వెయ్యి కాయలు రూ.15,500 నుంచి రూ.16 వేలు
కుంభమేళాకు తోడు మహాశివరాత్రి ఎఫెక్ట్‌తో పెరిగిన ధర
సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
సాక్షి, అమలాపురం: కొబ్బరికాయ ధరల పెరుగుదలతో కొబ్బరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎక్కడైన దిగుబడి ఉంటే... ధర ఉండదు.. కానీ కొబ్బరి విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. కొబ్బరికాయల దిగుబడి రెట్టింపు కాగా, ధర పెరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మార్కెట్‌లో కొబ్బరి కాయల ధర మరింత పెరిగింది. వెయ్యి కాయల ధర రూ.15,500 నుంచి రూ.16 వేలకు చేరుకుంది. కొంతమంది రైతులు రూ.16,500లకు కూడా విక్రయిస్తున్నారు.
గతేడాది వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.18 వేల వరకూ పెరిగిన విషయం తెలిసిందే. తరువాత క్రమేణా రూ.14 వేలకు తగ్గింది. కుంభమేళా మొదలైన తరువాత కొబ్బరి కాయ ధర రూ.15 వేలకు చేరింది. గత నెల నుంచి కొబ్బరి దిగుబడి రెట్టింపయ్యింది. ఎకరాకు 400 నుంచి 600 వరకూ ఉండే కాయ దిగుబడి ఇప్పుడు 800 నుంచి 1000 వరకూ వస్తోంది.
సాధారణంగా దిగుబడి పెరిగితే ధర తగ్గుతుందని రైతులు భావించారు. కానీ కుంభమేళాకు తోడు మహా శివరాత్రి పర్వదినం రానుండటంతో పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి.
దక్షిణాదిలో తగ్గిన దిగుబడి
దీనికితోడు దక్షిణాదిలో కొబ్బరి అధికంగా పండే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడం వల్ల కూడా రాష్ట్రంలో కొబ్బరికాయకు డిమాండ్ ఏర్పడింది. కుంభమేళాలో కురిడీ కొబ్బరి వినియోగిస్తూండగా, పచ్చికాయను శివరాత్రికి అధికంగా వినియోగించనున్నారు.
కొబ్బరి రైతుల్లో ఆనందం
ఉత్తరాదిలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఒడిశాకు కొబ్బరి జోరుగా ఎగుమతి అవుతోంది. కోనసీమ జిల్లాలోని అంబాజీపేట, ముమ్మిడివరం, ఐ.పోలవరం, పి.గన్నవరం, కొత్తపేట, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, విజయరాయి, తూర్పు గోదావరి జిల్లా చాగల్లు, నిడదవోలు, దేవరపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు తదితర మండలాల నుంచి రోజుకు 70 లారీలకు పైబడి పచ్చి కొబ్బరికాయ ఎగుమతి అవుతోందని అంచనా.
కొబ్బరి దిగుబడి, ధర పెరగడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని సుమారు 1.40 లక్షల మంది రైతులకు ఊరటనిచి్చంది. ఈ రెండు జిల్లాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. శివరాత్రి వరకూ మార్కెట్‌లో ఇదే సందడి ఉండవచ్చని రైతులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment