coconut price
-
నారికేళం ‘ధర’హాసం
సాక్షి అమలాపురం/అంబాజీపేట: కొబ్బరి ధర పతనమై రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నాఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేయించింది. దీంతో కొబ్బరి ధరలు అమాంతంగా పెరిగాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తరువాత పచ్చి కొబ్బరి వెయ్యి కాయలకు రూ.రెండు వేల వరకు ధర పెరగ్గా.. ఎండు కొబ్బరి క్వింటాల్‌కు రూ.500 చొప్పున పెరగడం విశేషం. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా.. ఉభయ గోదావరి జిల్లాలలోనే అత్యధికంగా 1.78 లక్షల ఎకరాల్లో ఉంది. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం సగటున 106.9 కోట్ల కాయల దిగుబడిగా వస్తోంది. ఇందులో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1.03 లక్షల ఎకరాలు, కాకినాడ జిల్లాలో 20 వేల ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 18,754 ఎకరాల్లో సాగు కొబ్బరి సాగవుతోంది. నాఫెడ్ కేంద్రాలు.. వరుస పండుగలతో.. రాష్ట్రంలో కొబ్బరి మార్కెట్ ధరలు అంబాజీపేట మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి. కొబ్బరి ధరలు పతనం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కోనసీమ జిల్లాలో నాఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేయించింది. ప్రస్తుతానికి అంబాజీపేట మార్కెట్ యార్డు కేంద్రంగా కార్యకలాపాలకు అధికారులు సిద్ధమయ్యారు. తొలిసారి ఆర్బీకేల ద్వారా కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మిల్లింగ్ కోప్రా (ఎండు కొబ్బరి)ను క్వింటాల్‌ను రూ.10,860, బాల్ కోప్రా (కురిడీ కొబ్బరి గుడ్డు) క్వింటాల్ రూ.11,750 చొప్పున ధర చెల్లించి కొనుగోలు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో కొబ్బరి మార్కెట్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఈ పరిస్థితుల్లో స్థానిక వ్యాపారులు దిగి వచ్చి ధరలు పెంచారు. మరోవైపు దసరా, దీపావళి, కార్తీక మాసం రావడంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు జోరందుకున్నాయి. దీంతో పచ్చికాయ, ముక్కుడు కాయల ధరలు పెరిగాయి. ప్రస్తుత మార్కెట్లో వెయ్యి కాయల ధర రూ.8 వేల నుంచి రూ.8,500 వరకు ఉంది. గడచిన 10 రోజులలో ధర రూ.2 వేల వరకు పెరగడం విశేషం. -
Coconut: కొబ్బరికి కరోనా దెబ్బ
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి ప్రభావం కొబ్బరి ధరలపైనా పడింది. కొబ్బరిని ఉత్పత్తి చేస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో 15 రోజులుగా ధరల్లో ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. కొబ్బరిని ఎక్కువగా ఉత్పత్తి చేసే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ సంకట స్థితి తలెత్తినట్టు వ్యాపార, రైతు వర్గాలు చెబుతున్నాయి. మిల్లింగ్ కొబ్బరి (డ్రై కోప్రా) కొనుగోళ్లు ప్రారంభం కానున్న తరుణంలో మిల్లింగ్ కొబ్బరి ధర తగ్గింది. కొబ్బరి గుండ్రాల (బాల్ కోప్రా) ధర మాత్రం నిలకడగా ఉంది. 15 రోజుల్లో మిల్లింగ్ కోప్రా ధర క్వింటాల్‌కి రూ.600కు పైగా తగ్గినట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్లో రెండు వారాల కిందట రూ.13,100 ఉన్న క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరి ధర ఇప్పుడు రూ.12 వేల నుంచి రూ.12,550 మధ్య ఉంది. కొబ్బరి మార్కెట్‌కు పేరుగాంచిన కేరళ, తమిళనాడుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కొత్త కొబ్బరి మార్కెట్‌కు వస్తున్న సమయంలో ధరలు పతనం కావడం రైతుల్ని కలవరపెడుతోంది. తెల్లదోమ దెబ్బ మరువక ముందే.. ఇప్పటికే తెల్లదోమ తెగులుతో కొబ్బరి పంట బాగా దెబ్బతింది. దిగుబడి గణనీయంగా తగ్గింది. ఇదే సమయంలో వ్యాపారులు నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాల సాకుతో కొబ్బరి ధర తగ్గిస్తున్నారు. దీనికి కరోనా రెండోదశ విజృంభణ, జాతీయ, అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు తోడుకావడంతో కొబ్బరి ధర మరింత తగ్గింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే నాఫెడ్ ద్వారా కొబ్బరిని కొనుగోలు చేయించాలని రైతులు కోరుతున్నారు. తగ్గిన వినియోగం.. కొబ్బరి నూనె ధర పెరుగుదలతో మార్కెట్లో అమ్మకాలు కూడా తగ్గాయని కొబ్బరి నూనె వ్యాపారి టి.సుబ్బారావు చెప్పారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఇటీవలి కాలంలో కొబ్బరి నూనె వాడకం పెరిగినా ధరల పెంపుతో వినియోగదారులు ప్రత్యామ్నాయంగా చౌకగా దొరికే నూనెల వైపు మళ్లారని పేర్కొన్నారు. అయితే కోవిడ్ మహమ్మారితో ఎగుమతి దిగుమతుల్లో ఏర్పడిన ఇబ్బందులతో అన్ని రకాల వంట నూనెల ధరలు పెరిగాయి. వర్జిన్ కోకోనట్ ఓకే.. మరోపక్క స్వచ్ఛమైన కొబ్బరి నూనె (వర్జిన్ కోకోనట్ ఆయిల్) కోవిడ్ చికిత్సకు పనికి వస్తుందని పరిశోధనల్లో తేలడంతో క్రూడ్ కోకోనట్ ఆయిల్‌కు ప్రధాన కేంద్రమైన ఫిలిప్పీన్స్‌లో ధరలు పెరిగాయి. టన్ను వర్జిన్ కోకోనట్ ఆయిల్ ధర ఈ నెలలో 1,400 డాలర్ల నుంచి 1,800 డాలర్లకు చేరింది. వియత్నాం, థాయ్‌లాండ్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా దాదాపు అదేవిధంగా ఉన్నట్లు ఆయిల్ మర్చంట్స్ అసోసియేషన్ తెలిపింది. నిలకడగా బాల్ కోప్రా.. బాల్ కోప్రా ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయి. కర్ణాటకలోని తిప్తూర్ మార్కెట్లో బాల్ కోప్రా క్వింటాల్ ధర రూ.15,600 నుంచి రూ.15,900 మధ్య ఉంది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే మొత్తం కొబ్బరిలో 39 శాతం మాత్రమే కొబ్బరిగా మారుతుంది. అది సుమారు 15 మిలియన్ టన్నులు. ఇందులో 23 శాతాన్ని ఎండు కొబ్బరిగా గృహ అవసరాలకు వినియోగిస్తారు. మిగతా 77% వంట నూనెల తయారీకి వాడతారు. -
‘కొబ్బరి’కి మొలకలు.. రైతులకు కన్నీళ్లు
సాక్షి, అమలాపురం: కొబ్బరికాయలకు మొలకలొస్తున్నాయి. నర్సరీ రైతులైతే వీటిని చూసి సంతోషించేవారు కానీ రెండు నెలలుగా సరైన అమ్మకాలు లేక కొబ్బరి రాశుల్లో వస్తున్న మొలకలను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. అన్ని ఉద్యాన పంటలు గత ఏడాది కాలంగా సంక్షోభంలో ఉండగా.. కొబ్బరి దిగుబడితో పాటు ధర బాగా ఉందని రైతులు మురిసిపోయారు. ఆ సంతోషంపై నీళ్లు జల్లుతూ గత కొంతకాలంగా కొబ్బరి ధర నేల చూపులను చూస్తోంది. రాష్ట్రంలో 2.45 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగు జరుగుతోంది. ఇళ్ల వద్ద, చెరువు గట్లు, రహదారులకు ఇరువైపులా ఉన్న చెట్లను పరిగణనలోకి తీసుకుంటే మరో 40 వేల ఎకరాల తోటలున్నట్టు అంచనా. ఏడాదికి సగటున 213.50 కోట్ల కాయల దిగుబడి వస్తోంది. రాష్ట్రంలో 9 జిల్లాల్లో కొబ్బరిసాగు జరుగుతున్నా దానిలో 2.37 లక్షల ఎకరాలు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నాయి. ఇటీవల తిత్లీ తుపాను వల్ల ఉద్ధానం ప్రాంతంలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో 27 వేల ఎకరాలకు పైబడి కొబ్బరి దెబ్బతింది. చెట్లున్నచోట మరో రెండేళ్లపాటు కాలం దిగుబడి రాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో దిగుబడి ఉన్నా.. ధర లేక రైతులు లబోదిబోమంటున్నారు. గతేడాది ఈ సీజన్లో వెయ్యి పచ్చికాయల ధర రూ.13 వేల 500 వరకు ఉండగా.. అంబాజీపేట మార్కెట్లో ఇప్పుడు రూ.6 వేలకు పడిపోయింది. ధర పతనమైనా కొబ్బరి కొనేవారు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఇళ్ల వద్ద రెండు దింపుల రాశులు పేరుకుపోయాయి. వర్షాలకు వాటికి మొలకలు వస్తున్నాయి. ప్రతి 100 కాయలకు 20 కాయలు మొలకలు వస్తున్నాయి. దీనిని ఎండు కొబ్బరిగా చేసినా కాయకు మూడు రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. దీనివల్ల రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. సాధారణంగా శ్రావణమాసం.. దీపావళి.. కార్తిక మాసాల్లో ధరలు పెరుగుతుంటాయి. ఈసారి అది కూడా లేదు. పెట్టుబడులు కూడా రావడం లేదు... ఇటీవల కూలిరేట్లు, దింపు, వలుపు కార్మికుల జీతాలు, ఎరువుల ధరలు పెరగడం వల్ల కొబ్బరి సగటు పెట్టుబడి ఎకరాకు రూ. 50 వేల వరకు అవుతోంది. కానీ ఇప్పుడున్న ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఎకరాకు సగటు దిగుబడి 7 వేల కాయలు కాగా, రూ. 42 వేలు మాత్రమే ఆదాయం వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పాస్ విధానానికి వ్యతిరేకంగా జూలై ఒకటిన ఆరంభమైన సమ్మె ఇంచుమించు నెలాఖరు వరకూ కొనసాగింది. అదే నెల 26 నుంచి దేశవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల సమ్మె, ఆగస్టు ఒకటి నుంచి ప్రాంతాల వారీగా వలుపు కార్మికులు సమ్మె.. ఇలా వరుసగా వ్యాపారాలు మూతపడడంతో ఎక్కడి కొబ్బరి అక్కడే నిలిచిపోయింది. దీనిని అందిపుచ్చుకున్న తమిళనాడు వ్యాపారులు ఉత్తరాదికి భారీగా ఎగుమతులు చేశారు. దీనివల్ల ధర తగ్గిపోయింది. ధర పడిపోయిన నేపథ్యంలో 2005లో అప్పటి సీఎం, దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ హయాంలో కొనుగోలు చేసినట్టుగా పచ్చి కొబ్బరిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ధరలును బట్టి కేజీ రూ. 34 చేసి కొనాలని, జనవరి నుంచి నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. -
ఆశలన్నీ ‘నాఫెడ్’ పైనే..
ధర పతనంతో కొబ్బరి రైతుల దిగాలు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వినతి త్వరలో రానున్న ఆయిల్‌ఫెడ్ అధికారులు అమలాపురం : కొబ్బరి ధర రానురాను పతనమవుతుండడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి కొనుగోలుకు నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎండు కొబ్బరి (తయారీ కొబ్బరి) కొనుగోలు చేస్తే ధరలు నిలకడగా ఉంటాయని ఆశిస్తున్నారు. కేంద్రాల ఏర్పాటుకు కృషి చేయాలని జిల్లాకు చెందిన కొబ్బరి రైతులు ఇటీవల కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయిల్‌ఫెడ్ అధికారులు కోనసీమలో పర్యటించనున్నట్టు ప్రచారం జరగడంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాగలవన్న ఆశ మరింతగా చిగురిస్తోంది. అంబాజీపేట మార్కెట్లో పచ్చికొబ్బరి వెయ్యి కాయల ధర రూ.4,200 నుంచి రూ.4,500 వరకు ఉంది. తయారీ కొబ్బరి ధర రూ.ఆరు వేలకు చేరింది. దీనితో నాఫెడ్ ద్వారా ఎండుకొబ్బరి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా ఎండుకొబ్బరి క్వింటాల్ రూ.5,950కి, బాల్‌కోప్రా (కొబ్బరి గుడ్డు)ను రూ.6,240కి కొనుగోలు చేస్తారు. ఇప్పుడు మార్కెట్లో ఎండుకొబ్బరి ధర రూ.5,500 నుంచి రూ.6 వేల వరకు ఉంది. నాఫెడ్ కేంద్రాల కొనుగోలుతో రైతులకు నేరుగా కలిగే ప్రయోజనం పెద్దగా లేకున్నా మార్కెట్లో ధర పతనం ఆగుతుంది. అంతేకాక కొబ్బరి కొనుగోలులో పోటీ వల్ల క్రమంగా ధర పెరుగుతుంది. 120 రోజుల పాటు కొనాలి.. ఉభయ గోదావరి జిల్లాల్లో గతంలో ఆరు నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. ఈ కేంద్రాల ద్వారా రోజుకు దాదాపు 6,600 టన్నుల క్వింటాళ్ల ఎండుకొబ్బరి కొనుగోలు చేసేవారు. నాఫెడ్ కేంద్రాల కొనుగోలుతో బహిరంగ మార్కెట్లో ఎండు కొబ్బరికి డిమాండ్ వచ్చి ధర భారీగా పెరిగేది. ఈ కారణంగానే రైతులు నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్), కోనసీమకు చెందిన రైతు సంఘం ప్రతినిధులు ఇటీవల కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్‌ను కలిసి నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాఫెడ్ పెట్టిన 90 రోజుల కొనుగోలు నిబంధనను మార్పు చేసి 120 రోజుల కొనుగోలుకు అనుమతించేలా చూడాలని కోరగా, నాఫెడ్ ఉన్నతాధికారులతో మాట్లాడతానని కలెక్టర్ హామీ ఇచ్చారు. నాఫెడ్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పరిశీలించాలని కలెక్టర్ నాఫెడ్, ఆయిల్ ఫెడ్ అధికారులకు నివేదించనున్నారు. ఆయిల్‌ఫెడ్ నివేదికే కీలకం.. నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఆయిల్‌ఫెడ్‌కు చెందిన అధికారుల బృందం కోనసీమలో త్వరలో పర్యటించనున్నట్టు సమాచారం. కొబ్బరి కొనుగోలు, రైతులకు నగదు చెల్లింపులు నాఫెడ్ ఆధ్వర్యంలో జరిగినా, కొబ్బరి నాణ్యత పరిశీలన ఆయిల్ఫెడ్దే. ఈ కారణంగా ఆయిల్‌ఫెడ్ అధికారుల బృందం కోనసీమలో పర్యటించి ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కొబ్బరి నాఫెడ్ నిబంధనలకు అనువుగా ఉందోలేదో నిర్ధారించనుంది. వీరు ఇచ్చే నివేదిక ఆధారంగానే నాఫెడ్ కేంద్రాల ఏర్పాటు జరగనుంది.