం సుదూర ప్రాంతాల వాసులు అష్టకష్టాలు పడి రెక్కలు కట్టుకుని వాలిపోయారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇతర దేశాల్లో ఉన్నవారు సైతం పండుగకు ముందే చేరుకున్నారు. రైళ్లు, బస్సులు సరిపోకపోవడంతో టిక్కెట్ ధరలను రెండు, మూడు రెట్లు పెంచినా పండగ మూడు రోజులూ సొంత ఊరిలో గడపాలని మక్కువతో ఇబ్బందులు ఎదురైనా లెక్కచేయకుండా తరలివచ్చారు. వీరు వచ్చిన తరువాతే జిల్లాలో ప్రధానంగా వస్త్ర దుకాణాలు కళకళలాడాయి.
అన్నదాతల్లో కానరాని సందడి
సంక్రాంతి రైతుల పండుగ. అయితే ఆ రైతు తప్ప అందరూ పండుగ సందడిలో నిమగ్నమవడం దురదృష్టం. వరుస విపత్తులతో చిత్తయి అన్నదాత పండగకు దూరమయ్యాడు. హెలెన్ తుపాను వల్ల ఖరీఫ్ పంట తుడిచిపెట్టుకుపోవడం, వరితోపాటు అన్న రకాల పంటలు దెబ్బతినడం, కొబ్బరికి సైతం అంతులేని నష్టం వాటిల్లడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దీనికితోడు పండుగ నాడు రబీ నాట్లు వేసేందుకు అప్పులమీద అప్పులు చేయాల్సి రావడంతో రైతు సంక్రాంతిని చేసుకోలేకపోతున్నాడు. భూస్వాములే అప్పోసొప్పో చేసి తప్పదన్నట్టుగా పండుగ చేసుకుంటున్నారు. సంక్రాంతి నాడు వస్త్రాలు, బంగారం, వాహనాలు కొనుగోలు చేయడంలో రైతులదే అగ్రస్థానం. ఇప్పుడు వారు పండుగకు దూరమవడంతో ఆ రంగాల్లో వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ధరల ప్రభావం
పెరిగిన ధరలు సైతం సామాన్యుడిని పండుగకు దూరం చేశాయి. నూనె, పప్పులు, పిండిల ధరలు అనూహ్యం పెరగడంతో పిండివంటలు చేసుకునేందుకు సైతం సామాన్యులు వెనకాడుతున్నారు. కాయగూరలు, మసాలా దినుసుల ధరలు సైతం ఆకాశంలో ఉన్నాయి. అటు నూతన వస్త్రాల ధరలు సైతం పెరగడంతో సామాన్యులు సాధ్యమైనంత వరకు కొనుగోళ్లు తగ్గించుకున్నారు. దీనితో వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లేక వ్యాపారులు దిగాలుపడ్డారు.
ప్రభల తీర్థాలకు ఏర్పాట్లు
సంక్రాంతి నాడు పచ్చని కోనసీమలో జరిగే ప్రభల తీర్థాలకు నిర్వాహకులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ప్రభలు తయారు చేసేందుకు అన్ని వస్తువులు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా అంబాజీపేట మండలం జగ్గన్నతోట, కొత్తపేట, మామిడికుదురు మండలం కొర్లగుంటల్లో జరిగే తీర్థాలకు నిర్వహకులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. సంప్రదాయంగా భోగి ముందు రోజున ప్రభలు కట్టే పని ఆరంభిస్తారు. ఈ కారణంగా సోమవారం నుంచి ప్రభలు కట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
కొడి పందాలకు రె‘ఢీ’
పండుగనాడు ఏమున్నా లేకున్నా కోడిపందాలుంటే చాలన్నట్టుగా పందెంరాయుళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతి ఏడులాగే ఈసారి కూడా కోడిపందాలు పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జరగనిచ్చేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నా జంకేదిలేదని తేల్చేస్తున్నారు. అల్లవరం మండలం గోడిలంక, ఐ.పోలవరం మండలం కేశనకుర్రు, ఆత్రేయపురం, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, కాట్రేనికోన, మలికిపురం తదితర ప్రాంతాల్లో పందాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పెద్దోళ్లతో మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నారు.
తుళ్లిపడుతున్న పల్లెలు
Published Mon, Jan 13 2014 3:27 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM
Advertisement