శుక్రవారం గడ్డిఅన్నారం మార్కెట్లో పేరుకుపోయిన బత్తాయి నిల్వలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చేపట్టిన లారీల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. ఎనిమిది రోజులపాటు దేశంలో ఎక్కడికక్కడ స్తంభించిన రవాణా ఇక కదలనుంది. సమ్మె విరమణ ప్రకటనతో అర్ధరాత్రి నుంచే లారీలు రోడ్డెక్కాయి. డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో లారీల యజమానులు సమ్మె విరమించారు.
డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి చేర్చాలన్న ప్రధాన డిమాండ్‌తో జూలై 20న ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో 93 లక్షల లారీలు రోడ్లపైనే ఆగిపోయాయి. అత్యవసర సర్వీసుల ట్రక్కులు మాత్రం సమ్మెకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం లారీల యజమానులు, ఏఐఎంటీసీ నాయకులతో కేంద్ర రహదారుల శాఖ అధికారులు చర్చలు జరిపారు.
లారీ యజమానుల ప్రధాన డిమాండ్లయిన డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించడం, కేంద్ర, రాష్ట్ర పరిధిలోని పలు రకాల ట్యాక్సులను తగ్గించడం, టోల్ గేట్లను ఎత్తివేయడం వంటి వాటిని మరోసారి కేంద్రం ముందుంచారు. డిమాండ్లను పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. వీటి అధ్యయనానికి అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది.
సింగరేణిలో పేరుకుపోయిన నిల్వలు
ఎనిమిది రోజులు జరిగిన సమ్మెతో సింగరేణిలో బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. రోజూ 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుండగా.. 8 రోజులుగా 3.2 లక్షల టన్నుల నిల్వలు ఉండిపోయాయి. రైలు రవాణాకు ఆటంకం లేకున్నా.. లారీల ద్వారా జరగాల్సిన బొగ్గు రవాణా స్తంభించిపోయింది.
ఉత్తర తెలంగాణ నుంచి రాజధానితోపాటు వివిధ రాష్ట్రాలకు సరఫరా కావాల్సిన ఇసుక, సిమెంటు, గ్రానైటు, కంకర, మట్టి తదితరాల రవాణా కూడా స్తంభించింది. నల్లగొండలో లారీ సమ్మె అరెస్టుల దాకా వెళ్లింది. సమ్మెలో భాగంగా రోడ్డుపై వాహనాలను అడ్డుకున్న డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, రాత్రంతా తీవ్రంగా కొట్టారని లారీ యజమానుల సంఘం ఆరోపించింది.
రాష్ట్రంలో అర్ధరాత్రిదాటాక విరమణ
దేశవ్యాప్తంగా సమ్మె విరమించినప్పటికీ.. తెలంగాణలో సమ్మె కొనసాగించాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం తొలుత నిర్ణయించింది. అయితే అర్ధరాత్రి దాటాక తాము కూడా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించింది.
బత్తాయికి భారీ నష్టం
పూర్వ నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధికంగా ఉత్పత్తి అయ్యే బత్తాయిపై లారీల సమ్మె ప్రభావం పడింది. సీజన్ కావడంతో రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, విశాఖపట్నం నుంచి కుప్పలుతెప్పలుగా వచ్చిన బత్తాయితో గడ్డిఅన్నారం మార్కెట్‌లో నిల్వలు పేరుకుపోయాయి. రాష్ట్రంలోకి యాపిల్, దానిమ్మ, పుచ్చకాయ తదితరాలు దిగుమతి అవుతుండగా, రాష్ట్రం నుంచి ఒక్క బత్తాయి మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది.
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ నుంచే రోజూ 100 లారీల్లో 600 టన్నుల నుంచి 700 టన్నుల బత్తాయి ఇతర ప్రాంతాలకు తరలుతోంది. ఇందులో 30 శాతం రాష్ట్ర పరిధిలోని ఇతర మార్కెట్లకు వెళ్తుండగా, మరో 60 శాతం ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, ముంబైలకు ఎగుమతి అవుతోంది. టన్ను ధర వేసవిలో రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఉండగా.. తాజాగా లారీల సమ్మె నేపథ్యంలో రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పడిపోయింది..
Comments
Please login to add a commentAdd a comment