ఆశలన్నీ ‘నాఫెడ్’ పైనే..
ధర పతనంతో కొబ్బరి రైతుల దిగాలు
కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వినతి
త్వరలో రానున్న ఆయిల్‌ఫెడ్ అధికారులు
అమలాపురం : కొబ్బరి ధర రానురాను పతనమవుతుండడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి కొనుగోలుకు నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎండు కొబ్బరి (తయారీ కొబ్బరి) కొనుగోలు చేస్తే ధరలు నిలకడగా ఉంటాయని ఆశిస్తున్నారు. కేంద్రాల ఏర్పాటుకు కృషి చేయాలని జిల్లాకు చెందిన కొబ్బరి రైతులు ఇటీవల కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయిల్‌ఫెడ్ అధికారులు కోనసీమలో పర్యటించనున్నట్టు ప్రచారం జరగడంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాగలవన్న ఆశ మరింతగా చిగురిస్తోంది.
అంబాజీపేట మార్కెట్‌లో పచ్చికొబ్బరి వెయ్యి కాయల ధర రూ.4,200 నుంచి రూ.4,500 వరకు ఉంది. తయారీ కొబ్బరి ధర రూ.ఆరు వేలకు చేరింది. దీనితో నాఫెడ్ ద్వారా ఎండుకొబ్బరి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా ఎండుకొబ్బరి క్వింటాల్ రూ.5,950కి, బాల్‌కోప్రా (కొబ్బరి గుడ్డు)ను రూ.6,240కి కొనుగోలు చేస్తారు. ఇప్పుడు మార్కెట్‌లో ఎండుకొబ్బరి ధర రూ.5,500 నుంచి రూ.6 వేల వరకు ఉంది. నాఫెడ్ కేంద్రాల కొనుగోలుతో రైతులకు నేరుగా కలిగే ప్రయోజనం పెద్దగా లేకున్నా మార్కెట్‌లో ధర పతనం ఆగుతుంది. అంతేకాక కొబ్బరి కొనుగోలులో పోటీ వల్ల క్రమంగా ధర పెరుగుతుంది.
120 రోజుల పాటు కొనాలి..
ఉభయ గోదావరి జిల్లాల్లో గతంలో ఆరు నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. ఈ కేంద్రాల ద్వారా రోజుకు దాదాపు 6,600 టన్నుల క్వింటాళ్ల ఎండుకొబ్బరి కొనుగోలు చేసేవారు. నాఫెడ్ కేంద్రాల కొనుగోలుతో బహిరంగ మార్కెట్‌లో ఎండు కొబ్బరికి డిమాండ్ వచ్చి ధర భారీగా పెరిగేది. ఈ కారణంగానే రైతులు నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్), కోనసీమకు చెందిన రైతు సంఘం ప్రతినిధులు ఇటీవల కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్‌ను కలిసి నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాఫెడ్ పెట్టిన 90 రోజుల కొనుగోలు నిబంధనను మార్పు చేసి 120 రోజుల కొనుగోలుకు అనుమతించేలా చూడాలని కోరగా, నాఫెడ్ ఉన్నతాధికారులతో మాట్లాడతానని కలెక్టర్ హామీ ఇచ్చారు. నాఫెడ్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పరిశీలించాలని కలెక్టర్ నాఫెడ్, ఆయిల్ ఫెడ్ అధికారులకు నివేదించనున్నారు.
ఆయిల్‌ఫెడ్ నివేదికే కీలకం..
నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఆయిల్‌ఫెడ్‌కు చెందిన అధికారుల బృందం కోనసీమలో త్వరలో పర్యటించనున్నట్టు సమాచారం. కొబ్బరి కొనుగోలు, రైతులకు నగదు చెల్లింపులు నాఫెడ్ ఆధ్వర్యంలో జరిగినా, కొబ్బరి నాణ్యత పరిశీలన ఆయిల్‌ఫెడ్‌దే. ఈ కారణంగా ఆయిల్‌ఫెడ్ అధికారుల బృందం కోనసీమలో పర్యటించి ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కొబ్బరి నాఫెడ్ నిబంధనలకు అనువుగా ఉందోలేదో నిర్ధారించనుంది. వీరు ఇచ్చే నివేదిక ఆధారంగానే నాఫెడ్ కేంద్రాల ఏర్పాటు జరగనుంది.